అనగనగా చిగురుధార అనే అడవిలో మూడు కుందేళ్ళు నివసించేవి. ఒక రోజు అడవికి దూరంగా గ్రామంలో జాతర జరుగుతుంది. ఆ జాతరలో రంగులరాట్నం రంగు రంగులతో కనిపించడంతో అక్కడికి వెళ్ళాలి అనుకున్నాయి.
మరుసటి ఉదయమే మూడు కుందేళ్ళు కలిసి ”మనము జాతరకు
వెళ్తున్నాం కదా ! అక్కడ మనకు ఆహారం దొరకదు. మనము తినే ఆహార పదార్థాలను మనమే మోసుకొని వెళ్దాం” అనుకున్నాయి. మూడు కుందేళ్ళు తల మీద క్యారెట్లను పెట్టుకొని ప్రయాణం కొనసాగించాయి. కొంతదూరం వెళ్లాక అలసిపోయి చెట్టు కింద సేద తీరాయి.
”మిత్రమా! మాకు నిద్ర వస్తుంది. కానీ ఈ చుట్టుపక్కల సింహాలు ఉంటాయి. నీవు కాసేపు మెలకువతో ఉండు మేము నిద్రపోతాము. ఆ తర్వాత నువ్వు కాసేపు నిద్రపోదువు” అని అన్నాయి లింగు, టింగు అనే కుందేళ్లు. దాంతో లిటుకు అనే కుందేలు నిద్రపోకుండా అక్కడ చెంగుచెంగున ఎగురుకుంటూ ఉంది. దాహం వేయడంతో పక్కనే ఉన్న కొలను వద్దకు వెళ్ళింది. అక్కడ సింహం ఎదురైంది. లిటుకు చాలా భయపడిపోయింది. ‘సింహరాజా.. దయచేసి నన్ను వదిలేయండి పక్కనే చెట్టు కింద మా మిత్రులు నిద్రలో ఉన్నారు. నన్ను తింటే నీ కడుపు నిండదు. వాటిని తినండి” అని సింహంతో చెప్పింది.
సింహం సరే అన్నది. సింహాన్ని రెండు కుందే ళ్ళు నిద్రపోయే చోటికి తీసుకుని వెళ్ళింది. సింహం గర్జనకు రెండు కుందేళ్లు ఉలిక్కిపడి లేచాయి. ఆ రెండు కుందేళ్ళు పక్కనే ఉన్న లిటుకు అనే కుందేలును పంజాలోకి తీసుకొని ‘ మీరు నాకు ఆహారం కాండి. లేకుంటే ఈ లిటుకును చంపేస్తాను’ అని బెదిరించింది సింహం.
‘మహారాజా మా మిత్రున్ని వదిలేయండి. కావాలంటే మమ్మల్ని తినండి అన్నాయి’ లింగు, టింగు. ఆ మాటలకు సింహం లిటుకు వైపు కోపంగా చూసి, అక్కడే వదిలేసి వెళ్లింది.
ఆ మాటలకు లిటుకు ఆశ్చర్యపోయింది. వాటి స్నేహాన్ని అర్థం చేసుకుంది. తన బుద్ధిని మార్చుకుంది. జాతరకు వెళ్లి అడవికి వచ్చే వరకూ తన మిత్రులను కంటికి రెప్పలా కాపాడుకోసాగింది లిటుకు.
– గొట్టిపర్తి వర్షిత,
10 వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోదాడ,
సూర్యాపేట జిల్లా.