ఎలుక – చిలుక

Sep 29,2024 10:24 #children stories, #Sneha

ఒక చెట్టు కింద కలుగులో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. కొంతకాలానికి ఒక చిలుక వచ్చి ఆ చెట్టు మీద నివసించ సాగింది. చిలుక ఒకరోజు కొన్ని జామ పళ్ళు తెచ్చి ఎలుకకు ఇచ్చింది. ఎలుకకు, చిలుకకు స్నేహం కుదిరింది.
ప్రతిరోజు సాయంత్రం ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చేది. చిలుక చెట్టు దిగి కిందకు వచ్చేది . రెండూ కాసేపు మాట్లాడుకునేవి. చిలుక అందాన్ని, మాట్లాడగలిగే సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ ఉండేది ఎలుక. ” నేను నల్లగా, వికారంగా ఉంటాను ” అంటూ తనను తాను నిందించుకుంటూ ఉండేది. చిలుక మాత్రం ” మిత్రమా అలా అనుకోవద్దు. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకుంటుంది. ఎవరి గొప్పతనం వాళ్ళకుంటుంది ” అని చెప్పేది.

ఒకరోజు ఆహారం కోసం వెళ్ళిన చిలుక సాయంత్రం వరకు తిరిగి రాలేదు. ఎలుక చెట్టు పైకి ఎగబాకి చుట్టూ చూసింది. దూరంగా ఒక వలలో చిక్కుకుని కనిపించింది చిలుక. గబగబా చెట్టు దిగింది ఎలుక. గుడ్లగూబలకు, పిల్లులకు కనిపించకుండా చెట్లు, పొదల మధ్య నుండీ చిలుక చిక్కుకున్న వల దగ్గరకు వెళ్ళింది ఎలుక.
ఎలుకను చూస్తూనే చిలుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ” మిత్రమా నాకు ఎంత ఆపద వచ్చిందో చూశావా?” అంటూ బాధపడింది చిలుక. ” విచారించకు మిత్రమా, ఇప్పుడే నీకు విముక్తిని కలిగిస్తాను” అని ఎలుక వల తాళ్ళను కొరికి చిలుకను వల నుండీ తప్పించింది.
రెండూ గబగబా తాము నివసించే చెట్టు వద్దకు వచ్చేశాయి. ” మిత్రమా నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడేదానివి. కానీ ఈరోజు నువ్వే గనుక లేకపోతే నేను వేటగాడికి చిక్కి చనిపోయేదాన్ని. నా అందం, నా మాట్లాడే సామర్థ్యం ఇవేవీ నన్ను కాపాడలేకపోయాయి. నీ పదునైన పళ్ళు నన్ను కాపాడాయి. నీ గొప్పతనం నీ పదునైన పళ్ళు” అంది చిలుక. తన గొప్పతనాన్ని ఎలుక గుర్తించింది. అప్పటినుండీ తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడటం ఆపేసింది.

– కళ్ళేపల్లి తిరుమలరావు
9177074280

➡️