రక్త దాత.. జీవన దాత

‘హలో అక్కా! మనవాళ్లలో ”ఎ-నెగిటివ్‌” బ్లడ్‌ గ్రూపు ఉన్నవాళ్లు ఉన్నారా? అర్జంట్‌గా కావాలి.’ ‘తమ్ముడూ మా అమ్మకి యాక్సిడెంట్‌ అయ్యింది. అర్జంటుగా ఓ పాజిటివ్‌ బ్లడ్‌ కావాలి. లేకపోతే అసలు రక్తం ఇచ్చే వాళ్లు ఎవరున్నా నలుగురినైనా అర్జంటుగా పంపు. వారి గ్రూపు ఏదైనా, అది తీసుకుని, మనకవసరమైన గ్రూపు ఆసుపత్రివాళ్లే ఇస్తారంట!’ ఇలాంటి స్థితి మనం నిత్య జీవితంలో ఎన్నోసార్లు ఎదుర్కొనే ఉంటాం.

శాస్త్ర, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజంలో మనం సొంతగా తయారు చేయలేనిది ఏదైనా ఉందీ అంటే అది రక్తం ఒక్కటే. మన దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రతిఏటా సుమారు ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుందనేది నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తున్నది మాత్రం కేవలం 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు తెలియజేస్తున్నాయి. మనదేశంలో ప్రతిరోజు దాదాపు 12 వేల మంది రక్తం దొరకని కారణంగా మరణిస్తున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగాయి. అయినప్పటికీ రక్తదాతల నుంచి వస్తున్న స్పందన మాత్రం ఆ అవసరాలను తీర్చేంత లేవన్నది వాస్తవం. ఈ నెల 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా దీనిపైనే ఈ ప్రత్యేక కథనం.

‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. రక్తదానం అనేది ఎంత ప్రాముఖ్యం గలదో, రక్తదానం చేసిన, చేయదల్చుకున్న వ్యక్తుల వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందో చాటి చెప్పడమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం. ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన రక్తమార్పిడి చేయడం, రక్తం అవసరం పడ్డ ప్రతి ఒక్కరికీ రక్తం అందేలా చూడటం, సరిపడా రక్తం ప్రతి దేశంలో అందుబాటులో ఉండేలాగా చూడటం ఈ రక్త దాన దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థతో అనుబంధంగా రకరకాల ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందులో ‘అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ఫెడరేషన్‌, అంతర్జాతీయ రక్త మార్పిడి సొసైటీ, అంతర్జాతీయ రక్త దాతల ఫెడరేషన్‌’ ముఖ్యమైనవి. ఈ సంస్థలన్నీ రక్తదానం పట్ల అవగాహన పెంచడానికి, రకరకాల కార్యక్రమాలు చేపడతాయి.
మన దేశంలో కూడా రక్తదానం పట్ల సామాజిక అవగాహన పెంచడానికి, ఎక్కువ మందిని రక్తదానం చేసేలాగా ప్రోత్సహించడానికి, రక్తదానం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపడానికి ప్రభుత్వం చీAజఉ అనే సంస్థ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో రేడియోలో, టీవీలలో, రవాణా స్థలాల్లో ప్రకటనలను మనం చూడొచ్చు.

చరిత్ర..
పూర్వకాలం నుండి మనకి రక్తమార్పిడి గురించి తెలిసినా, జంతువుల రక్తం ఉపయోగిండం వల్ల చాలా సమస్యలు వచ్చేవి. కొందరు మనుషుల రక్తం ఉపయోగించినా కూడా అప్పట్లో బ్లడ్‌ గ్రూపులు తెలియవు కాబట్టి, చాలామంది రియాక్షన్లతో చనిపోతూ ఉండేవారు.
కార్ల్‌ ల్యాండ్‌ స్టీనర్‌ 1901లో ఏ బి ఓ బ్లడ్‌ గ్రూపుల వ్యవస్థ కనుగొన్నారు. మొదట్లో ఏ, బి, మరియు ఓ గ్రూపులు మాత్రమే కనుగొన్నారు. ఆ తర్వాత ఏబీ గ్రూపు కూడా ఉంటుందని తెలుసుకున్నారు. ఆయన మనుషుల రక్తం అంతా ఒకటి కాదని, అవి ఒకదానితో ఒకటి కలిస్తే ప్రమాదమని, వేరే వేరే గ్రూపుల కి సంబంధించిన వారి రక్తాలు కలిస్తే ముద్దలు కడుతుందని కనుక్కున్నారు. ఈయనకి 1930 సంవత్సరంలో ఫిజియాలజీ / మెడిసిన్‌లో నోబెల్‌ ప్రైజ్‌ కూడా వచ్చింది. ఈయనే నలభై సంవత్సరాల తర్వాత వీనర్‌ అనే మరొక శాస్త్రవేత్తతో కలిసి ఆర్హెచ్‌ నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ని కూడా కనుగొన్నారు.
అప్పటి నుండి ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఎర్ర రక్తకణాల పైన ఉన్న ఆంటీజెన్లను బట్టి చాలా రకాల బ్లడ్‌ గ్రూపులను కనుగొన్నారు. ఈ రోజుకి కనీసం 30 రకాల బ్లడ్‌ గ్రూపులను కనుగొన్నారు. కానీ ఇవ్వన్నీ కూడా మనకి టెస్టు చేసే అవసరం పడదు. అన్ని ఆవిష్కరణల్లాగే, బ్లడ్‌ గ్రూపులను కనుగొనడం ఒక ఎత్తు అయితే, దాన్ని సమాజం కోసం లేదా వ్యక్తుల ప్రాణాలను కాపాడటం కోసం ఉపయోగించడం మరొక ఎత్తు.
అయితే రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఆరోగ్యం, చికిత్స విభాగాల్లో జరిగిన వేగవంతమైన అభివృద్ధి వలన, రక్తం కావాల్సిన చోటుకి రవాణా, ఎక్కువ కాలం నిల్వ చేయడానికి గల పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి. ఆ కాలంలోనే యుద్ధంలో గాయపడిన ఎందరో జవానులకి రక్తం ఎక్కించి, వారి ప్రాణాలు కాపాడటం జరిగింది.

క్యాంపులు.. సేకరణలు..
ఈ రోజున దేశవ్యాప్తంగా రకరకాల రక్త దాన క్యాంపులు నిర్వహిస్తారు. ఈ క్యాంపులు ఆసుపత్రులు, ఎన్జీవోలు, విద్యా సంస్థలు వగైరా నడిపిస్తూ ఉంటాయి. మనదేశంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రభుత్వంతో కలిసి ప్రపంచ రక్త దాన దినోత్సవం లో పాల్గొంటుంది. రక్తదానం చేసిన వాళ్ళని కొంత మందిని ఈరోజు సత్కరిస్తారు కూడా. ఈ మధ్య సోషల్‌ మీడియా ద్వారా కూడా రకరకాల ఆర్గనైజేషన్లు రక్త దాతలని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాయి. మనం రక్తదానం చేస్తామని అంగీకరించి, మన బ్లడ్‌ గ్రూపు, మనం ఉండే స్థలం నమోదు చేసుకుంటే, మనం ఉన్న స్థలానికి దగ్గర ఎవరికైనా రక్తం అవసరం పడితే, వెంటనే మనకి నోటిఫికేషన్‌ పంపిస్తారు. ‘మీ దగ్గర్లో ఈ ఆసుపత్రిలో ఒక వ్యక్తికి మీ గ్రూపు రక్తం అవసరం ఉంది, మీకు కుదిరితే రక్తదానం చేయండి’ అని మెసేజ్‌ పంపుతారు.

 


ఎవరెవరు చేయొచ్చు?

 • మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్న ప్రతి మనిషీ రక్త దానం చేయడానికి అర్హులు.
 • రక్తదానం చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 65 సంవత్సరాలు ఉండాలి. బరువు కనీసం 50 కిలోలు ఉండాలి.
 • ఒక్కసారి రక్త దానం చేసినప్పుడు మన శరీర బరువుని బట్టి 350ఎంఎల్‌ నుండి 450ఎంఎల్‌ రక్తం వరకూ తీసుకుంటారు.
 • ఒకసారి రక్త దానం చేశాక, మళ్ళీ చేయాలంటే పురుషులకు కనీసం మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది. మహిళలైతే నాలుగు నెలలు ఆగాలి. ఈ సమయంలో మన రక్త కణాలు అన్నీ మళ్ళీ ఉత్పత్తి అయి, శరీరం మామూలు స్థితికి చేరుకుంటుంది.
 • రక్తదానం చేయాలంటే మన కనీస బీపీ 100/60 కంటే ఎక్కువ, 140/90 కంటే తక్కువా ఉండాలి.
 •  మన రక్తంలోని హిమోగ్లోబిన్‌ శాతం 12.5% కంటే ఎక్కువగా ఉండాలి.
 • రక్తదాత రక్త దానం చేసే ముందు ఉపవాసం ఉండకూడదు. రక్తదానం చేసేవారు తిని కనీసం ఒక నాలుగు గంటలు అయినా అయి ఉండాలి.
 • రక్తదానం చేసే ముందు మందు సిగరెట్‌ వంటివి తాగకూడదు.
 •  రక్తదానం చేశాక విపరీతమైన శారీరక శ్రమ చేయకూడదు. పైలెట్లు / ప్రయాణీకులు రక్తదానం చేసిన వెంటనే విమానం ఎక్కి ప్రయాణం చేయడంలాంటివి చేయకూడదు.
 • రక్తదానం చేసే వ్యక్తికి హెచ్‌.ఐ.వి కానీ హెపటైటిస్‌ బి కానీ, హెపటైటిస్‌ సి కానీ ఉండకూడదు.
 • రక్తదానం చేసే వ్యక్తికి ఎటువంటి రిస్క్‌ బిహేవియర్‌ ఉండకూడదు. అంటే ఒకరి కన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు.
 • డెలివరీ అయిన సంవత్సరం వరకూ స్త్రీలు రక్తదానం చేయకూడదు. అబార్షన్‌ అయిన ఆరు నెలల వరకు కూడా రక్తదానం చేయకూడదు.
 • పాలు ఇచ్చే తల్లులు కూడా రక్తదానం చేయకుండా ఉంటే మేలు.
 • మహిళలు నెలసరి సమయంలో రక్తదానం చేయకూడదు.
 • జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు తదితర ఇన్ఫెక్షన్లు ఉన్నట్టయితే అవి తగ్గాకనే రక్తదానం చేయాలి.
 • మలేరియా, డెంగ్యూ, జీకా వైరస్‌లు ఉన్నవారు. లేదా అవి ఉన్న ప్రాంతాల్లో ప్రయాణం చేసినవారు కొంతకాలం వరకూ రక్తదానం చేయకూడదు.
 • ఆస్తమా ఉన్నవాళ్లు, వివిధ కారణాల వల్ల స్టిరాయిడ్లు వాడుతున్న వారు రక్తదానం చేయకూడదు.
 • ఏదైనా ఒక మేజర్‌ సర్జరీ తర్వాత సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు. మైనర్‌ సర్జరీ అయితే ఆరు నెలల వరకు రక్తదానం చేయకూడదు.
 •  పచ్చబొట్టు వంటివి వేయించుకున్నప్పుడు ఆరునెలల వరకూ రక్తం ఇవ్వకూడదు.
 •  మీరే గనుక ఎప్పుడైనా రక్తం తీసుకుని ఉంటే సంవత్సరం వరకూ ఎవరికీ రక్తదానం చేయకూడదు.
 • హార్ట్‌ సర్జరీ జరిగిన వాళ్ళు, బైపాస్‌ సర్జరీ జరిగిన వాళ్ళు, క్యాన్సర్‌ సర్జరీ జరిగిన వాళ్లు ఎవరు కూడా రక్తదానం చేయకూడదు.
 • గుండె సంబంధిత వ్యాధులు, మెదడుకి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు కూడా రక్తదానం చేయకూడదు.
 • మధుమేహం, బీపీ సమస్య ఉన్న వాళ్ళు అవి మందులతో కచ్చితంగా కంట్రోల్‌లో ఉంటే రక్తదానం చేయవచ్చు. ఇన్సులిన్‌ పైన ఉన్నవాళ్లు రక్తదానం చేయకూడదు.
 • ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా రక్త దాన శిబిరం లేదా ఆసుపత్రిలో ఉండే ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడి, తాను రక్తదానం చేసినందువలన తనకి గానీ, గ్రహీతకి గానీ ఎలాంటి హనీ కలగదని నిర్ధారించుకున్నాకనే చేయాలి.
 • కొన్ని రకాల టీకాలు తీసుకున్న తర్వాత రెండు నుండి నాలుగు వారాల వరకూ రక్త దానం చేయకూడదనే నియమం ఉంటుంది. ఇవన్నీ రక్తదానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని, ఆ సమాచారాన్ని అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి అందించాలి.

మనదేశంలోని కొన్ని సంస్థలు..
జాతీయ రక్త మార్పిడి కౌన్సిల్‌ – ఇది ఆరోగ్య మరియు కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. రక్త మార్పిడికి సంబంధించిన అంశాలను, పాలసీలను, నియమాలను ఈ సంస్థ తయారుచేస్తుంది. ఇది కాకుండా కొన్ని ఎన్జీవోలు మన దేశంలో రక్త మార్పిడి కోసం పనిచేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్లడ్‌ డోనార్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా, బ్లడ్‌ కనెక్ట్‌ ఫౌండేషన్‌, రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌, లయన్స్‌ క్లబ్‌ మొదలైనవి.

 • రక్తదానం, రక్త మార్పిడి గురించి తెలుసుకోవడానికి ఫ్రీ టోల్‌ నెంబర్‌ 104 కి కాల్‌ చేయవచ్చు.
 •  మన దగ్గర్లో రక్తం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం RaktKosh (www.eraktkosh.in) అని వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసింది. అందులో ఏ బ్లడ్‌ గ్రూపు రక్తం ఎంత అందుబాటులో ఉంది, అందుబాటులో ఉంటే ఎన్ని యూనిట్లు ఉన్నాయి.. అనే వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.

 

ఎవరెవరికి అవసరం..
ఏయే పేషెంట్లకి తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందంటే.. ప్రధానంగా తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హీమోఫిలియా, అప్లాస్టిక్‌ ఎనీమియా ఉన్నవారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా రక్త కణాలకి సంబంధించిన క్యాన్సర్లు గురైనవారు. దీర్ఘ కాలిక మూత్ర పిండాల సమస్య ఉన్నవారు, తదితరులు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి రక్తం కోల్పోయినా కూడా చాలా యూనిట్ల రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
మహిళల్లో క్లిష్టమైన ప్రసవం, సంక్లిష్టమైన అబార్షన్‌ జరిగినప్పుడు. అలాగే గర్భాశయానికి వచ్చే రకరకాల ట్యూమర్లు, క్యాన్సర్లు వల్ల రక్తం కోల్పోయేవారికి. నెలసరి సమయాల్లో రక్తస్రావం ఎక్కువగా అవ్వడం వంటి అసాధారణ స్థితిలో ఉన్నవారికి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో అయితే పౌష్టికాహారం సరిగా అందకపోవడం వల్ల వచ్చిన న్యూటరీషనల్‌ ఎనీమియా చాలా ఎక్కువగా చూస్తాము. వీరిలో సివియర్‌ ఎనీమియా అంటే హీమోగ్లోబిన్‌ ఆరు శాతం కంటే తక్కువగా ఉన్న వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.


తొలి శాస్త్రీయ మార్పిడి..
ప్రపంచంలో మొట్ట మొదటి శాస్త్రీయ రక్త మార్పిడి 1818లో బ్లండెల్‌ అనే శాస్త్రవేత్త చేశారు. ఆయన ఒక తల్లి ప్రసవం సమయంలో చాలా ఎక్కువ రక్తం కోల్పోయినపుడు, ఆవిడ భర్త నుండి రక్తాన్ని సేకరించి చేశారు. కానీ అప్పటికి బ్లడ్‌ గ్రూపులను ఇంకా కనుగొనలేదు. అందువల్ల చాలా మరణాలు సంభవిస్తూ ఉండేవి. లాండ్స్టీనర్‌ బ్లడ్‌ గ్రూపులను కనుగొన్న ఆరు సంవత్సరాలకి అంటే 1907లో ఆల్బర్ట్‌ హస్టిన్‌ అనే శాస్త్రవేత్త సరైన అవగాహనతో, సరైన పద్ధతిలో రక్త మార్పిడి చేశారు.

 

ఎవరికి ఏ బ్లడ్‌ గ్రూపు?
ఎవరికి ఏ బ్లడ్‌ గ్రూపు ఉండాలనేది ఎలా నిర్ణయించబడుతుంది? దీనికి మన జన్యువులే కారణం. క్రోమోజోమ్‌ 9 పైన ఉండే ఎ, బి, మరియు ఓ జన్యువుల అల్లీల్‌ (allele) వల్ల ఇది నిర్ణయించబడుతుంది. తల్లిదండ్రుల నుండి పిల్లలకి ఈ జన్యువులు సంక్రమిస్తాయి. పట్టిక-2,3లో మనం తల్లిదండ్రుల నుండి సంక్రమించే ఏ జన్యువుల వల్ల బిడ్డలో ఏ బ్లడ్‌ గ్రూపు రావడానికి అవకాశముందో చూడొచ్చు. దీనిని ‘కో డొమినెన్స్‌ ఇన్హెరిటెన్స్‌’ అని కూడా అంటారు. ఒక వ్యక్తికి ”A” అల్లీల మరియు ‘O’ అల్లీల ఉంటే, ఆ వ్యక్తి వ్యక్తపరిచే బ్లడ్‌ గ్రూపు “A”. “A” మరియు “B” అల్లీలు డొమినెంట్‌, “O” అలీల్‌ రిసెసివ్‌గా ఉంటాయి. తల్లి బ్లడ్‌ గ్రూపు “A” ఉంది అంటే ఆవిడకి “AA” గానీ, “AO” గానీ అల్లీలు ఉండొచ్చు. తండ్రి బ్లడ్‌ గ్రూపు “B” ఉంది అంటే ఆయనకి “BB” గానీ, “BO” గానీ అల్లీలు ఉండొచ్చు. అందుకే “AO” ఉన్న తల్లి, “BO” ఉన్న తండ్రి ఉన్న బిడ్డకి A, B, O మూడింటిలో ఏ బ్లడ్‌ గ్రూపు అయినా వచ్చే అవకాశం ఉంటుంది.
అదే ఆర్‌.హెచ్‌ పాజిటివ్‌ / నెగెటివ్‌ అనేది ఒకటవ క్రోమోజోమ్‌పైన ఉన్న జన్యువు లను బట్టి నిర్ణయించబడుతుంది. దీనికి “ABO” బ్లడ్‌ గ్రూపులకు సంబంధం లేదు. ఇది రెండురకాల అల్లీల వలన నిర్ణయించ బడుతుంది. కింది టేబుల్‌ లో తల్లిదండ్రుల నుండి సంక్రమించే “Dd” అల్లీలు బిడ్డల ఆర్‌.హెచ్‌ పాజిటివ్‌ / నెగెటివ్‌ స్టేటస్‌లను ఎలా నిర్ణయిస్తాయో చూడవచ్చు. అందుకే తల్లికి తండ్రికి పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు ఉన్నా, వారికి ఉన్న జన్యువుల అల్లీల్లను బట్టి బిడ్డకు పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూపు వచ్చే అవకాశం ఉంది.

అసమానతలు.. ప్రభావాలు..
ఆర్థిక అసమానతలు వివిధ దేశాల్లో రక్తదానంపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనేది పరిశీలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా 16% మంది జనాభా ఆర్థికంగా అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఉన్నారు. కానీ సేకరించబడిన రక్తంలో 40% ఈ దేశాల నుండే సేకరించబడుతుంది. తక్కువ ఆదాయమున్న దేశాల్లో 54% రక్తమార్పిడులు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ముప్పావు వంతు రక్తం అరవై ఏళ్ల పైబడిన వృద్ధులకి ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి వెయ్యి మంది జనాభాకి దేశం యొక్క ఆదాయ స్థితిని బట్టి 31 నుండి ఐదు రక్త దానాలు జరుగుతున్నాయి. ఎక్కువ ఆదాయమున్న దేశాల్లో ఎక్కువగానూ, తక్కువ ఆదాయమున్న దేశాల్లో తక్కువగానూ జరుగుతున్నాయి.
పట్టిక-1లో మొత్తం ప్రపంచంలో రక్తం అవసరం ఎంతుందో మనం చూడొచ్చు. ప్రపంచంలో నాలుగో వంతు మందికి అసలు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న వారిలో పది నుండి ఇరవై శాతం మందికి రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల రక్త మార్పిడి జరగడం లేదు. రక్త మార్పిడి అందుబాటులో ఉండి జరుగుతున్న వాటిలో కూడా ఒక 10-20% వరకు అనవసరమైన (సరైన ఇండికేషన్‌ లేకుండా) జరుగుతున్నవి. ప్రతి ఒక్కరికి సరైన సమయంలో రక్తం అందుబాటులో ఉండాలంటే.. ప్రభుత్వం ప్రజలందరికీ సరైన వైద్య, బ్లడ్‌బ్యాంక్‌ సదుపాయాలు, వీటిని మారుమూల ప్రాంతాలకి అందించే రవాణా సదుపాయాలు, వైద్యవ్యవస్థ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. అటువంటి సమాజం రావాలి.


బిడ్డకు వచ్చే రక్తం ఎవరిది?
సాధారణంగా ‘నా రక్త మాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డ!’ అని ఒక తల్లి తన శిశువు గురించి భావోద్వేగంగా మాట్లాడటం వింటుంటాం. అలాగే ‘ఇది నా రక్తం రా!’ అని ఒక తండ్రి తన బిడ్డ గురించి ఆవేశంగా చెప్పడం కూడా మనందరికీ తెలిసిందే. అయితే అసలు వాస్తవాలు ఏమిటి? నిజంగానే తల్లి నుండి బిడ్డకి ఆమె రక్తం ప్రసరిస్తుందా? తండ్రుల రక్తం తప్ప కొడుకుల్లో తల్లుల రక్తం ప్రసరించదా? వీటి వెనక శాస్త్రీయత ఏమిటి?
తల్లి నుండి బిడ్డకి నేరుగా రక్త సరఫరా జరగదు. తల్లికీ బిడ్డకీ మధ్యలో మావి లేదా ప్లాసెంటా ఉంటుంది. అక్కడ తల్లి రక్తం నుండి కేవలం ప్రాణవాయువైన ఆక్సిజన్‌, పోషకాలు మాత్రమే మావిలోకి, అక్కడి నుండి బిడ్డ రక్తనాళాల్లోకి ప్రసరిస్తాయి. అయితే తల్లి రక్తంలో ఉన్న కొన్ని రకాల ఆంటీజెన్‌లు, ఆంటీబాడీలు, చిన్న చిన్న వైరస్‌లు మాత్రం బిడ్డలోకి ప్రసరించే అవకాశం ఉంటుంది. అందుకే నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న గర్భిణీ స్త్రీకి, (పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న భర్త ఉంటే) ఆ గర్భిణీ స్త్రీకి ‘యాంటీ-డి యాంటీబాడీ’ అనే ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోసు ఏడో నెల దాటాక ఇస్తే, రెండో డోసు బిడ్డ పుట్టాక 72 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండో డోసు బిడ్డకి పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు ఉంటేనే ఇస్తాము. తల్లికి అబార్షన్‌ అయినా కూడా ఈ యాంటీ-డి యాంటీబాడీ ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మనదేశంలో గర్భం నమోదు చేసుకున్న ప్రతి స్త్రీకి బ్లడ్‌ గ్రూప్‌ పరీక్ష చేస్తారు. అయితే చాలామంది స్త్రీలకి ఈ నెగటివ్‌ బ్లడ్‌ గ్రూపు పట్ల సరైన అవగాహన లేదు. దీనివల్ల అబార్షన్లు జరగడం లేదా శిశువు చనిపోయి పుట్టడం వంటివి జరుగుతున్నాయి. అందుకని ఈ నెగటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ పట్ల గర్భిణీ స్త్రీలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం చాలా అవసరం.

 

డాక్టర్‌ దేశం పి.ఆర్‌.
ఎంబిబిఎస్‌, ఎండి,
ప్రజారోగ్య నిపుణులు.

➡️