ఇంటర్నెట్ : ప్రజా వేగు భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ (26) మృతిపై ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్టు ద్వారా స్పందించారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలాజీ తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ఎలాన్ మస్క్ షేర్ చేస్తూ ‘అది ఆత్మహత్యలా అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో విమర్శలు చేసిన బాలాజీ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో నవంబరు 26న మృతి చెందారు. దీనిపై ప్రాధమిక విచారణ అనంతరం పోలీసులు దీనిని ఆత్మహత్యగా నిర్ధరించారు. కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లి పూర్ణిమారావ్ ప్రైవేటు ఇన్వెస్టిగేటర్ ద్వారా రెండోసారి శవపరీక్ష చేశామని ఆమె తెలిపారు. ఆ ఫలితాలు పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ‘‘సుచిర్ అపార్ట్‌మెంట్‌ను ఎవరో దోచుకున్నట్లు కన్పిస్తోంది. బాత్‌రూమ్‌లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. రక్తపు మరకలు కన్పించాయి. ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తోంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చిచెప్పారు. మాకు న్యాయం జరగాలి. దీనిపై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలి’’ అని పూర్ణిమ కోరారు. ఈ పోస్ట్‌ను ఎలాన్ మస్క్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు.
సుచిర్ బాలాజీ నాలుగేళ్ల పాటు ‘ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేసి, ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవడం లేదన్నారు. చాట్‌జీపీటీ అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అక్టోబరులో ‘న్యూయార్క్‌టైమ్స్’తో బాలాజీ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. 2022లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు ‘ఓపెన్‌ఏఐ’పై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావిస్తోంది.