ఏమో గుర్రం ఎగరావచ్చు

Jan 12,2025 08:03 #Sneha, #Stories

తెల్లవారుఝామున కోడి కూయడంతో చప్పున తెలివొచ్చింది సమ్మయ్యకి. తూర్పున వేగుచుక్క ప్రకాశవంతంగా వెలుగుతోంది. గుడిశెలో గుడ్డి దీపపు వెలుగులో భార్య పోలమ్మను చూసాడు. రాత్రి తాను కలత నిద్రలోనే గడిపాడు. భార్య నిద్ర పాడు చేయడం ఇష్టంలేక బయటకొచ్చి, చుట్ట తీసి వెలిగించాడు. గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. రాత్రి సరిగా నిద్రపట్టలేదేమో కళ్ళు ఎర్రగా ఉన్నాయి చుట్ట చివర నిప్పులా. మనసంతా చికాగ్గా ఉంది. చీకటి విడిపోతూ మంచు తెరలను తొలగిస్తోంది. వెలుగు రేకలు విచ్చుకుంటూ లోకాన్ని కాంతిమయం చేస్తున్నాయి. అరచేతిని కళ్లకు, నుదుటికి మధ్య గొడుగులా అడ్డుపెట్టి తల పైకెత్తి ఆకాశం వైపు చూసాడు. ఏ మూలనైనా మబ్బు కనిపిస్తుందా అని.. ఊహూ.. తన ఆశ కానీ వానొచ్చే అవకాశం ఉందా?
నిరాశగా నిట్టూర్చి తలకు పాగా చుట్టి- పలుగు, పార పట్టుకుని బయలుదేరాడు. పోలమ్మ నిద్ర లేచిన తర్వాత టీ నీళ్ళు మరగబెట్టి తెస్తుందిలే అనుకుంటూ. సమ్మయ్య ఆ వూళ్ళో చిన్నకారు రైతు. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఎకరం పొలంతో పాటు పెద్దారెడ్డి గారి పొలం తన పొలం పక్కనే ఉండటంతో రెడ్డి గారిని బతిమాలి కౌలుకు తీసుకున్నాడు. ఆ రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ నెట్టుకొస్తున్నాడు. అప్పులు చేసి వ్యవసాయం చేయడం తలకు మించిన భారం అవుతోంది. అయినా తరాల నుండి నమ్ముకున్న భూమి తల్లిని సమ్మయ్య ఏనాడూ చులకనగా చూడలేదు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఆ తల్లిని నమ్ముకుని ఇంతవరకూ జీవితరథాన్ని నడిపించాడు. ఒక సంవత్సరం పంటపోయినా మరో సంవత్సరం ఫలసాయం ఇస్తూ ఆ తల్లి తనను ఆదరిస్తూనే ఉంది. ఈ తల్లిని నమ్ముకునే కదా తన కొడుకులిద్దరినీ చదివించి, ప్రయోజకులను చేసింది.
తన ఇద్దరు కొడుకులు కూడా బుద్ధిగా చదువుకున్నారు. ఉద్యోగాలొచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుని, పెద్ద పెద్ద నగరాల్లో స్థిరపడ్డారు. మాటవరసకి తమతో వచ్చి ఉండమంటారు. కానీ ఆ పిలుపులో జీవం లేదని సమ్మయ్యకి తెలుసు. అయినా వారు మనస్ఫూర్తిగా పిలిచినా ఈ నేలతల్లి ఒళ్ళో కలిసేవరకూ ఈ తల్లిని వదిలే ప్రసక్తే ఉండదని ఆ భార్యాభర్తలకు తెలుసు.
ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం తన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాలని కన్నబిడ్డలైనా వారి మీద ఆధారపడకూడదని సమ్మయ్య అభిప్రాయం. భర్త నిర్ణయానికి పోలమ్మ ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఆ భార్యాభర్తల ఆత్మాభిమానం ముందు వారి బిడ్డల అనురాగం తల వంచక తప్పలేదు.
‘సమ్మయ్య మామా.. ఈసారి ఏం ఇత్తులేత్తున్నావ్‌?’ సొట్టెంకడు ప్రశ్నకు సమ్మయ్య సన్నగా నవ్వి – ‘నువ్వులే అల్లుడూ..’ అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. ‘ఈసారైనా ఆ తల్లి దయ తలిస్తే’ అన్నాడు.
‘మొన్నసేసిన అప్పులే ఇంకా తీరనేదు.. బాంకోల్లు నోటీసుల మీద నోటీసులు దంచేత్తన్నారు’ అన్నాడు భుజం మీద తువ్వాలు తీసి, నెత్తికి చుట్టుకుంటూ అన్నాడు సొట్టెంకడు.
‘బాంకోళ్లు ఆళ్ళ ద్యోగం ఆళ్ళు సెయ్యాలి కదరా! అప్పులు వసూలు సేయకపోతే ఆళ్ల పైఅధికారులు ఊరుకుంటారా?’ అన్నాడు సమ్మయ్య బ్యాంకు అధికారులను వెనకేసుకొస్తూ.
‘అదీ నిజమే అనుకో’ అంటూ సొట్టెంకడు తన పొలం వైపు వెళ్ళిపోయాడు.
సమ్మయ్య తన పొలం వైపు చూసాడు. వేసిన విత్తనాలు వేసినట్టే ఉన్నాయి. చినుకు తడి కోసం ఆశగా ఎదురుచూస్తూ. సమ్మయ్య కళ్ళలో తడి.. పొలం మాత్రం పొడిబారింది.
‘ఏరా సమ్మయ్యా.. ఈ సంవత్సరమైనా అప్పు తీర్చేదేమైనా ఉందా?’ పెద్దారెడ్డి గారి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు సమ్మయ్య.
‘రెడ్డిగారూ.. వానసుక్క పడనేదు.. ఏసిన ఇత్తనాలు పేనం ఒగ్గేసినట్టున్నాయి. అప్పు సూత్తే పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతాంది’ బదులిచ్చాడు సమ్మయ్య. సమ్మయ్య తన అప్పు ఎగవేయడానికి చాలా తెలివిగా మాట్లాడుతున్నాడనిపించింది పెద్దారెడ్డికి.
‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. ఈ ఏడాది మాత్రం నా అప్పు తీర్చాలి!’ అనుకుంటూ ఒడిఒడిగా వెళ్లిపోయాడు పెద్దారెడ్డి.
సమ్మయ్య మనసంతా చీకటి ఆవరించింది. దిగులుగా అక్కడే కూలబడిపోయాడు. పదిమందికి అన్నం పెట్టే రైతన్న తన నోట్లోకి ఐదు వేళ్లూ పోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ప్రకృతి కూడా రైతన్న మీద పగబట్టినట్టే ఉంది. ఐతే అతివృష్టి లేకపోతే అనావృష్టితో రైతుల జీవితాలతో ఆడుకుంటోంది నాయకుల్లాగే.
‘ఎందుకు నాన్నా.. అంత కష్టపడ్డం.. మాతో వచ్చి, సుఖంగా ఉండొచ్చు కదా?’ అంటారు కొడుకులు.
‘అందరూ పల్లకీ ఎక్కితే మోసేవాళ్ళు ఎవర్రా? రైతులు ఆరుగాలం శ్రమించి, మట్టి నుండి తిండిగింజలు తియ్యబట్టి పట్నంలో ఎ.సి. రూముల్లో కూచుని హాయిగా కడుపులు నింపుకుంటున్నారు. రైతు పని తెలిసిన నాలాంటివాడు ఈ పని వదిలేత్తే ఎలా?’ అంటూ కొడుకులను సమాధాన పరుస్తుంటాడు.
‘భూమిని నమ్మినవారు ఎన్నడూ చెడిపోరని సమ్మయ్య విశ్వాసం. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ నేలతల్లి చల్లగా చూసి తన అప్పు తీర్చేస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి’ అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఇంతలో పోలమ్మ టీ తీసుకువచ్చింది. ఇద్దరూ టీ తాగడం పూర్తి చేసి పొలంలోకి దిగి, కలుపు తీయడం ప్రారంభించారు.
నువ్వుల విత్తనాల ముఖాల్లో నవ్వు కనిపించడం లేదు. సమ్మయ్య మనసంతా ద్రవించింది. ‘ఇక లాభం లేదు.. వాన కోసం చూస్తే ఇవి కూడా ఆవిరైపోతాయి..!’ అని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న చిన్న చెరువు దగ్గరకు బయలుదేరాడు. సొట్టలు పడ్డ రెండు బిందెలు కావడిలో పెట్టుకుని, తలకు చుట్టిన పాగా తీసి భుజానికి కావడిబద్దకి మధ్య అడ్డుగా పెట్టాడు. చెరువు కూడా నేడో రేపో ఎండిపోవడానికి సిద్ధంగా బక్కచిక్కిన రైతులా ఉంది. సమ్మయ్య తన బిందెలు చెరువులో ముంచి అవి నిండగానే కావడిలో చెరొకటి పెట్టుకుని, తన పొలం వైపు నడిచాడు.
పోలమ్మ కలుపుమొక్కలు ఏరడంలో నిమగమైంది. ఆ విత్తనాలను కొంచెం కొంచెం తడుపుతుంటే చుర్రుమంటున్న ఎండకు సమ్మయ్య నుదుట నుండి కారుతున్న చెమట చుక్కలు ఆ విత్తనాలకు ఆయువు పోయడానికా అన్నట్టు భూమిలోకి ఇంకుతున్నాయి. అలా చెరువుకీ పొలానికీ తిరుగుతూ పొలం సగం తడిచేసరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు.
పోలమ్మ కూడా చెమటకి తడిసి ముద్దయిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఉస్సురంటూ పొలం గుట్టున ఉన్న చెట్టునీడకు చేరారు. పొలానికి చెట్టు ఎప్పుడూ ఆత్మీయబంధువే. అందుకే పొలానికి స్వేదం చిందించిన వారిని చెట్టు సేద దీరుస్తుంది. పెద్దారెడ్డి అన్న మాటలు భార్యకు చెప్పాడు సమ్మయ్య. భర్తలో సగభాగమైన పోలమ్మ భర్త దిగులుని పంచుకుంది.
‘సూద్దామయ్యా.. ఆ తల్లి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. ఒకసారిపోయినా రెండోసారి ఆదుకుంటాది. కిందటేడు అంతా తుపానులో ఊడిసేత్తే పెబుత్వం అప్పు మాఫీ చేసేసింది. ఆ తర్వాత ఏడాది ధాన్నెం అమ్మగా వచ్చిన సొమ్ముతో సిన్నోడి సదువుకి సేసిన అప్పు తీరిపోయింది’ భర్తను ఓదారుస్తూ అంది.
పోలమ్మ మాటలకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది సమ్మయ్యకి. భార్య చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. నమ్మకంతో చేస్తే దేంట్లోనైనా విజయం సాధించవచ్చు. ఈసారి ఎలాగైనా పంట పండించి, రెడ్డిగారి అప్పు తీర్చేయాలి అనుకున్నాడు. పోలమ్మ ఏరగా వదిలేసిన కలుపుమొక్కలు పీకడం ప్రారంభించాడు.
ఓపిగ్గా బియ్యంలో రాళ్లు ఏరినట్టు. సాయంత్రమయ్యేసరికి ఒక్క కలుపు మొక్క లేకుండా ఏరి పారేసాడు. ఇప్పుడు పొలమంతా నిర్మలమైన ఆకాశంలా ఉంది. నువ్వు విత్తనాలు చుక్కల్లా మెరుస్తున్నాయి. సమ్మయ్య మనసంతా హాయిగా మూలిగింది. ‘వారం రోజులు మొలకలు వచ్చేవరకు ఇలా నీటితో తడిపితే చాలు..!’ ‘ఉత్తర చూసి ఎత్తర గంప’ అన్నారు. ‘ఎలాగూ ఉత్తర కార్తె వచ్చేస్తోంది. ఉత్తరంలో ఉండుండి పడిపోతుంది వాన..!’ అంటారు అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు.
చీకటి పడేసరికి ఇంటికి చేరుకున్నాడు. పోలమ్మ కట్టెల పొయ్యితో కుస్తీ పడుతోంది. ఆరుబయట నులక మంచం మీద పడుకుని, ఆకాశంలోకి చూస్తున్న సమ్మయ్యకి పెద్దారెడ్డి మాటలు గుర్తొచ్చాయి. పెద్దారెడ్డికి ఎప్పటి నుండో తన పొలం మీద కన్నుంది. వడ్డీలకి వడ్డీలు వేసి బారెడు అప్పు చూపిస్తున్నాడు. ఈసారి పంట చేతికి రాకపోతే పెద్దారెడ్డికి తన పొలం అప్పగించి, తన పొలంలో తానే కూలీగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఎంత కష్టపడైనా తన పొలం పండించాలి. సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏముంది? ఈలోగా పోలమ్మ వంట పూర్తిచేసింది. ఇద్దరూ వేడినీళ్లతో స్నానం చేసి, కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయారు.
ఉదయం లేచేసరికి ఆకాశం మబ్బు గొడుగేసింది. చిన్నగా వాన తుంపర మొదలైంది. అలా మొదలైన వాన జడివానగా మారింది. ఆ భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు. వరుణుడు కరుణించాడు. ఈమాత్రం నీరు అందితే విత్తనం బతికి బట్ట కడుతుంది. తర్వాత తన కండలు కరిగించైనా మొక్కను బతికించుకుంటాడు. దేవుడు తన మొర విన్నట్టే ఉంది. పది గంటలు దాటేసరికి వాన తెరిపిచ్చింది. భార్యాభర్తలిద్దరూ వంట వండుకుని, తట్టలో పెట్టుకుని పొలానికి బయలుదేరారు.
పొలం నిండుగా నీరు ఉండి ఉండి ఇంకుతోంది. నేల నీటిచెమ్మతో నిండిపోతే విత్తనం నుండి మొలక వస్తుంది. ఇద్దరూ పొలంలో దిగి బురదలో ఉన్న రాయి రప్ప, చెత్తా చెదారం ఏరి ఒడ్డున పడేసారు.
పురుడు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్న పొలాన్ని చూసి గర్భవతి అయిన కూతురిని చూసినంత ఆనందంగా ఉందా దంపతులకు. అప్పుడే వచ్చాడు పెద్దారెడ్డి. ‘సమ్మయ్యా.. నీ అదృష్టం బాగుందిరా.. ఈ ఏడాది నీ అప్పు తీరినట్లే ఉంది’ అన్నాడు పైకి ఆనందం నటిస్తూ. ‘ఏదో మీ దయ రెడ్డిగారు.. ఈ మట్టిని నమ్ముకున్న మట్టి మనుసులం. పంట చేతికి రాగానే అణా పైసలతో సహా మీ బాకీ తీర్చేత్తాను’ అన్నాడు సమ్మయ్య.
‘సరే’నంటూ వెళ్లిపోయాడు పెద్దారెడ్డి.
ఆ భార్యాభర్తల ఇద్దరి కష్టానికి ఫలితం అన్నట్లు తమ పొలంతో పాటు పెద్దారెడ్డి దగ్గర తీసుకున్న కౌలు పొలం కూడా విపరీతంగా ఇరగ్గాసింది నువ్వులపంట. కరోనాకాలంలో చిరుధాన్యాలకి పెరిగిన గిరాకీ వలన నువ్వులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి, చూడనంత లాభాలు వచ్చాయి. పెద్దారెడ్డి పెద్దకొడుకు కరోనాసోకి, వైద్యానికి డబ్బు ఖర్చు చాలా అయ్యింది. తన పొలంలో పంట దిగుబడి లేకపోవడంతో పెద్దారెడ్డికి డబ్బు అవసరంపడి, సమ్మయ్య కౌలుకు చేస్తున్న పొలాన్ని సమ్మయ్యకే అమ్మకానికి పెట్టాడు.
సమ్మయ్య నువ్వుల బస్తాలు అమ్మగా వచ్చిన సొమ్ముతో పెద్దారెడ్డి అప్పు తీర్చడమే కాక వారి పొలం కూడా కొనుగోలు చేసాడు. ఒక్కసారిగా పరిస్థితులు తారమారైపోయాయి. భూమిని నమ్మినవారు ఎన్నడూ చెడిపోరని గాఢంగా విశ్వసించిన సమ్మయ్య రెండెకరాల పొలానికి యజమాని అయ్యాడు.

– లోగిశ లక్ష్మీనాయుడు
9200536626

➡️