Mar 19,2023 20:27

తెలుగు ఇండిస్టీలో ఇప్పుడో ట్రెండ్‌ నడుస్తోంది. చాలా కాలంగా ఇది కొనసాగుతున్నా.. ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. పాత హీరోయిన్లు కొత్త పాత్రల్లో కనిపిస్తున్నారు. గతంలో అయితే ఇండిస్టీలో పది నుండి 20 ఏళ్ల పాటు కొనసాగిన నటీమణులు ఉన్నారు. కాని ఇప్పుడలా లేదు. హీరోయిన్స్‌ కాలపరిమితి సంవత్సరాల నుండి సినిమాలకి పడిపోయింది. ఒకటి రెండు సినిమాల్లో కనిపించడం ఆ తరువాత తెరమరుగవ్వడం చూస్తున్నాం. పెళ్లి తరువాతో.. లేక అవకాశాలు రాకో ఇండిస్టీకి దూరమైన హీరోయిన్లంతా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టడం సాధారణ విషయమే.. తాజాగా కొంతమంది వరుస అవకాశాలతో నటిస్తుంటే మరికొంతమంది అడపాదడపా కనిపిస్తున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ పక్కన హీరోయిన్లుగా చేసిన విజయశాంతి, రాధిక, రాధ, సుహాసిని, సుమలత, అమల తదితర హీరోయిన్లలో రాధిక, సుహాసిని తల్లి, అత్త పాత్రలతో ఎప్పుడో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. అయితే చాలా విరామం తీసుకున్న విజయశాంతి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మహేష్‌బాబు తల్లి పాత్రలో నటించి మెప్పించారు. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన అమల 'ఒకే ఒక జీవితం' సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. రాధ కూడా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే ఆ తరువాత జాబితాలో ఉన్న రమ్యకృష్ణ, రంభ, రాశి, మీనా, ఆమని, ఇంద్రజ ఇదివరకే రెండోసారి ఇన్నింగ్స్‌ ప్రారంభించేశారు. అందరికంటే ముందు రమ్యకృష్ణని చెప్పుకోవాలి. ఆ తరువాత రాశి, మీనా వరుసగా తల్లి, అత్త, అమ్మ, అక్క, వదిన పాత్రల్లో మెప్పించారు. కొంచెం ఆలస్యంగా ఆమని, ఇంద్రజ కూడా యువ హీరో, హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.
ఒకప్పటి హీరోయిన్‌ జీవిత కూడా రజనీకాంత్‌ తాజా సినిమా 'లాల్‌ సలాం' చిత్రంలో 30 ఏళ్ల తరువాత చెల్లెలి పాత్రలో కనిపించబోతూ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.
ప్రియమణి, స్నేహ, భూమిక, సిమ్రాన్‌ తరువాత ఈ మధ్య కాలంలో ఇంద్రజ, ఆమని ఎక్కువ అవకాశాలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో లైలా, మీరాజాస్మిన్‌, రేణుదేశారు కూడా చేరారు. సదా కూడా వెండితెరపై మరోసారి మెరవాలనుకుంటున్నారు. భూమిక, లైలా, సిమ్రాన్‌, స్నేహ, ఇలియానా, సదా, ప్రియమణి, మీరా జాస్మిన్‌ కూడా వరుస అవకాశాల కోసం సిద్ధమవుతున్నారు. అప్పట్లో హీరోయిన్లుగా ఉన్న పోటీ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ పాత్రల్లో కూడా కనిపిస్తోంది.
కేవలం రెండు చిత్రాల్లోనే (బద్రి, జానీ) నటించి ఇండిస్టీకి దూరమైన రేణుదేశారు, రవితేజ నటిస్తున్న 'టైగర్‌ నాగేశ్వరరావు' చిత్రంలో హేమలతా లవణం వంటి శక్తివంత పాత్రలో కనిపించబోతున్నారు. మీరాజాస్మిన్‌ కూడా రామ్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని చిత్రంలో ఓ పాత్రతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. జూనియర్‌ ఎన్‌టిఆర్‌ చిత్రం 'రూలర్‌', నాని నటించిన 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భూమిక ఆ తరువాత 'యు టర్న్‌', 'సవ్యశాచి' చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించారు. 2008 లోనే సూర్య సినిమా 'సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌' చిత్రంలో ఒక పాత్రలో సూర్యకు తల్లిగా సిమ్రాన్‌ కనిపించారు.
అవకాశాలు పుష్కలంగా వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన లయ మంచి పాత్రలు వస్తే మళ్లీ నటిస్తానని చెబుతున్నారు. చాలా విరామం తర్వాత 'విక్రమ్‌' సినిమాలో లైలా కనిపించారు. తాజాగా 'శబ్దం' చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నారు.
ఏ దర్శక, నిర్మాతల ప్రాజెక్టుల్లో హీరోయిన్లుగా కనిపించారో వారితోనే.. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడం, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా నటించడానికి సిద్ధమైన ఈ నటీమణులు మున్ముందు మరిన్ని అవకాశాలతో కనిపించాలని ఆశిద్దాం..