సమానత్వ భావన ఏర్పర్చాలి..

Jun 9,2024 09:23 #Children, #Parenting, #Sneha

పిల్లల్లో సమానత్వ భావాలను పాదుకొల్పాల్సింది తల్లిదండ్రులేనని నిపుణులు చెప్తున్నారు. అసలు ఆ భేదాభిప్రాయం తల్లిదండ్రుల నుంచే వాళ్లకూ అలవడుతుందనేది వారి అధ్యయనం. వాస్తవం కూడా అదే. పిల్లల్ని పెంచే క్రమంలో సమాజంలో ఏదైతే ఇలాంటి అసమానత చూపే భావాలు ఉంటాయో.. వాటికి తల్లిదండ్రులు లోనవుతారు. లేదా వాళ్లు పెరిగే క్రమంలో వాళ్లు అలవర్చుకుని ఉంటారు. ఫలితంగా వాళ్ల పెంపకంలో అదే ప్రతిఫలిస్తుందనేది నిపుణులు చెప్తున్న మాట. అందుకే తల్లిదండ్రులకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు సహజంగానే ఒకరికొకరు సరిపడదు. అందులోనూ ఇద్దరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి అయితే వాళ్ల మధ్య భేదాభిప్రాయాలు మరింత ఎక్కువగా పొడచూపుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులే ఆ భేదం చూపిస్తూ ఉంటారు. ఆధిపత్య భావజాలానికి అక్కడే బీజాలు పడతాయి.

తక్కువ చేయొద్దు..
‘అరెరు అది ఆడపిల్ల.. అది ఏడుస్తుంది.. నువ్వెందుకురా ఆడపిల్లలా ఏడుస్తావు? ఆడపిల్లను షాపుకెళ్లి తెమ్మంటావేంటిరా? నువ్వు ఆడంగిలా ఇంట్లో ఉంటావా? నువ్వు మగాడివి.. ఇంట్లో పనులు ఆడవాళ్లే చేయాలి.’ ఇలా అనేకరకాలుగా నిత్యం చాలామంది ఇళ్లల్లో వినిపించే డైలాగ్స్‌ ఇవి. పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల వాళ్ల మనసుల్లో ఆడవాళ్లంటే తక్కువ భావన కలుగుతుంది. వాళ్ల పట్ల చులకన భావం పెద్దయ్యాక కూడా పోదు. అందుకే బాల్యంలోనే పిల్లలకు ఆడవాళ్ల సమర్థతను తెలియజేయాలి. వాళ్లు ఎందులో తక్కువ కాదని ఉదాహరణలతో చెప్పాలి. అప్పుడే పిల్లల్లో ఆ భావం మాసిపోయి, సమానత్వ భావం వారిలో వెల్లివిరిస్తుంది అనేది నిపుణులు చెప్తున్న మాట.

పనుల్లో వివక్ష..
ఆడ పనులు, మగ పనులు అని వేర్వేరుగా ఉండవనేది పిల్లలకు తెలియజేయాలి. అలా తెలియజేయాలంటే ముందు తల్లిదండ్రులు అలాంటి భావం వ్యక్తమయ్యేలా ప్రవర్తించకూడదు. ఇంట్లో ఏ పని అయినా
ఎవరైనా చేయొచ్చు. ఈ రోజుల్లో స్త్రీ-పురుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ పనులు చేస్తేగానీ ఇంటిపనులు సమయానికి పూర్తికావు. అదే తల్లిదండ్రులు ఆచరిస్తుంటే.. పిల్లలూ ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అదేవిధంగా పనులు చేసేస్తారు. అలాకాకుండా వివక్ష పాటిస్తే పిల్లలకూ అదే అలవడుతుందని నిపుణులు చెప్తున్నారు.

చదువులో..
చదువు విషయంలో ఎవరైనా సమానమనే భావన ముందు తల్లిదండ్రుల్లో ఏర్పడాలి. అందరికీ ఉండేది ఒకే మెదడు. దాన్ని సద్వినియోగం చేసుకునే దాన్నిబట్టి అది పనిచేస్తుంది. అలాకాకుండా స్త్రీ-పురుష భేదంతో చూస్తే వేరేలా అనిపిస్తుంది. స్త్రీలకు తెలివితేటలు తక్కువ, పురుషులకైతే ఎక్కువనే భావన సరికాదు. తెలివి తేటలు ఎవరికైనా ఒకటే అనేది తల్లిదండ్రులు దృష్టిలో ఉంటే, వారి ప్రవర్తనలో అదే ప్రతిఫలిస్తుంది. అబ్బాయిలకు ఇచ్చినన్ని అవకాశాలు.. అమ్మాయిలకు ఇవ్వరు. ఇది సరికాదనేది నిపుణులు చెప్తున్న మాట. ఈ అసమానతలు పిల్లలపై ప్రభావం చూపిస్తా యనీ, ఇది తల్లిదండ్రులవైపు నుంచే సరికావా ల్సిన విషయమని అంటున్నారు. పిల్లల ప్రతిభ, ఆసక్తి ఆధారంగా వారి చదువుల విషయంలో తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలనీ, లింగ భేదంతో కాదనేది నిపుణులు సూచిస్తున్న విషయం. నేడు అంతరిక్షంలోకి సైతం మహిళలు దూసుకుపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఈ అసమానత సమానత్వ భావాన్ని దెబ్బతీయడమే కాకుండా, సమాజాభివృద్ధిపైనా పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకని తల్లిదండ్రులు ఈ ఆలోచనలను సరిజేసుకోవాల్సి ఉంది.

ఇష్టాయిష్టాలు..
పిల్లల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుని, వాటిని నెరేవర్చే క్రమంలో అబ్బాయిలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. కొందరు తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో కూడా వివక్ష పాటిస్తున్నారనేది నిపుణులు చెప్తున్న మాట. అందుకనే అమ్మాయిలు ఆత్మన్యూనతకు గురవుతున్నారు. అది తిండి విషయమైనా, డ్రెస్‌ విషయమైనా, చదువు విషయమైనా.. ఏదైనా వారి ఇష్టాయిష్టాలను తల్లిదండ్రుల సాధ్యాసాధ్యాల ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకోవాలనేది నిపుణుల సూచన. అంతేకానీ అబ్బాయి అయితే ఒకలా, అమ్మాయి అయితే మరోలా తల్లిదండ్రులు వ్యవహరించడం సమానత్వ భావానికి తూట్లు పొడవటమేననేది నిపుణుల మాట. ఇది తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన ప్రధానమైన లోపం అని నిపుణులు చెప్తున్నారు.
ఏదైనా మూలాల్లోనే మార్పు రావాలి. ఆ మార్పు ఎప్పుడు ప్రారంభమైనా.. ఆ తర్వాత జరిగేదంతా మంచి మార్పుకే దోహదపడుతుంది. అందుకే తల్లిదండ్రులు అసమానత భావాలను, ఆధిపత్య భావాల్ని వదులుకోవడం అనేది ఏ ఒక్కరోజులోనే జరిగేది కాదు.. అది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అలాంటి భావాలకు లోనవుతున్నామేమో జాగురూకతతో ఉండాలి. ఒక్కోసారి అలాంటివాటికి లోనయినప్పుడు సరిజేసుకుని, ముందుకు సాగాలి. మార్పు మంచిదే.

➡️