ఉసిరి ఆరోగ్య సిరి. ఔషధగని. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శాస్త్రీయనామం ఫిలాంథస్ ఎంబ్లికా (ూష్ట్రyశ్రీశ్రీaఅ్‌ష్ట్రబర వఎbశ్రీఱషa). ఫిలాంథస్ కుటుంబానికే చెందిన చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి, కేరళ ఉసిరి అనే బిలింబి. ఇవన్నీ దాదాపు ఒకేరకమైన రుచిని కలిగి ఉంటాయి. బిలింబి శాస్త్రీయనామం ఎవరోవా బిలింబి. ఉసిరిలో కాయలు, గింజలు, ఆకులు, పూలు, వేళ్ళు, బెరడు అన్నీ ఔషధగుణాలు కలిగి ఉండటంతో ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు. మలబద్ధకానికి ఉసిరికాయ దివ్యౌషధం. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రుల నివారణకు ఉసిరిని వినియోగిస్తున్నారు. తలనూనె, షాంపూలు, సౌందర్య సాధనాలు, వంటలు, మందుల తయారీలో ఉసిరిని విరివిగా వినియోగిస్తున్నారు. అంతేకాదు. పెన్నుల్లో ఉపయోగించే ఇంకు, సాస్, తలకి వేసుకునే రంగుల్లో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు. యాంటి ఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, క్యాల్షియం, ప్రోటీన్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ఉపయోగాలున్న ఉసిరితో నిల్వ పచ్చళ్ళు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
పెద్ద ఉసిరి..
కావలసినవి : ఉసిరి కాయలు-1/2 కేజీ, మెంతి, ఆవాల (మెంతులు, జీలకర్ర ఒక్కొక్క స్పూను, ఆవాలు-4 స్పూన్లు) పొడి- 2 స్పూన్లు, నువ్వుల నూనె-300 గ్రా, వెల్లుల్లి రెబ్బలు- 12, నిమ్మకాయలు- 2, పసుపు- 1/2 స్పూను, ఉప్పు-50గ్రా., కారం- 50గ్రా., కరివేపాకు- 2 రెబ్బలు
తయారీ : మెంతులు, ఆవాలు, జీలకర్రను దోరగా వేయించి, మెత్తని పొడి చేసుకోవాలి. కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఉసిరి కాయలను కడిగి తడి లేకుండా తుడిచి, ఆరిన తర్వాత రెండు గాట్లు పెట్టాలి. బాండీలో నూనె వేడి చేసి, గాట్లు పెట్టిన ఉసిరి కాయలను రెండు, మూడు నిమిషాలు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా వేయించి, స్టౌ ఆఫ్ చేయాలి. దీనిలో పసుపు వేసి, తాలింపు పూర్తిగా చల్లారేంత వరకూ పక్కనుంచాలి. బేసిన్‌లో మిక్సీ పట్టిన ఉప్పు, మెంతులు, ఆవాలు జీలకర్ర పొడి, కారం, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి బాగా కలపాలి. దానిలో వేయించిన ఉసిరి కాయలు నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత చల్లారిన తాలింపు నూనె పోసి, పచ్చడిని బాగా కలిపి మూడు రోజులు ఊరనివ్వాలి. రోజుకొకసారి తడి తగలకుండా కలపాలి. మూడో రోజు రుచి చూసి అన్నీ సమంగా సరిపోతే గాజుసీసా / జాడీలో పెట్టుకోవాలి. అంతే యమ్మీ యమ్మీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ.
(నిమ్మరసం బదులు 50 గ్రా.ల చింతపండు తీసుకుని గుజ్జు తీసి తాలింపులోనే ఉడకనిచ్చి పచ్చడిలో కలుపుకోవచ్చు)
బిలింబి..
కావలసినవి : బిలింబి – 250 గ్రా., ఆవాలు-2 స్పూన్లు, మెంతులు-స్పూను, నువ్వుల నూనె- 1/2 కప్పు, వెల్లుల్లి- 8, ఎండుమిర్చి- 6, ఉప్పు- తగినంత, కారం-1/4 కప్పు, బెల్లం- స్పూను, పసుపు-స్పూను
తయారీ : ముందుగా బిలింబి కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరనివ్వాలి. వేయించిన ఆవాలు, మెంతులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బేసిన్‌లో ఆరిన కాయలను నాలుగు నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు దోరగా వేయించి, బిలింబి ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త రంగు మారగానే ఉప్పు, కారం, బెల్లం, పసుపు కలపాలి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బిలింబి పికిల్ రెడీ.
చిన్న ఉసిరి..
కావలసినవి : చిన్న ఉసిరికాయలు- 1/2 కేజీ, నూనె-300 గ్రా, ఆవాలు, మెంతుల పొడి- 2 స్పూన్లు, ఉప్పు-50గ్రా., పసుపు- 1/2 స్పూను, కారం- 50గ్రా., చింతపండు-50 గ్రా., కరివేపాకు- 2 రెబ్బలు
తయారీ : బాండీలో నూనె వేడిచేసి శుభ్రం చేసిన ఉసిరి కాయలను రెండు నిమిషాలు వేయించి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో స్పూను చొప్పున ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. నూనె చల్లారిన తర్వాత ఉసిరికాయలు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు-మెంతుల పొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. అంతే చిన్న ఉసిరికాయల పచ్చడి రెడీ. చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు దోరగా వేయించి, బిలింబి ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త రంగు మారగానే ఉప్పు, కారం, బెల్లం, పసుపు కలపాలి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బిలింబి పికిల్ రెడీ.