May 14,2023 12:40

హాల్లో అరలో దేనికోసమో వెతుకుతున్నప్పుడు, మా పిల్లాడి పదో తరగతి పుస్తకం కనిపించి, ఇది ఇక్కడుంది ఏంటా? అని పేజీలు అటూ ఇటూ తిప్పుతూ ఉన్నప్పుడు ఎందుకో ఉన్నట్టుండి ఎప్పుడో చదువుకునే రోజుల్లో క్లాసురూములో నెమలీక ఇచ్చిన విమల గుర్తొచ్చింది. తెలియకుండానే ఒక్కసారిగా మనసంతా విమల వైపు మళ్ళింది. నెమలీక ఇస్తున్నప్పుడు తన కళ్ళను నెమలీక సందుల్లోంచి చూసానా! ఎంతలా మెరిసిపోతున్నాయో!! ఇదిగో ఇది నీకే అని మళ్ళీ తను కొంచం గట్టిగా అన్న వరకూ, అలా ఆ మెరుపులోనే లీనమైపోయాను.
విమలది, నాదీ చిన్నప్పటి నుంచి ఒకే పల్లె, అదే బడి, ఒకటే తరగతి. కలిసే తిరిగేవాళ్ళం, కలిసే ఆడుకునేవాళ్ళం. ఎందుకో ఎప్పుడూ లేనిది ఆ రోజు నుండి నాకు విమల కొత్తగా అనిపించేది. ఆ రోజు నుంచి తను ఉన్న క్షణాలు, తను లేని క్షణాలు విడివిడిగా అనిపించేవి. తన మాటలని, నవ్వుని, ప్రవర్తనని మరలా మరలా జ్ఞప్తికి తెచ్చుకునేవాడిని.
తనని చూడాలి, తనతో మాట్లాడాలి అని అనిపించినప్పుడల్లా వారి ఇంటి ముందుకు వెళ్ళి అటూ ఇటూ నాలుగు ఐదుసార్లు తిరిగేవాడిని. ఎవరైనా గమనిస్తున్నారేమో నని భయపడేవాడిని కూడా. తను మాత్రం చాలా సాదాగా నన్ను చూడగానే బయటికి వచ్చి, కాసేపు మామూలుగానే మాట్లాడి వెళ్ళిపోయేది.
ఓ రోజు బడికి విమలా వాళ్ళ నాన్న వడివడిగా రావడం నేను కిటికీలోంచి చూసాను. ఎందుకో నా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టంది. బడి పంతులుతో ఏదో మాట్లాడి, విమలని పుస్తకాలతో సహా తరగతి గదిలోంచి బయటకు తీసుకెళ్ళడం, వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, విమల నా వైపు చూడడం అన్నీ నా గుండె వేగంతో పాటే పరిగెట్టేలా జరిగిపోయాయి.
ఏమై ఉంటుందో నని ఇంటికి వెళ్ళిన వెంటనే పుస్తకాల బ్యాగ్‌ ఇంట్లో పడేసి, పరిగెత్తుకుంటూ వెళ్ళి విమల ఇంటిముందు ఎప్పటిలానే చాలాసేపు తచ్చాడాను. వాళ్ల ఇల్లంతా హడావుడిగా ఉంది. చాలాసేపటకి విమల బయటకు వస్తున్నట్టు కనిపించింది. ద్వారం దాటి బయటకి ఎప్పుడు వస్తుందా అని ఎంత వేచి చూస్తున్నా విమల బయటకి రావడం లేదు. తను ద్వారం ప్రక్కనే ఉన్న కిటికీకి తన రెండు చేతులూ ఆనిస్తూ బయటకి అలా నేల చూపులు చూస్తూ ఉండడం నేను అనుకోకుండా చూసాను. కిటికీ లోంచి అయినా నన్ను పిలిచి మాట్లాడుతుందే మరి ఎందుకు మాట్లాడడం లేదు అని ఆలోచించేలోపే తనని ఎవరో పిలవడం, తను ఇంట్లోకి వెళ్ళి పోవడం చకా చకా జరిగి పోయాయి.
ఏదో జరిగింది. వాళ్ళ నాన్న విమలని బడి నుంచి మధ్యలో ఎందుకు తీసుకొచ్చాడు. విమల వెళ్తూ వెళ్తూ నావైపు ఎందుకు చూసింది. విమల ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మనసంతా ఎందుకో అకస్మాత్తుగా ఏదో తెలియని భయంతో నిండిపోయింది. అయినా నేనెందుకు భయపడాలి. నేను ఎప్పుడూ విమలతో తప్పుగా మాట్లాడలేదే. తప్పుగా ప్రవర్తించలేదే... వేరెవరి దగ్గర కూడా విమల గూర్చి నేను ఏమీ చెడుగా అనలేదే. నా ఆలోచనల వేగాన్ని అందుకున్న నా కాళ్ళు, అమ్మ 'ఏరా బడి నుంచి రాగానే కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు' అని అడిగేసరికి, ఇంటివరకు వచ్చేసానని ఆగిపోయాను.
అమ్మ ఏదో తిను అని నా చేతిలోపెట్టింది గాని నేను అక్కడ లేను. అమ్మ 'ఏమైంది నాన్న అలా ఉన్నావు' అని అడిగింది కానీ చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. అసలు ఏమి జరిగిందో నాకు తెలియదు. నాకు ఎవరు చెబుతారు. ఎవరిని అడగాలి నేను. ఒకవేళ తెలిసినా అమ్మ అడిగినదానికి సమాధానం ఏదైనా, విమల విషయం కదా, నేను చెప్పగలనా అని నాలో నేను అనుకుంటుండగానే, అమ్మ, ఒరేరు విమలకి ఈ రోజు మంచి సంబంధం వచ్చిందిరా! అబ్బాయిది మంచి ఉద్యోగం అట. ఆస్తులూ పాస్తులు బాగున్నాయట. విమల కూడా అతనికి బాగా నచ్చిందట. త్వరలో పెళ్ళి అట రా, అంది. అంతే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన నేను, నాలో ఒక్కసారిగా భయం పోయినట్టు గమనించాను గానీ ఏదో తెలియని దిగులు గుండెను తాకింది.
హాలు అరలో దేనికోసమో వెతుకుదామని వచ్చిన నేను, మా వాడి పదో తరగతి పుస్తకం చూసి, విమల గుర్తొచ్చి అలానే సోఫాలో కూర్చిండిపోయానా, ఒక్కసారిగా కాలింగ్‌ బెల్‌ మోగితే గానీ గతంలోంచి ఇక్కడకి రాలేకపోయాను. ఎవరా అని తలుపు తీసి చూశాను.
ఎదురుగా ఎక్కడో చూసిన మొహమే, కానీ ఎవరో సరిగా తెలియని ఆడ మనిషి. మా ఆవిడ కోసమేమోనని వెనక్కి తిరిగి ఆవిడని పిలుద్దామని అనుకునేలోపు నన్ను గుర్తు పట్టేరా, అంది. ఎవరా అని మరలా చూసేసరికి గుండే చాలా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. 'మీరు...మీరూ... విమల నా' అని నాకు తెలియకుండానే అనేశాను. 'అవును అని చాలా ఆనందంగా అన్నట్టు తల ఊపింది. తన కళ్ళలో కొంచం నీళ్ళు కూడా కనిపించాయి. చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో పల్లె మాది. ఈ పట్నంలో మా ఇంటికి విమల ఎలా వచ్చింది? తన వస్తుందని నాకు తెలియదు అయినా తనకంటే ముందే తన జ్ఞాపకాలు నాకు మరలా ఎలా గుర్తొచ్చాయి. కలనో, ఊహనో తెలిసి తేరుకునే లోపలే విమలని లోపలకి ఆహ్వానించడం, మా ఆవిడని పిల్లలని పరిచయం చేయడం, తను, మేము వాళ్లు ఉంటున్న ఈ ఊరులోనే ఉంటున్నామని తెలుసుకొని, వాళ్ళ పెద్దపాప పెళ్ళికి ఆహ్వానమివ్వడం అన్నీ చకా చకా జరిగిపోయాయి.
విమల తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇంటి నుండి బయట రోడ్డు వరకు మేమూ మర్యాద పూర్వకంగా బయటకు రావడం, తను వీధి చివర వరకు వెళ్ళి మలుపు తిరిగే వరకూ, నా మనసు మా ఇంటి గడప మెట్లు ఎక్కకపోవడం ఓ ఊహించని అద్భుత సంఘటనే! 'కాలం జ్ఞాపకాలను దాచేయగలదేమో గాని, మాయం చెయ్యలేదు కదా!' అని నేను అనుకుంటుండగా.. మా వాడు, 'నాన్నా, ఈ పుస్తకం నాది, దాన్ని ఎందుకు బయటకు తీశావ్‌. అందులో నాకిష్టమైన నెమలీక ఉంది. పడేసావా...ఉందా అని కంగారుగా పుస్తకంలో వెతకడం ప్రారంభించాడు. పోయినా ఇష్టమైనవి ఎప్పటికీ మనసులో భద్రంగానే ఉంటాయని వాడి వయసుకి అర్థంకాదు కదా...!

తిప్పాన హరి రెడ్డి
9493832412