సప్తపదుల అక్షర మాలికలు..

Mar 31,2024 08:51 #book review, #Sneha
  • ఇది కవితా సంకలనమా.. సత్యాన్వేషణమా.. బతుకు ఘటనల వ్యాఖ్యానమా.. అని తరచి చూస్తే అన్నింటినీ ప్రతిబింబించే పద రచనలు ‘నవీన’ కవితా సంకలనంలో కనిపిస్తాయి మనకు. ఈ పుస్తకంలో సుధామ కలం చిలుకులు.. రెండు మూల పదాలు.. ఐదు సాధారణ పదాలతోనున్న ఒక వాక్యం.. మొత్తం ఏడు పదాల లఘు కవిత్వ రూపం సప్తపదుల సప్తశతిగా దర్శనమిచ్చింది. మొదటి రెండు లైన్లు ఒక్కొక్క పదంతో ఉండి చివరి అక్షరాలు ప్రాసతో ముగుస్తాయి. మూడవలైను ఆ రెండు పదాలను సమన్వయపరుస్తూ ఐదు పదాల వాక్యం కూడా చివరి అక్షరాలు ప్రాసతో ముగుస్తుంది. ఒకే పదం రిపిటేషన్‌ కానీ, ఆంగ్ల పదాలు రావడం కానీ లేకపోవడం ఈ లఘు కవితా సంకలన ప్రత్యేకత. దీనిలో రచయిత అనుభూతులు, నిత్యకృత్యాలు, సామాజికాంశాలు, తాత్వికాంశాలు అక్షర సత్యాలుగా తళుకులీనుతాయి.

బతుకు/ మెతుకు/ పండించే రైతు చితుకు, చేయూత వెతుకు.. అల్లి/ బిల్లి/ ఆటల చెల్లీ! అందెను చూడు జాబిల్లి.. ఓటు/ నోటు/ మలినమైన విజయం వరిస్తే ప్రజాస్వామ్యానికి చేటు.. చంద్రయాన్‌/ గగనయాన్‌/ చేయించి గెలిచిన ఇస్రో కీర్తి మహాన్‌ : ఇలా పలుకులు, మెలకువలు కళకళలాడతాయి ఈ సప్త పదాల్లోనే. చిన్నప్పుడు/ విన్నప్పుడు/ తెలియవు పెద్దలమాటలు నిజానికవి నిధులే ఎల్లప్పుడు.. మాత/ పిత/ వృద్ధాప్యంలో వారిని చూడటం మన బాధ్యత.. లాంటి కవితా నీతులు, మన్ను/ మిన్ను/ రెండింటికీ మధ్య ఉన్నదే దర్శిస్తుంది మనకన్ను.. ఉరవళ్ళు/ పరవళ్ళు/ కడగండ్లు, కన్నీళ్ళు జీవితం నిండు నూరేళ్ళు.. లాంటి తాత్వికాంశాలు అలవోకగా చెబుతారు రచయిత. అంతేనా! వలువ/ విలువ/ కాలదన్నిన మగువ కసవులో రేకులూడిన కలువ.. రాయి/ కసాయి/ శిల్పి చేతిలో పడితే అది పావురాయి.. పద్యం/ గద్యం/ సాహిత్యం విలువలు తోడైతే రెండూ హృద్యం.. లాంటి కవితాశువులు చిలకరిస్తారు సుధామ.
అంతటితో ఆగలేదు రచయిత. ఈ సప్త పదులను చదువుతూ పోతుంటే.. మరికొందరు సప్తశతికర్తల రచనాకృతుల్ని ఈ పుస్తకంలో పరిచయం చేశారు. అవి మాత్రం తక్కువ తిన్నాయా..! లేదు. మన చుట్టూ తిరుగుతూ పలకరిస్తూనే ఉన్నాయి. ఆలకించేవారికి వినిపిస్తున్నాయి. మరి మనమూ కొన్నింటిని చవిచూద్దాము. ‘ఓటు నోటు ఇదే నేటి సగటు మనిషి ఆశలరేటు’ అంటారు బిహెచ్‌ఇఎల్‌ భానుప్రకాష్‌. ‘పడవ కడవ చిల్లు పడనంతవరకు ఉండదు ఏ గొడవ’ అంటూ ఓ చిలిపి చెణుకు అనకాపల్లి సీతాసతీష్‌ది. ‘తనువు మనువు వీటి కలయితే మరి సృష్టికి సుమధనువు’ అంటూ పార్నంది సరోజ.. ‘కలహాలు విరహాలు కాపురంలో అప్పుడప్పుడు పెంచుతాయి సరాగాల వరహాలు’ అంటూ జీవన గమనాలను అందిస్తున్నారు హైదరాబాదుకు చెందిన శాంతమూర్తి.
‘రాజకీయం అరాచకీయం కాకూడదు కక్షలూ, కార్పణ్యాలతో విస్మరించరానిది మానవీయం’ అంటూ రాజకీయాన్ని సురాజ్యం కోసం వాడుకుందామంటారు వి. విజయకుమార్‌. ‘సూర్యుడైనా చంద్రుడైనా ఆకాశమంత ఎత్తుకి ఎదగాలంటే పోరాడాల్సిందే ఎవరైనా’ అంటారు ముప్పాళ్లకు చెందిన దుర్గం సునీత. ‘దృష్టి సృష్టి కవి కలంలో కురియాలి ప్రగతిశీలక భావవృష్టి’ అని సామాజిక పరివర్తనకు కవి భావాలు నిత్య ప్రామాణికాలంటారు విజయవాడకు చెందిన శ్రీకంఠ స్ఫూర్తి, కలం గళం శరమై, సమరశంఖమై విజృంభించిన- అవినీతికి మంగళం’ పలకొచ్చంటారు యార్లగడ్డ శ్రీరంగలక్ష్మి. ‘ఆరాటం పోరాటం మనకు సంకల్పం లేకనే సంక్షోభం, చెలగాటం’ అంటూ చైతన్యపరిచే విధంగా కాకినాడకు చెందిన వేదుల శ్రీరామశర్మ. ‘సప్తపది అష్టపది సుధామైనా, జయదేవుడైనా మంచి కవిత్వం అలరిస్తుంది మది’ అంటూ కవులు, కవిత్వాలనే వస్తువుగా తీసుకుని, మదిని దోచారు అహ్మదాబాదుకు చెందిన సిహెచ్‌ బృందావనరావు. ‘వలపు పిలుపు తనువులో, తలపులో, తపనలో కొత్తమెరుపులు మేలుకొలుపు’ అంటూ ఆసు రాజేంద్ర, ‘కుతంత్రం పరతంత్రం ఛేదించి అందించెను జాతికి స్వాతంత్య్రం’ అంటూ ‘స్వ’ అభిమానాన్ని సప్తపదుల్లో చొప్పించారు యడవల్లి విజయలక్ష్మి.
ఈ సమీక్ష పరిధిలో కొద్ది మంది కవుల పరిచయం మాత్రమే చేసినప్పటికీ.. మొత్తం ఏడువందల కవితలతో ఉన్న కవుల భావ వ్యక్తీకరణలు నవీన రూపంలో ప్రజల్లోకి తెచ్చి, అందరూ ఆలోచించే ప్రయత్నం చేయటం అభినందనీయం.. అభిలషణీయం.

ప్రతులకు..
పేజీలు : 222
వెల : రూ. 178 /-
నవీన (సప్తపదుల సప్తశతి) కవితా సంకలనం
ఎ. వెంకటరావు (సుధామ)
ఇ. 107, రాజపుష్ప ఆట్రియా,
గోల్డెన్‌ మైల్‌ రోడ్‌, కోకాపేట,
హైదరాబాదు- 500075 (టిఎస్‌)9849297958

 

– టాన్య, 7095858888

➡️