అత్యాశల పర్యవసానం… ఆర్కిటిక్ అవరోధం …

Sep 29,2024 09:03 #Environment

మండిపోయే ఎండలు.. ఎండిపోయిన నదులు.. ఆక్రమిత కట్టడాలు.. ఎడతెగని వర్షాలు.. ఏరులు వరదలైపారే నీరు.. ఊళ్ళూనీళ్ళూ ఏకమై సముద్రాల పాలవుతున్న వైనం.. మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఎంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఎందుకిదంతా అని చూస్తే.. టెక్నాలజీ మనిషికి అత్యంత చేరువగా వచ్చింది. సాంకేతికత వినియోగంలో మన తప్పిదాలేమిటి అని ఆలోచించే సమయం, సంయమనం లేని పరిస్థితులు. కట్టలు కట్టలు డబ్బులున్నా కాపాడలేవని తెలిసీ అదే ధన దాహం.. పరిమితి లేని ఖనిజ నిల్వల తవ్వకాలు.. ఇండిస్టియల్‌ వేస్ట్‌నంతా సముద్రాలలోకి విడుదల చేసే నిర్లక్ష్యం లాంటి మానవ తప్పిదాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. దాని పర్యవసానమే పర్యావరణం తారుమారవటం.. రుతువులు క్రమం తప్పటం.. కాలాలు కనుమరుగవటం జరుగుతోంది. ఆ ఫలితంలో భాగమే ఆర్కిటిక్‌ మంచు ఖండం కరిగి సముద్రంగా మారుతోంది. దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా జీవన ప్రమాణాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఆర్కిటిక్‌ భూమికి ఉత్తరాన ఉన్న ధృవ ప్రాంతం. మంచుతో కప్పబడిన మహా సముద్రం. ప్రపంచమంతటికీ గ్లోబల్‌ ఎయిర్‌ కండిషనర్‌. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు కాదు. ప్రస్తుతం ఆర్కిటిక్‌ మహా సముద్రపు మంచు కరిగిపోయి, దాని కింద ఉన్న సముద్ర ఉపరితలం బయటపడుతోంది. సూర్యరశ్మి సముద్ర ఉపరితలాన్ని తాకలేనంత మందమైన మంచుతో కప్పబడి సూర్యరశ్మిని ప్రతిబింబించేది ఆర్కిటిక్‌. కానీ ఇప్పుడు సూర్యరశ్మిని గ్రహించి కరిగి నీరవుతోంది. సముద్రనీటి ఉపరితల మట్టం అంతకంతకూ పెరుగుతోంది.
పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం, కార్బన్‌డైఆక్సైడ్‌ రెట్టింపు స్థాయిలో విడుదల కావటంతో రుతుపవనాలలో 15 శాతం వరకూ అవపాతం (వర్షాలు పడటం, మంచు కరగటం సాధారణం కంటె అధిక స్థాయిలో) పెరుగుతోందని.. దీంతో ప్రతి దశాబ్దానికీ మంచు 12.2 శాతానికి తగ్గిపోయి కనిష్ట స్థాయికి చేరుకుంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇరవై ఒకటవ శతాబ్దారంభానికి ఆర్కిటిక్‌ మంచు క్షీణత మరింత వేగంగా పెరగటం మొదలయింది. దీనికి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వలన ఏర్పడే భూతాపమే కారణమంటున్నారు నిపుణులు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖనిజ నిల్వల్లో నాలుగింట ఒక వంతు గ్రీన్‌ల్యాండ్‌లో ఉంది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో బొగ్గు, జిప్సం, వజ్రాల నిక్షేపాలు, జింక్‌, సీసం, ప్లేసర్‌ బంగారం, క్వార్ట్జ్‌ నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ఇంకా అన్వేషణ వరకు చేరని హైడ్రోకార్బన్‌ వనరుల సంపద కూడా ఉంది. ఆర్కిటిక్‌ సముద్రపు మంచు కరిగిపోవటం వలన వాతావరణ పీడనం పెరిగి, ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని అధ్యయనంలో తెలిసింది.
పర్వత హిమానీనదాలు, ఆర్కిటిక్‌ మంచు పలకలు కరగడం లాంటి అంశాల వలన ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు సముద్ర నీటి మట్టం పెరుగుతోంది. మరోవైపు ఆనకట్ట ప్రాజెక్టులు, కొన్ని ప్రాంతాలలో నదులు ఎండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు రాకపోవటం, వర్షాలు వస్తే ముంచెత్తే వరదలు రావటం.. నీరంతా సముద్రంలో కలిసి తర్వాత నదులు ఎండిపోవటం జరుగుతోంది. ఆర్కిటిక్‌, గ్రీన్‌ల్యాండ్‌ పర్వత హిమానీనదాలలోని మంచు పూర్తిగా కరిగిపోతే, సముద్ర మట్టం దాదాపు 70 మీ. (230 అడుగులు) పెరుగుతుంది. అప్పుడు సముద్ర తీరప్రాంత నగరాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదముంది.
అడవులు కాలిపోయినప్పుడు, శిలాజ ఇంధనాలను భూమినుండి (బొగ్గు, చమురు, సహజ వాయువులు) వెలికితీసేటప్పుడు కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. శిలాజ ఇంధనాల వినియోగం అధికమై గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలవుతున్నాయి. దీనివలన ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఆర్కిటిక్‌లోని ఉష్ణోగ్రతలు రెండింతలు వేడెక్కటం.. అక్కడి సముద్రంలోని మంచు కరగటం.. తద్వారా సముద్ర మట్టాలు పెరగటం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది.
ఆర్కిటిక్‌ ప్రాంతంలో సముద్ర మట్టాలు పెరగటం వలన మన దేశంలో తీవ్ర అవపాతం ఏర్పడుతుంది. అర్కిటిక్‌ ప్రాంత వాతావరణ మార్పుల వలన మరికొన్ని అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. మధ్య ఆర్కిటిక్‌ సముద్రంలో మంచు శాతం తగ్గింది. దానివల్ల మనదేశ మధ్య, ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగాను.. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో తక్కువగాను కురుస్తాయని కొత్త పరిశోధనలో తెలిసింది.
వీటన్నింటికీ వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన కారణం. ఏది ఏమైనప్పటికీ, వాతావరణ నమూనాలను నిశితంగా పరిశీలిస్తే, మనదేశ భూభాగంలో వర్షం రావడానికి కారణమైన భూమి ఉపరితల ఉష్ణోగ్రత, పీడన ప్రవణత (రెండు పాయింట్ల మధ్య ఉండే వాయు పీడన వ్యత్యాసం), గాలి వీచడం, సముద్రపు మంచు ఇవన్నీ క్లిష్టంగానే ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రీసెర్చ్‌ (చీజూఉ=), దక్షిణ కొరియా పోలార్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఆర్కిటిక్‌లో కాలానుగుణంగా జరుగుతున్న మార్పులపై అధ్యయనం చేసి, ఆ ఫలితమే దేశ రుతుపవనాలను ప్రభావితం చేస్తున్నట్లు నివేదిక విడుదల చేశారు.
ఇది ఒక్క భారత్‌ రుతుపవనాలకే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్త సంక్షోభానికి నాంది. కొన్ని దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు తదితర శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు వెల్లడిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విషయంపై శీతకన్ను వేశాయి. ఇప్పటికైనా జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక రంగాలు, ప్రభుత్వాలు పర్యావరణ దిశగా దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు.

➡️