ఒక దినచర్య

Mar 23,2025 10:15 #Poetry

మనిషి వస్తువులా మారిపోయాక
లేదు లేదు వస్తువు కన్నా హీనమైపోయాక
ఇక్కడ వినిమయ సంబంధాలు
మరింత బిరుసెక్కుతాయి.
ప్రతిదీ ప్రయోజనాల
కొలమానంగా మారుతుంది.
ఎప్పటిలానే కాలం మారుతూనే ఉంటుంది.
ఒకానొక వ్యాపారం ఏదో బలపడ్డాక
బలహీనమైనవన్నీ
మార్కెట్‌గా నిలబడతాయి. నిలకడ లేని
తీర ప్రాంతపు వాతావరణంలా
క్షణాలన్నీ మెరుపు వేగంతో
డాలర్‌ ముఖాలుగా వేలాడతాయి.
దేశానికి దూరమయ్యే
మాయాజాలమేదో వేటాడుతుంది.
ఎవరైతే ఈ ప్రజలకు సౌకర్యాలు
కల్పిస్తారనుకుంటారో..
వాళ్లే.. నిన్నూ.. నన్నూ…
అభద్రతా సమాధిలోకి నెట్టేస్తారు.
కంచెలు చేను మేయడమేదో
గొప్ప రాజనీతి అవుతుంది.
చాణిక్యుడు తెల్లబోతాడు.
అణచివేతలు, నిషేధాజ్ఞల మధ్య
జీవితం భయం భయంగా
ఒక కల్లోలిత ప్రాంతమౌతుంది.
మతం గుంటనక్క ఊళలేస్తుంది.
కులం అడ్డగాడిద ఓండ్ర పెడ్తుంది.
రాజ్యం భక్తి జోల పట్టి
అందరినీ మింగేస్తుంది.
సంక్షేమం, అభివృద్ధి
రెండు బానిస వస్తువులై పోయాక
రాజ్యం సగం మనిషి,
సగం జంతువై
ప్రజల రక్తం తాగుతుంది.
దేశాన్ని ఎడారిని చేసుకోవడం
ఒక సనాతన ధర్మం అవుతుంది.
భ్రమలు ముసురుకున్నాక
వ్యామోహాల దేశం దేహం చుట్టూ
అత్యాధునికతగా చుట్టుకున్నాక
అమ్మకము కొనుగోళ్ల మధ్య
మనిషి చిక్కుకుపోయాక
జీవితమే ఇసుర్రాయి కింద
నలుగుతున్న కంది గింజై పగులుతుంది.
గడియారంలో ముళ్ళు కూడా హత్య చేస్తాయి.
లేదూ ఎవడిని వాడే ఆత్మహత్య చేసుకునే విద్యేదో..
ఎవరో నేర్పుతుంటారు.
శవ వ్యవస్థ ప్రాణం పోసుకుంటుంది.
ఇంతకు దాహం తీరని మనుషులు
వ్యామోహాల మనుషులు
శిలలవుతారు.
ఎప్పటికీ అర్థం కాని
ఈ మార్పుకి కారణం ఏదైనా కానీ
ప్రాణం పోసుకున్న రాళ్ల వెనుక
పరుగు పందెమేదో..
నిత్యమూ.. నిఖిలమూ..

– రేపాక రఘునందన్‌
9440848924

 

➡️