Mar 17,2023 23:31
  • పట్టభద్రుల్లో ప్రభుత్వ వ్యతిరేకత
  • ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో అధిక్యతలో టిడిపి
  • పశ్చిమ రాయలసీమలో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ
  • ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గట్టెక్కిన వైసిపి

ప్రజాశక్తి-యంత్రాంగం : శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో వైసిపికి గట్టి ఝలక్‌ తగిలింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో టిడిపి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమలో ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. ఈ మూడు శాసన మండలి స్థానాలు ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇంత కీలకమైన ఈ ఎన్నికల్లో టిడిపి బాగా పుంజుకుంది. వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలోనూ వైసిపి గట్టెక్కింది. ఉత్తరాంధ్ర శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఆధిక్యతలో ఉన్నారు. విజయానికి అతి చేరువలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు 82,977 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లతో రెండు స్థానంలో ఉన్నారు. పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు 35,148 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మేజిక్‌ ఫిగర్‌ ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రయార్టీ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 2,13,035 పోలయ్యాయి. వీటిలో 12,318 ఓట్లు చెల్లలేదు. మొత్తం 37 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, బిజెపి అభ్యర్థి పివిఎన్‌.మాధవ్‌కు 10,884 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన డిపాజిట్‌ సైతం కోల్పోయారు.

తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) శాసన మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి ముందంజలో ఉన్నారు. ఆయనకు 1,12,514కు ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85,252 ఓట్లు పోలయ్యాయి. పిడిఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి 38,001 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డికి 6,341 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్‌ కోల్పోయారు. ఈ నియోజక వర్గంలో 2,69,339 పోలయ్యాయి. వీటిలో 20,979 ఓట్లు చెల్లలేదు. ఇక్కడ 22 మంది పోటీ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో నెగ్గాలంటే చెల్లిన 2,48,360లో 1,24,181 రావాల్సి ఉంది. ఏ అభ్యర్థికీ మేజిక్‌ రాకపోవంతో ఎలిమినేషన్‌ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు.
పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గంలో వైసిపి, టిడిపి మధ్య నువ్వా... నేనా అన్నట్టుగా వస్తున్న ఫలితాలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. మొత్తం 2,44,307 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 15,104 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 1,92,018 ఓట్లు లెక్కించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరిగా వైసిపి అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డికి 74,678 ఓట్లు, టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి 73,229 ఓట్లు వచ్చాయి. 1449 ఓట్ల మోజార్టీతో వైసిపి అభ్యర్థి ఉన్నారు. పిడిపి అభ్యర్థి పోతుల నాగరాజుకు 15,254 ఓట్లు వచ్చాయి. మిగిలిన 46 మంది అభ్యర్థులకు నామమాత్రంగా ఓట్లు వచ్చాయి.
తూర్పు రాయలసీమలో పి చంద్రశేఖర్‌రెడ్డి, పశ్చిమ రాయలసీమలో వైసిపి అభ్యర్థులు ఎంవి రామచంద్రారెడ్డి గెలుపు
రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. హోరాహోరీగా ఈ పోరు సాగింది. స్వల్ప అధిక్యతలతో ఈ రెండు చోట్లా వైసిపి అభ్యర్థులు గట్టెక్కారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్‌ ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకూ కొనసాగింది. తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు) ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసిపి అభ్యర్థి పర్వత చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. ఆయనకు పిడిఎఫ్‌ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మేజిక్‌ ఫింగర్‌ ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ప్రక్రియతో 1043 ఓట్ల ఆధికత్యను చంద్రశేఖర్‌రెడ్డి సాధించారు. మొత్తం 24,291 ఓట్లకుగానూ ఆయను 11,714 ఓట్లు, బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి. 1906 ఓట్లు చెల్లలేదు. మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైసిపి అభ్యర్థి ఎంవి.రామచంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఆయనకు ఎపిటిఎఫ్‌ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఒంటేరి శ్రీనివాసరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యతలో ఎంవి.రామచంద్రారెడ్డికి ఆధికత్య సాధించనప్పటికీ మేజిక్‌ ఫిగర్‌ సాధించలేకపోయారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసరెడ్డి పుంజుకున్నారు. దీంతో, ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి 169 ఓట్ల స్వల్ప మెజార్టీతో రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయనకు 10,787 ఓట్లు వచ్చాయి. శ్రీనివాసరెడ్డికి 10618 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరిలోనూ ఎవరికి 50 శాతానికిపైగా ఓట్లు రానప్పటికీ ఎలిమినేషన్‌ పూర్తయ్యే సమయానికి అత్యధిక ఓట్లు కలిగిన ఎంవి.రామచంద్రారెడ్డిని విజేతగా ప్రకటించారు. పిడిఎఫ్‌ అభ్యర్థి, సిట్టంగ్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డికి 4,162 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి డాక్టర్‌ అనిల్‌ వెంకట ప్రసాద్‌రెడ్డికి 3212, జి.వి.నారాయణరెడ్డికి 1345 ఓట్లు వచ్చాయి. మొత్తం 25,879 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 608 ఓట్లు చెల్లలేదు. 25,271 ఓట్లను వాలిడ్‌గా గుర్తించారు.