భద్రంగా ఉన్నారన్న మాట
ఒక వెక్కిరింత.. వింతల్లో వింత..
చిరుగుల బొంత.. అతుకుల చింత..
శత శతాబ్దాలుగా ఈ చప్పుడు మోగుతూ
మారని చరిత్ర కదా మనదేశపు ఘనత !!
బలిష్టమైన పునాది లేకుంటే
భువనభవనం నిలబడుతుందా??
అందుకే నీతి నియమ నియంత్రణకు
పోరుబాట అనివార్యం !!
అత్యద్భుత సమాజ నిర్మాణం కదా మనగమ్యం
శూన్యాల్ని సృష్టించగల మన నాయకులకు
హక్కుల్ని భక్షించే నిర్దాక్షిణ్య వ్యవస్థకు
పేదరికాన్ని పెంచి పోషించే
కల్లబొల్లి కబుర్లకు
తలలు ఒంచడం కాదు.. ప్రశ్నించాలి !!
అందుకై ముందుకెళ్లి అవగాహనతో తలపడాలి!
వర్తమాన వికాసం కోసం నూతనంగా లేవాలి!
దక్కిన అధికారం నిమ్మకు నీరెక్కినప్పుడు
ప్రజాస్వామ్య పాలకులు దతరాష్ట్రులౌతారు
న్యాయాన్ని ధర్మాన్ని నిద్రపుచ్చి జోకొడతారు
వారి పదవులు భద్రంగా ఉంటే చాలు
లేకుంటే మా విశాఖ ఉక్కు పరిశ్రమ
ప్రైవేటుపరం చేసి కార్మికుల
బతుకు హక్కులు భుక్తం చేస్తారా??
వున్నవాటినే మూసేస్తుంటే
యింక పరిశ్రమల స్థాపన ఎక్కడ ??
చదువుల సార్ధకత ఎక్కడీ ఎప్పుడు ??
నిరుద్యోగ నిర్మూలన ఏది ??
ఈ దేశపు చీకటి గదిలో
వెలుగురేఖలు విరిసెనా?
కార్మిక ఘోషలు వినపడలేదా? కనపడలేదా??
దయుంచి మాకు కన్నీరు కార్చని మనుషులున్న
యే మారుమూలనైనా కాస్త చోటు చూపండి!
ఎల్. రాజా గణేష్
9247483700.