మానవతప్పిద ఫలితం !

వేసవి విజృంభిస్తున్నది.
వేడిగాడ్పులు ఉడికిస్తున్నాయి
ఉష్ణోగ్రతలు పెచ్చుమీరుతున్నారు
ఊపిరి తీసుకోవడం గండమైంది
మానవ తప్పిదాల ఫలితంగా !!
ఇబ్బడిముబ్బడిగా ఉండే
ఇంటి చుట్టూ చెట్లూ
ఊరికావలుండే సహజమైన అడవులు
ఊరంతటికీ ప్రాణవాయువిచ్చేవి !
తెగబడిన మనిషిజాతి
తెగ్గొట్టేశాయి భూమిజలను !
తెంపరమైపోయే మానవతప్పిదాల ఫలం !
పొలాలనన్నిటినీ ఆక్రమించినారు రియలిస్టులు
పంటలేదు చల్లదనమసలే లేకపోయె!
ప్లాట్లు చేసి అమ్ముకొనిరి .,
హరిత భూములన్నిటినీ !
హననం చేసేశారు బిల్డర్లు
ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తూ !
అంతస్తులపై అంతస్తులేసుకుంటూ
స్వంత ఇంటికోసం పరుగెడతారే
శ్వాసకై ఆక్సిజన్‌ గురించి ఆలోచించరే
మానవతప్పిదాలనిలా పెంచుతున్నారే
మట్టిరోడ్లు -తారురోడ్ల కాలాన ఇంత వేడినెరుగము
మరుగునబడిన ఆ స్థానాన సిమెంటు రోడ్లు వచ్చేనే
మలమల సలసల ఉష్ణం మించిపోయేనే
ఫ్యాక్టరీలు, ఎయిర్‌ కండిషనర్లు వాడుకెక్కువాయే
ఫలితంగా కర్బన ఉద్ఘాతాలు పెరిగిపోయేనే
పెరటితోటల కాలం వెళ్లిపోయేనే
రోడ్లపక్క వీధులకిరువైపు చెట్ల జాడెక్కడా లేదే
రవంతైన విద్యాలయాలు కార్యాలయాల ఆవరణలోన
వృక్షరాజాల ఉనికి కానరాని రోజులాయేనే
వృక్షోరక్షతి రక్షితః సూక్తి ఎటుపోయిందో
ప్రకృతి వనరులన్ని కాలుష్యానికి గురైపోయేనే
భూమాతను భక్షిస్తూ నిర్జీవం చేస్తున్న
భువిపై మానవతప్పిద దుష్ఫలితం పెరికిపోయేనే
జీవజాలమంతటికీ ముప్పువచ్చెనని తెలుసుకో మనిషీ!
శిశువుకొక్క మొక్కనాటి పెంచు
జన్మదినంరోజు, విద్యాభ్యాసం నాడూ
జీవనోపాధి, ఉద్యోగం దొరికినరోజు
జనమంతా విరివిగా నాటి పెంచాలి చెట్లు !
జరిగిన మానవ తప్పిదాల దుష్ఫలాన్ని
తగ్గిస్తూ భావితరాల మనుగడకై ఉద్యమించి
తరులను పెంచుతూ పర్యావరణహితం కోసమై
తరలి ముందుకు రావాలి !
తరతరాల హితంకోరి హరితవనాలు తేవాలి !
తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ సాగాలి మున్ముందుకు !!
వాతావరణ సమతుల్యత సాధించే తీరాలి !
భూతాపాన్ని కలసి చల్లార్చాలి !!

– చాకలకొండ శారద
9440757799

➡️