ప్రముఖ షార్ట్ వీడియా యాప్ టిక్ టాక్ (TikTok) అమెరికాలో తన సేవల్ని నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు ఆండ్రాయిడ్, యాపిల్ వినియోగదార్లకు తన సేవలను నిలిపివేస్తున్నట్లు సందేశాలు పంపిస్తోంది. టిక్ టాక్ పై నిషేధం అమలులోకి రానుండటంతో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నిషేధం అమలులోకి రావడానికి రెండుగంటల ముందే ప్రముఖ యాప్ స్టోర్ల నుంచి తొలగించబడింది.
‘అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానుండగా, అంతకంటే ముందుగానే ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం… శనివారం రాత్రి 10.50గంటకు యాపిల్, గూగుల్ యాప్ స్టోర్ లలో ఈ యాప్ ను నిలిపివేశారు. దీంతో ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నాం’ అంటూ టిక్ టాక్ తన వినియోగదారులకు సమాచారం అందించింది. 170 మిలియన్ల అమెరికన్లు ఈ యాప్ ను వినియోగిస్తున్నారు.
ఇదిలావుండగా, 2017లో ప్రారంభమైన ఈ టిక్ టాక్ ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ దీని వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనని బిల్లులోని సారాంశం. అనంతరం అహెరికా సుప్రీంకోర్టు కూడా టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కు డెడ్ లైన్ విధించింది. జనవరి 19లోగా యూఎస్ టిక్ టాక్ ను విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా? నిర్ణయించుకోవాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ తన వినియోగదార్లకు సమాచారం ఇచ్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక టిక్ టాక్ పునరుద్ధరణకు ప్రయత్నించేందుకు చర్చలు జరుపుతామని ఆ సంస్థ తెలిపింది.