వాళ్లిద్దరూ ఎదురెదురుగా నిలుచున్నారు
వాడి వెనుక ఏడేడు ఉప్పు సముద్రాలు
అతని వెనుక ఒక్కటే జన సముద్రం
వాడు చేత్తో లాఠీ పట్టుకొని
పైపు కాలుస్తూ
గుప్పుగుప్పున పొగ వదుల్తూ నిలబడితే
ఉప్పు సముద్రాలు దాటొచ్చిన
ఆవిరి ఓడలా ఉన్నాడు
అతను కొల్లాయికట్టి అనాచ్ఛాదిత వక్షంతో
చేతిలో ఎవరికీ కనిపించని
ఆయుధం పట్టుకుని నిలబడితే
జనసముద్రానికి ఎత్తిపట్టిన
వృక్షపు నీడలా ఉన్నాడు
వాడిది
రానున్న యుగాల్ని సంకేతిస్తున్న
వస్త్రధారణ
అతనిది
ఆదిమకాలాన్ని జ్ఞప్తికి తెచ్చే
అర దిగంబరత్వం
వాడు సాధించిన ఆధునికతను ప్రశ్నిస్తూ
చేతిలో కర్ర
వాణ్ణి ఆదిమ యుగ అవశేషంగా మిగిల్చింది
అతను ఆత్మికంగా సాధించిన ఉన్నతికి నిదర్శనంగా రెండు రిక్తహస్తాలు
అతన్ని రానున్న యుగ సంకేతంగా నిలబెట్టాయి
వాడు ఏం కావాలన్నట్లు
చూశాడు అతను
ధీరగంభీర ముద్రలోనున్న
పర్వతాల కేసి చూస్తూ
నెమ్మదిగా అన్నాడు ‘స్వరాజ్యం కావాలి’
అప్పటిదాకా వాడి వెనుక హోరెత్తుతున్న
ఉప్పు సముద్రాలు
ఒక్క క్షణం స్తంభించి మళ్లీ పోటెత్తాయి
అతను ఈసారి మరింత స్ఫుటంగా అన్నాడు
‘నాకు స్వరాజ్యం కావాలి’
మాట పూర్తికాకుండానే
మెడ మీద తొలి దెబ్బ పడింది
తూలిపోబోయి నిలదొక్కుకుని
మరింత దృఢంగా అన్నాడు
‘నాకు స్వేచ్చ Ûకావాలి
సమభావం, సౌభ్రాత్రం పునాదులై ఇళ్లు లేచి
జనావళికి శుభం పూయాలి’
దెబ్బ మీద దెబ్బ పడింది
పడి లేచిన కెరటంలా అతను
రెండు చేతులూ దండ చుట్టుకుంటూ
నిలదొక్కుకుని గాయపడిన గొంతుతో
మరింత నిబద్ధంగా అన్నాడు
‘క్విట్ ఇండియా’
దెబ్బల వర్షం కురిసింది
వాడు కొట్టి కొట్టి అలసి
ఆయాసంతో రొప్పుతూ
విజయగర్వంతో నిలబడ్డాడు
అతను రక్తమైసిక్తమై అరుణమై
విరగబూసిన మందారమొక్కై
వొరిగిపోయాడు
*************************************
ఎవరు గెలిచారు
ఎవరు ఓడారు
యుద్ధం ముగిశాక
నిలబడి ఉన్నవాడు గెలిచినట్టూ
వొరిగిపోయినవాడు ఓడినట్టూనా
గెలుపు భౌతికమా ఆత్మికమా
శతాబ్దాలుగా సాగిన యుద్ధాల్లో
గెలిచిన వాళ్లంతా నిజంగానే గెలిచారా
కత్తీ కత్తి పట్టి సాగించిన పోరులో
అసలు గెలుపు ఓటములంటూ ఉంటాయా
ఇప్పటిదాకా బానిస యుద్ధాలూ
మత యుద్ధాలూ అంతర్యుద్ధాలూ
ప్రపంచ యుద్దాలు చూశావు కానీ
ఎప్పుడైనా హింసకు అహింసకూ జరిగిన యుద్ధం చూశావా
దాన్ని కొలిచే తూనికరాళ్లు నీ దగ్గరున్నాయా
తుపాకీతో నిలబడ్డవాణ్ణి ఎదుర్కోడానికి
మరో తుపాకీతో వెళ్లేవాడు వీరుడైతే
నిరాయుధంగా వెళ్లేవాణ్ణి
ఏ పేరుతో పిలువగలం
అతను నిరాయుధుడనుకుంటే
అతను పిరికివాడనుకుంటే
నువ్వు నిజంగా నిప్పును తొక్కినట్టే
అది కొల్లాయనుకున్నావా
అతను అర్ధనగ ఫకీరనుకున్నావా
అతను సత్యాగ్రహి కాదూ
అతను మహాసాహసి కాదూ
అతను కవచాలూ శిరస్త్రాణమూ ఆయుధాలూ
అదృశ్యంగా ధరించి వచ్చాడు కాదూ
వాడు కొడుతుంటే
అతను కూలిపోయాడనుకున్నావా
దెబ్బ దెబ్బకూ అతనిలోని అత్మశక్తిని
గుంజుకున్నాడు కాదూ
తిరిగి దెబ్బవేయకుండా
అతని అనైతికం మీద దెబ్బతీశాడు కాదూ
కుప్పకూలిపోతూ
అతను వాడి సమస్తశక్తినీ
ధ్వంసం చేశాడు కాదూ
మహాబోధి కింద బుద్ధత్వం పొంది
ద్వేషాన్ని ప్రేమ మాత్రమే గెలవగలదని
ప్రవచించినవాడికి తెలుసు
శత్రువును ఎలా జయించాలో
కళింగ రణక్షేత్రం మధ్య నిలబడి
గెలుపును ఓటమిగా
అంగీకరించిన వాడికి తెలుసు
ఏది నిజమైన గెలుపో
ఇది యుద్ధాల్నీ
గెలుపు ఓటముల్నీ
కొత్తగా నిర్వచించిన నేల
హింస పిరికివాడి ఆయుధం అనీ
అత్యంత శక్తివంతుడు మాత్రమే
అహింసను ఆయుధంగా ధరించగలడనీ
సమరోత్సాహంతో పలికిన నేల
అన్నిటికీ ప్రత్యామ్నాయాలు చూపిన నేల
దేన్నైనా సరే
నేలరాస్తే నేల ఊరుకోదు
కాలరాస్తే కాలం ఊరుకోదు
నేల కదులుతుంది
కాలం కదులుతుంది
మనుషులు కదులుతారు
సామ్రాజ్యాలు నిశ్శబ్దంగా కూలిపోతాయి.
- కొప్పర్తి
(యాభైఏళ్ల వాన – కవితా సంకలనం నుంచి)