కణాలన్నింటికీ జ్ఞాపక శక్తి..!

Dec 1,2024 09:54 #secince, #Sneha

మన జ్ఞాపకాలకు, ఆలోచనలకు మెదడే కేంద్రమని ఇన్నాళ్ళూ మనం భావిస్తూ వచ్చాం. కానీ ఇటీవల పరిశోధనల్లో మెదడుతో పాటు మూత్రపిండాలు, శరీరంలోని ఇతర అవయవాల నాడీ కణాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేస్తాయని తెలిసింది. న్యూయార్క్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త నికోలారు వి. కుకుష్కిన్‌ బృందం ఈ పరిశోధనలు జరిపింది. ‘మెదడు కణాలేకాక నరాల, మూత్రపిండాల కణజాలాల వంటి కొన్ని శరీర కణాలు విషయాలను గుర్తుంచుకుంటాయి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలపై జరిగే చికిత్సలకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు. ఇది ఒక అద్భుతమైన, సంచలనాత్మక అధ్యయనమని చెప్పవచ్చు.

ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలంటే పదేపదే గుర్తుచేసుకుంటాం.. లేదా వల్లె వేసుకుంటాం. ఇలా గుర్తుంచుకునే సామర్థ్యం మెదడు కణాలకు మాత్రమే సంబంధించినదిగా భావించాం ఇన్నాళ్ళూ. కాదు కాదు శరీరంలోని నరాల కణాలన్నింటికీ ఈ సామర్థ్యం ఉంటుందని న్యూయార్క్‌ పరిశోధకుల అధ్యయనం సూచిస్తోంది. మూత్రపిండ కణాలు, శరీరంలోని నరాల కణాలన్నీ మెదడు కణాల మాదిరిగానే నేర్చుకోవటం, గుర్తుంచుకోవటం చేయగలవని పరిశోధకుడు కుకుష్కిన్‌ చెబుతున్నారు. ప్రతి కణం గతంలో జరిగిన ప్రతి సంఘటనకు ప్రతిస్పందిస్తుంది. అంతేకాదు, వాటిని నిక్షిప్తం చేయగలిగే శక్తిని కలిగి ఉండి, గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలంగా నమ్ముతూ వచ్చిన నమ్మకానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది.

స్పేస్‌ రిపిటీషన్‌..

కిడ్నీ నుండి, న్యూరోబ్లాస్టోమా నుండి సేకరించిన కణాలపై బృందం పరిశోధనలు జరిపింది. (న్యూరోబ్లాస్ట్‌లంటే పరిపక్వత చెందని నరాల కణాలు. ఇవి నియంత్రణ లేకుండా పెరిగిపోయి, కణితి ఏర్పడి క్యాన్సర్‌గా మారుతుంది.) ఈ పరిశోధనలో గుర్తుంచుకోవడానికి స్పేస్డ్‌ రిపిటీషన్‌ ముఖ్యమని భావిస్తున్నారు. అంటే ఒక విషయాన్ని చదివేటప్పుడు లేదా నేర్చుకునేటప్పుడు కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో గ్యాప్‌ ఇస్తూ చదివితే బాగా గుర్తుంటుంది. దీనిని డిస్ట్రిబ్యూటెడ్‌ ప్రాక్టీస్‌ లేదా స్పేస్డ్‌ రిపిటీషన్‌ అనీ అంటారు. ఈ నేర్చుకునే సామర్థ్యం మెదడు కణాల ప్రత్యేకతే కాదని.. శరీర కణాలన్నింటి ప్రాథమిక ఆస్తి అని చెప్పవచ్చు.
ఈ విషయాన్ని మొదట 19వ శతాబ్దంలోనే హెర్మాన్‌ ఎబ్బింగ్‌హాస్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త గుర్తించి, డాక్యుమెంటరీ చేసారు. అయితే నాడీవ్యవస్థకు వెలుపలి కణాల్లో ఈ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించలేదు.

కణాలన్నింటిలోనూ..

జ్ఞాపకశక్తి సామర్థ్యం మూత్రపిండాల కణాలలో మాత్రమే ఉంటుందని చెప్పటం లేదు. (పరిశోధనకు తీసుకున్నది మూత్రపిండ కణాలు కాబట్టి వాటిని ప్రస్తావించటం జరిగింది.) శరీరంలో ప్రతి కణం అది అనుభవించిన అనుభూతిని, అనుభవాన్ని నిల్వ చేస్తుంది. దానికి సంబంధించిన ఆలోచనలు, భావోద్వేగాలు మెదడు అనుభవిస్తుంది. న్యూరాన్లు నిల్వ చేస్తాయి. మెమరీ లేదా జ్ఞాపకశక్తి శరీర కణాలలోని నీటిలో నిల్వ చేయబడుతుంది. కణాలలో నీటి శాతం సరిపోనూ ఉంటే శరీరం శక్తిమంతంగా, చైతన్యవంతంగా ఉంటుంది. సాధారణంగా 60 శాతం నీరు (మూడింట ఒక వంతు) కణాల చుట్టూ ఉంటుంది. మెదడు, మూత్రపిండాల కణాలు అధిక శాతం నీటిని కలిగి ఉంటాయి. కణంలోని నీటిలో ఉంటే బయోఫోటాన్‌ అనే కాంతి శక్తి మన జ్ఞాపకశక్తికి, మెళకువతో ప్రవర్తించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు పాంక్రియాజ్‌ కణాలు కూడా మనం తీసుకున్న ఆహారంలో ఉన్న చక్కెరను బట్టి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది.

న్యూరో ట్రాన్స్‌మీటర్ల విడుదల..

ఈ కణాలు కొత్త సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు న్యూరో ట్రాన్స్‌మీటర్లను విడుదల చేస్తాయి. నూరో ట్రాన్స్‌మీటర్లంటే.. శరీరంలోని నాడీ కణాలు, కండర, గ్రంథుల కణాలు (లక్ష్య కణాలు) వీటన్నింటి మధ్య సమన్వయంతో పనిచేసే రసాయన సంకేతాలు. ప్రతి పనిలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. న్యూరో ట్రాన్స్‌మీటర్లు లేకుండా శరీరం పనిచేయదు. నిరంతరం ఒక న్యూరాన్‌ (నరాల కణం), లక్ష్య కణానికి రసాయన సంకేతాలను (సందేశాలు) చేరవేస్తుంటుంది.

‘ఈ ఆవిష్కరణ మెమరీ పనిచేయటం, నేర్చుకోవటంలో మెళకువలు, జ్ఞాపకశక్తి, క్యాన్సర్‌, ఇతర ఆరోగ్యసంబంధిత సమస్యలకు.. చికిత్స చేయడానికి మెరుగైన మార్గాలను చూపుతుంది’ అని కుకుష్కిన్‌ గమనించినట్లు వివరించారు.
‘మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తులకు కూడా కొత్త విషయాలకంటే, నెమరువేసుకున్న విషయాలు, వారి అనుభవాలు గుర్తుంటాయంటున్నారు. నిద్ర, ఒత్తిడి లేని జీవితం, పోషకాహారం దీనిపై చాలా ప్రభావం చూపిస్తాయి. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌లు ఉత్తేజితమవటానికి కావలసిన శక్తిని ఇవి సమకూరుస్తాయంటున్నారు కుకుష్కిన్‌..

➡️