అతివల సారథ్యంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం

Apr 13,2025 08:08 #Ambedkar University VC, #Sneha

అంబేద్కర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా స్త్రీ సాధికారతకు ప్రతిబింబంగా యూనివర్శిటీకి విసి సహా కీలక స్థానాల్లో 19 మంది మహిళలు సారథ్యం వహిస్తున్నారు. అంతేకాదు బోధనలోనూ పాలనలోనూ రాణిస్తున్నారు. అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకోగలగడమే కాదు.. అందరూ మెచ్చేలా.. ఆదర్శనీయంగా నిలుస్తారని నిరూపిస్తున్నారు. పురుషులకు ధీటుగా ప్రతి రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. మహిళలు శక్తి సామర్థ్యాలను తక్కువచేసే భావజాలాన్ని పటాపంచలు చేస్తూ ఎంత శక్తిమంతులో నిరూపిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో కీలక స్థానాల్లో నాయకత్వం వహిస్తూ ఏకంగా ఒక యూనివర్శిటీనే నడిపిస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయాన్ని ప్రగతిబాట పట్టిస్తున్నారు. మహిళా సాధికారత అంటూ మాటలు చెప్పే నేతలకు అసలు సిసలైన సాధికారత అంటే ఏమిటో ఆచరణలో చూపిస్తున్నారు. యూనివర్సిటీకి కొత్త రూపు, పాలనలో సమూల మార్పులు, బోధనలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుతున్నారు. అంబేద్కర్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీలో అంబేద్కర్‌ ఆకాంక్షించిన మహిళా సాధికారత కొంతైనా ఇక్కడ ద్యోతకమవడం యాధృచ్ఛికమే అయినా కొంత ఊరటనిచ్చిన అంశమే.
ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి సందర్భంగా యూనివర్శిటీ విశేషాలపై ప్రత్యేక కథనం.

పిజి సెంటర్‌గా 1976-77 నుంచి ఉన్న ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం 2008లో యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి మొత్తం 120 మంది పనిచేస్తున్నారు. వారిలో మొత్తం 25 మంది మహిళలు ఉండడం విశేషం. వారిలో వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ (ఒఎస్‌డి), ప్రత్యేక అధికారి, ఆర్ట్స్‌, కామర్స్‌, లా, ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌, అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌, అసిస్టెంట్‌ ఛీప్‌ వార్డెన్‌ వంటి హోదాలతో పాటు పలు విభాగాలకు సమన్వయకర్తలు, ఫ్యాకల్టీ మెంబర్లు మహిళలే కావడం ఇక్కడి విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా వైస్‌ ఛాన్సలర్‌ హోదాలో ఒక మహిళ పదవిని అధిష్టించడం రికార్డు అనే చెప్పాలి. ఇప్పటివరకు పది మంది వైస్‌ ఛాన్సలర్లుగా పనిచేయగా, అందులో ప్రొఫెసర్‌ కె.ఆర్‌. రజని ఒక్కరే తొలి మహిళా వైస్‌ ఛాన్సలర్‌. అంతేకాదు ఫిలాసఫీలో అఖిలభారత స్థాయిలో తొలి మహిళా వైస్‌ఛాన్సలర్‌గా ఆమె ఘనతకెక్కారు. ఇక్కడ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ పి. సుజాత కూడా యూనివర్సిటీకి తొలి రిజిస్ట్రార్‌ కావడం విశేషం. ఇలా అనేక విషయాల్లో పలు ప్రత్యేకతలు సంతరించుకుంది అంబేద్కర్‌ యూనివర్సిటీ. ఉన్నత స్థానాల్లో బాధ్యతలు నిర్వరిస్తున్న వీరికి విధుల నిర్వహణ అంత తేలిగ్గా ఏమీ లేదు. అయినా సమిష్టిగా పనిచేస్తూ, అనేక సవాళ్లను అధిగమిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. యూనివర్సిటీ పురోగతిలో అనేక మైలురాళ్లను సాధిస్తున్నారు. మహిళా సాధికారతకు ఒక రోల్‌ మోడల్‌గా పనిచేస్తున్నారు.

 

అధిగమిస్తూ అభివృద్ధి పథంలో..
యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ కె.ఆర్‌.రజని ఎన్‌టిఆర్‌ జిలా,్ల తిరువూరు మండలం మల్లెల సొంత గ్రామం. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ ఫిలాసఫీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 1994లో చేరారు. తర్వాత 2000 నుంచి 2008 వరకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 2008 నుంచి 2019 వరకు ప్రొఫెసర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. చదువులో మంచి ట్రాక్‌ రికార్డు ఈమె సొంతం చేసుకున్నారు. 1992లో ఎంఎ ఫిలాసఫీలో యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకు, ఎంఎ రెలీజియస్‌ స్టడీస్‌లో 1995లో ప్రథమర్యాంకు సాధించారు. ది ఐడియల్‌ హ్యుమానిటీ అంశంలో 1990లో ఆమెకు పిహెచ్‌డి అవార్డు దక్కింది. ప్రొఫెసర్‌ కె.ఆర్‌. రజని 2024, జనవరి 18న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. యూనివర్శిటీ ప్రగతిలో తనదంటూ ముద్ర వేస్తున్నారు. ఈమె వచ్చిన తర్వాత సెంట్రల్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌, విద్యార్థుల కోసం డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. రుసా ద్వారా మంజూరైన రూ.20 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటితో అకడమిక్‌ భవనాల నిర్మాణం, ఆధునికీకరణ, ఇంజినీరింగ్‌ కళాశాలకు ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ఫార్మసీ కళాశాల కోర్సు, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌, ఇంజినీరింగ్‌లో ఎఐ కోర్సు, జియో సైస్స్‌ కోర్సుల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖేల్‌ ఇండియా భాగస్వామ్యంతో స్సోర్ట్స్‌ మైదానం కోసం ప్రయత్నిస్తున్నారు. యూనివర్శిటీ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్న రజనికి కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం అందుతోంది. అయితే విశ్వవిద్యాలయంలో కొన్ని వెనక్కిలాగే శక్తులూ లేకపోలేదు, వాటిని అధిగమిస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు.

 

నానమ్మే నాకు స్ఫూర్తి!

మా నాన్న గారు కాలంగి బాలసుందరం, అమ్మ మార్తమ్మ ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేశారు. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. మా తాత కాలంగి జాకబ్‌, నానమ్మ కాలంగి ఎలీస్‌ ఇద్దరూ ఉపాధ్యాయులే. నానమ్మ మహిళా సాధికారత ఆకాంక్షించే గొప్ప వ్యక్తి. ఆమె స్ఫూర్తితోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నా భర్త ప్రొఫెసర్‌ గంటా సుభాకర్‌ ఆంధ్రా యూనివర్శిటీలో ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి, రిటైర్‌ అయ్యారు. నేనూ, ఆయన ఒకేసారి ఎయులో ప్రొఫెసర్లుగా చేరాం. నాకు ఆయన సహకారం సంపూర్ణంగా ఉంది. మహిళ నాయకత్వం వహించే ప్రతిచోటా వెనక్కిలాగే శక్తులు ఉంటాయి. నాకు కొన్ని స్వీయ అనుభవాలు ఎదురయ్యాయి. మహిళ, అందులో ఓ దళిత మహిళ ఏం చేయగలదు? అనే పరిస్థితులనూ చవిచూశాను. పనిలో సమన్వయం చేసుకుని, సమస్యలను అధిగమించలేకపోతే మనకున్న జ్ఞానం వ్యర్థమని నా అభిప్రాయం. విద్యావంతులు, పనిచేసే తత్వం, అనుభవం అంశాల ఆధారంగా సిబ్బందిని ఎంపిక చేసుకుని, ముందుకు వెళ్తున్నాను. మహిళా సాధికారతకు విద్యే ప్రధానం. పిల్లలను ఎంతమందిని కనాలో పురుషులే నిర్ధేశిస్తున్నారు. మహిళలకు తన శరీరం మీద కూడా నియంత్రణ లేని పరిస్థితిని చూస్తున్నాం. ఇక మహిళల ఆలోచనలకు ఇంకేం ప్రాధాన్యం ఇస్తారు. మహిళలపై కుటుంబం, సమాజం ఆలోచించే విధానం మారాలి. స్త్రీ విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యపడుతుంది.

– కె.ఆర్‌. రజని, వైస్‌ ఛాన్సలర్‌

నాన్న ప్రభావంతోనే..
యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ పి. సుజాత మరో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆంధ్రా యూనివర్శిటీలో 2010లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ప్రస్థానం ప్రారంభించి, గీతం యూనివర్శిటీతో పాటు అమెరికాలోని పది ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఆమె పనిచేశారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో రెండేళ్ల పాటు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా సుజాత పనిచేశారు. విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, పలు విభాగాలకు డీన్‌గా ఆమె విధులు నిర్వర్తించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, సర్వీస్‌ మేటర్స్‌ వంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. పాలనను స్ట్రీమ్‌లైన్‌ చేసే పనిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. భర్త మూర్తి, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతున్నానంటున్నారు. ‘మా కుటుంబంలో మా నాన్న వెంకట్రావు మహిళా సాధికారత కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ప్రభావంతో ఈ రోజు విధుల్లో రాణించగలుగుతున్నా!’ అని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

– పి. సుజాత, రిజిస్ట్రార్‌

 

ఇంటర్‌లోనే పెళ్లి.. ప్రిన్సిపల్‌ స్థాయికి చేరాను..

యూనివర్శిటీ ఆర్ట్స్‌, కామర్స్‌ లా అండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎం.అనురాధ 2008లో టీచింగ్‌ అసోసియేట్‌గా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీలో చేరారు. ఇంటర్‌ చదువుతుండగానే ఆమెకు వివాహం చేసినా పట్టుదలతో తన విద్యాభ్యాసాన్ని ఆ తర్వాతా కొనసాగించారు. భర్త అచ్యుతరావు, అత్త, ఆడపడుచుల సహకారంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పారు. పెళ్లయిన తర్వాత చాలామంది మహిళలకు చదువుకునేందుకు కుటుంబసభ్యులు అంగీకరించే పరిస్థితులు ఉండడం లేదన్నారు. ‘మా యూనివర్శిటీకి వస్తున్న వివాహిత మహిళలు చదువుకోవాలని ఆసక్తి చూపుతున్నా, చాలా మంది అంగీకరించడం లేదు. మా కుటుంబసభ్యుల మాదిరిగానే మహిళలకు చదువుకునేందుకు అవకాశం ఇస్తే స్త్రీలు ఉన్నతస్థాయికి చేరుకుంటారు. కుటుంబంతో పాటు సమాజమూ అభివృద్ధి చెందుతుంది!’ అంటున్నారు.

  • డాక్టర్ ఎం.అనురాధ.  ఆర్ట్స్‌, కామర్స్‌, లా అండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌

మేడమ్స్‌ మాకు స్ఫూర్తి!

యూనివర్శిటీలో మహిళలే కీలక స్థానాల్లో ఉండడం చాలా మంది యువతకు ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ సోషల్‌ వర్క్‌లో పిజి చేసిన జి.నవీన సెట్‌, నెట్‌ పరీక్షలు రాసి నెట్‌లో నాలుగో ర్యాంకు సాధించారు. 2024లో సైబర్‌ క్రైమ్‌ ఇన్‌ యూత్‌ కోర్సులో పిహెచ్‌డిలో చేరారు. ఒకవైపు చదువుతూనే శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయినిగా చేరారు. తన చదువుకు, ఉపాధికి వైస్‌ ఛాన్సలర్‌ కె.ఆర్‌. రజని, కావ్య మేడమ్‌ స్ఫూర్తి అని ఆమె అంటున్నారు. యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ మెకానిక్‌ కోర్సులో మూడో సంవత్సరం చదువుతున్న వి.నరేంద్ర మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విసి మేడమ్‌తో నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. ల్యాబ్‌లో సమస్యలు మేడమ్‌ దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కారమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్శిటీ విద్యార్థులకు విసి మేడమ్‌ చొరవతోనే చాలా తక్కువ ఛార్జీలతో బస్సు సౌకర్యం వచ్చిందంటూ జి.ప్రవీణ్‌ అనే విద్యార్థి సంతోషం వ్యక్తం చేశారు.

 

– తోట భీమారావు
7672021246

➡️