డావో.. సహజ జీవన మార్గం..

Dec 10,2023 12:21 #book review, #Sneha

డాక్టర్‌ కాళ్ళకూరి శైలజ కలం నుండి వెలువడిన ఓ అద్భుతమైన, ఆధునిక మానవుడికి అత్యావశ్యకమైన ప్రాకృతిక జీవన స్పృహను జాగృతం చేసే ఒక గొప్ప పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని మూడేళ్ల క్రిందట రచయిత ఆంగ్లంలో చదివిన వెంటనే, ఆ భావ ధారతో తాదాత్మ్యం చెందారు. ఎంత కష్టపడైనా దీన్ని తెలుగులోకి అనువాదం చేయాలన్న సంకల్పం తీసుకున్నారు ఆమె. అందుకుగాను ఆమె మూడు సంవత్సరాలపాటు తన వ్యక్తిగత, వృత్తి గత కార్యకలాపాలను నిభాయించుకున్నారు. సంక్లిష్టమైన ఈ రచనను, సరళమైన తెలుగు భాషలో మూలానికి సంబంధించిన భావధారకు ఏమాత్రం ఔచిత్య భంగం కలగకుండా అనువదించారు. అందుకు రచయిత ఎంతేని ప్రశంశాపాత్రురాలు.

అసలు ‘డావో’ అంటే సహజ జీవన మార్గం అని అర్థం. ఈ మార్గాన్ని ప్రపంచానికి మొట్టమొదటి సారిగా ఎత్తి చూపించిన వాడు ‘లావో జి’ అనే చైనా ఫిలాసఫర్‌. ఆయన దాదాపుగా మరో పేరెన్నికగన్న చైనా ఫిలాసఫర్‌ కన్‌ఫ్యూషియస్‌ కన్నా వయసులో కొంచం పెద్దవాడు అంటారు. అయితే, ఆధునిక కాలపు పరిశోధకులు మాత్రం అటువంటి పేరుగల వ్యక్తి చారిత్రకంగా లేడని, అనాదిగా సమాజంలో, ప్రచారంలో వున్న కొన్ని వివేక సూత్రాలను ఆ పేరు మీద సంకలనం చేసి, ప్రచారంలోకి తెచ్చారని చెబుతున్నారు.

మొత్తం మీద ఏడు ఖండికలుగా విభజించబడిన ఈ గ్రంథంలో అత్యధిక భాగం ఒక గురువు తనను ఆశ్రయించి వచ్చిన శిష్యుని సందేహాలకు తగు విధంగా నివృత్తి మార్గాలను వివరించడం వుంటుంది. ఈ పుస్తకాన్ని మిగతా పుస్తకాల మాదిరిగా ఏకబిగిన చదివి, ఆవల పడవేయడానికి సాథ్యం కాదు. ప్రతిరోజూ కొద్ది కొద్దిగా పారాయణ గ్రంథం మాదిరిగా చదువుకుంటూ ఉండాలి. అప్పుడే అందుబాటులో వున్న వనరుల సాయంతో, తేనె పట్టును పిండితే కొద్ది కొద్దిగా తేనె దొరికినట్టుగా దీనిలోని అసలు తత్త్వం అవగాహన కొస్తుంది. అట్లా అవగాహనకు వచ్చినకొద్దీ అన్నీ వుండి ఏమీలేని దానిగా కనిపించే ప్రకృతి మూలల్లోకి మనం తిరిగి చేరుకోవడానికి ఒక మార్గం దొరుకుతుంది.

ఇందులో ఓ చోట కళారూపాలకు చూపిన నిజమైన ప్రాకృతిక ఉదాహరణలను చూస్తే పాఠకుల నయనాలు ఆనందంతో విశాలమవుతాయి. అవి నెమలీకలోని రంగుల కలనేత, దర్జీపిట్ట అల్లిన గూడు, ఋతువర్ణాలతో ముస్తాబయ్యే భూమి, సూర్యచంద్రుల కాంతిని మేఘాల నడుమ పొదువుకున్న ఆకాశం. మరోచోట, ఒక పాటను రచించడమంటే ఆ కవి ఎంత సంవేదన చెందాలో ఇలా వివరించబడింది. మనిషి ఒక పాటను సృష్టించడమంటే ఒక వాగు రాళ్ళపై ప్రవహించినంత సులభం కాదు. మొదట తగినంత శిక్షణ తీసుకోవాలి, సాధన చేయాలి. గీత రచనా సంవిధానం, ఛందస్సు సమగ్రంగా నేర్చుకోవాలి. అట్లా పాట అంటే పొంగి పొర్లవలసిన నిజమైన ఊట. మరొక చోట కళను గురించి చెబుతూ.. ఏదైతే కాలానుక్రమంలో పుట్టి, ఆ తరువాత సమసిపోకుండా, శాశ్వతత్వం నుండి ఆరంభమై, అంతే గాంభీర్యంతో నిలిచి ఉంటుందో అదే కళ. ఇందులో ప్రేమను గురించి కూడా గొప్పగానూ, కొంత విభిన్నంగానూ చెప్పబడింది. అదేమిటంటే..

‘మహిమాన్వితమైన జీవరసం ఏదైనా ఉంటే అది ప్రేమే! ప్రేమ గాలిలాంటిదైతే, ఆప్యాయత నీటి వంటిది. గాలి లేక ప్రాణం లేదు. కానీ, నీరు లేనిది జీవం సాధ్యం కాదు కదా! నీటికి దాహాన్ని తగ్గించి, ప్రాణాన్ని పోషించే మెరుగైన లక్షణం ఉంటుంది. అలాగే బదులు కోరే ప్రేమకన్నా ఏమీ కోరుకోని ఆప్యాయతతోనే అనుబంధాలు ధృఢంగా ఉంటాయి. ప్రేమ మోహంతో ముడిపడి బంధించే సంకెలలా కాక, సహజసిద్ధమైన గాలి, నీరు, సూర్యకాంతి, వాన, పూగంధంలా విస్తరించినప్పుడే మనిషికి ఆనందాన్నిస్తుంది’ అంటూ రచయిత్రి శైలజ తనదైన శైలిలో వ్యాఖ్యానించడం చదువరికి గొప్పగా అన్పిస్తుంది.

ప్రేమ అంటే చైతన్యం. చరచరా సృష్టిని, అందులో నిన్నూ స్పష్టంగా చూడగల ఎరుక ప్రేమ. నిర్మలానంద, చిరంతన ప్రేమను మన’ ఏలిక’ గా మనమంతా గుర్తెరగాలి. సుఖదుఃఖాలు నదిలో నీళ్ళు/జీవితం నదీగర్భం. డావో.. ఒక జీవన విధానం.

ముందు మాటలు, తుది పలుకులు విడిచి పెట్టి సుమారు తొంభై పేజీలు మాత్రమే వున్న ఈ చిన్ని పుస్తకం జిజ్ఞాణువులైన పాఠకులందరూ తప్పకుండా చదవాల్సిన ఒక అద్భుతమైన గ్రంథం. ఇందులోని ఒక్కో పదం ఒక్కో జ్ఞాన దొంతర. ఆ దొంతరలోని ప్రత్యక్షర సందేశాన్ని నిశితంగా ఆవాహన చేసుకొని, ప్రతివారూ శాంతి, ప్రేమ, కరుణ, సంయమనంతో హాయిగా జీవించడం ఎలాగో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

– శిరంశెట్టి కాంతారావు

9849890322

  • డావో.. సాగిపో హాయిగా..!
  • పేజీలు – 125
  • ధర – రూ.150.00 లు
  • ప్రచురణ, లభించే స్థలం – అనల్ప బుక్‌ కంపెనీ, హైదరాబాద్‌
  • సెల్‌ : 709 3800 303.
➡️