అమ్మ మాటే మాతృభాష

మనం ఒక వ్యక్తితో మన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ సమాచారం కేవలం మెదడుకు మాత్రమే చేరుతుంది. అదే మన మాతృభాష, అతని మాతృభాష ఒకటే అయినప్పుడు ఆ సమాచారం హృదయానికి చేరుతుందంటారు నెల్సన్‌ మండేలా. ప్రతి ఒక్కరూ తమ జన్మభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుందని డబ్ల్యూ.బి.యేట్స్‌ అంటాడు. భాష మన భావాలను ఎదుటివారికి వ్యక్తపరిచే ఒక సాధనం. భూగ్రహంపై ఉన్న లక్షలాది జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే భావాలను రాత, కూత రూపంలో వ్యక్తపరిచే అవకాశం ఉంది. మన మనసులో ఏ భావాలు ఉంటాయో, ఏ అనుభవాలు ఉంటాయో వాటిని సమర్థవంతంగా భాష తెలుపుతుంది. మాట్లాడే అలవాటుతో కూడిన వ్యవస్థ భాష. బుద్ధి జీవులు తమ అనుభవాలను భాష ద్వారానే వ్యక్తం చేస్తారు. మొదట చిన్న చిన్న శబ్దాల రూపంలో ప్రారంభమైన భాష, అమ్మ నోటి నుండి వెలువడే పదాలతో సుసంపన్నమవుతుంది. అమ్మ మాటను శిశువు అనుకరిస్తాడు.. అనుభవిస్తాడు.. ఆనందిస్తాడు.. జత కలుపుతాడు.. కొనసాగిస్తాడు. అమ్మ మాటే మాతృభాషగా కొనసాగుతుంది. తెలుగు నేల మీద అమ్మ భాషకు క్రమంగా వెలుగులు తగ్గుతున్నాయి. మూలమైన ఈ భాషను చేతులారా మనమే మూలకు నెట్టేస్తున్నాం. తల్లిని ప్రేమించినట్టే.. తల్లిని రక్షించుకున్నట్టే భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

భావ వ్యక్తీకరణకు, భావ గ్రహణానికి మాతృభాష కీలకమైనది. మనం వేరే భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్నప్పుడు, మన భాషకు సంబంధించిన ఒక్కమాట వినబడినా ఉప్పొంగిపోతాం. మాతృభాషను మాట్లాడగలిగిన వ్యక్తి ప్రపంచంలోనే ఇతర ఏ భాషనైనా సులభంగా నేర్చుకుంటాడనడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మన బాధను, ఆనందాన్ని, కోపాన్ని, అనుభూతిని మాతృభాషలో వ్యక్తీకరించినంత శక్తివంతంగా ఇతర ఏ భాషలోనూ వ్యక్తీకరించలేము. ఇవాళ మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న ఒక తరాన్ని మనమే తయారుచేసుకున్నాం. విద్య వ్యాపారం అయ్యాక, మనిషి సరుకు వెంటపడ్డాక, కేవలం డబ్బులు సంపాదించడమే విద్యగా మనం మార్చేశాం. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే కానీ పరాయిభాషను నాలుక మీద ఎక్కించుకొని, మాతృభాషను పాదాల కిందకు తొక్కేయడం క్షమించరాని నేరం.


చదివితే ప్రయోజనాలు..
మాతృభాషలో విద్యాబోధన వల్ల గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత వికసిస్తుంది. మనుషులు నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లే కలుగుతుంది. అసలు స్వభాషలో విద్య ఉంటే మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చి ఉండేదని గాంధీ అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్య మనసును చురుగ్గా చేస్తుంది. భాష కేవలం వ్యక్తీకరణ కోసమే కాక, అది ఒక జాతి మొత్తానికి వారి ఉనికిని, వారి సంస్క ృతిని, సాంప్రదాయాలను, స్థానిక వాతావరణ పరిస్థితులను ఆ తర్వాత తరానికి అందించే వారధిగా ఉంటుంది. భాష ఒక జాతి అస్తిత్వం. పరాయి భాష కేవలం జీతం కోసమే. మాతృభాష జీవితాన్ని తెలుపుతుంది. మాతృభాషలో మన ఆలోచన అత్యంత వేగంగా ఉంటుంది. ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి మాతృభాష సోపానం వంటిది. మన మాతృభాషని అర్థం చేసుకుంటే అందులోని జాతీయాలు, పదబంధాలు, మెరుపులు, ఛలోక్తులు వాటి తాలూకు పరిమళం మనకు తెలుస్తాయి. పరాయి భాష ఎంత నేర్చుకున్నా అందులోని ప్రాణశక్తిని మనం పట్టుకోలేం. మాతృభాషలో విద్యను నేర్చుకున్న విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి తొందరగా అలవాటుపడతారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమని చెప్పినప్పుడు మాట్లాడగలరు, స్పందించగలరు. ఇతర భాషల్లో ఆ స్పందన ఉండదు. కేవలం బట్టీపట్టి మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. పసివారి మెదడుకు మాతృభాష సహజమైన పోషణ. పిల్లలు ఈ నేల మీద పుడతారు, ఈ నీళ్లు తాగుతారు. కానీ విదేశీ భాషను ఆ పసికందుల నెత్తిన రుద్దడం అంటే వారి మేధాశక్తిని, సృజనాత్మకతను హత్య చేయడమే అవుతుంది.


భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌ తొలి భాషా ప్రయుక్తగా ఏర్పడింది. కానీ ఇవాళ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ప్రభుత్వం జీవోలు తెలుగులో ఇవ్వాలనే ఒక ప్రకటన విడుదల చేసింది. జీవోలు తెలుగులో ఇచ్చినంతమాత్రాన భాషను పరిరక్షించినట్టు కాదు. పాలనా భాషగా, బోధనా భాషగా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడానికి పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు కారణం. ఈనాటి బాల బాలికలలో, యువతరంలో తీవ్రమైన మానసిక ఉద్వేగాలకి కారణం వాళ్లు తమ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోలేని స్థితిలో ఉండటమే! మనది కాని సాహిత్యాన్ని వాళ్ళ నెత్తిన రుద్దుతున్నాం. పరభాషా వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది. అమ్మ భాషను పరిరక్షించుకోవడం సామాజిక అవసరం. ‘దేశ క్షేమానికి భాషా క్షేమమే పునాది’ అని గిడుగు అప్పుడెప్పుడో ఉద్ఘాటించారు. ‘పర భాష బోధన సోపానాలు లేని సౌధంలా ఉంటుంది’ అని ఠాగూర్‌ అంటారు. విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. ‘విద్యా బోధన మాతృభాషలో జరగాలి. కొల్లగొట్టుకునే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు!’ అని మహాత్ముడు పిలుపునిచ్చాడు.

 

నూతన విద్యా విధానంలో..
నూతన జాతీయ విద్యా విధానంలో కూడా ప్రాంతీయ భాషలకు పట్టం కట్టారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో ఉండాలని చెప్పారు. అయినా సరే అట్లాంటి చట్టాల్ని, నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవు. ఏదో ఒకసారి కోర్టులో తీర్పు తెలుగులో వెలువడితే చంకలు గుద్దుకుని ఆనందించిన వాళ్ళం మనమే. పిల్లలకు పునాది సరిగా లేకపోతే ఏ భాష అయినా ఎలా వస్తుంది. సృజనాత్మకత మొలకెత్తాలంటే మాతృభాష మార్గం. శిక్షణల ద్వారా భాష రాదు. మనం కొన్నాళ్లుగా ఇంగ్లీష్‌ మీడియం పేరు మీద ఇస్తున్నది శిక్షణ. కానీ అది పిల్లలకు రక్షణ కాదు. అది విద్యావిధానం లక్షణం కాదు. మాతృభాషను ఎట్లా ఉత్సవం చేసుకోవాలో ఈ జాతి ఇంకా తెలుసుకోలేదు. ‘మాతృభాష కంటిచూపు వంటిది. మిగతా భాషలు కళ్ళజోళ్లు వంటివి. కంటిచూపు లేకుండా కళ్ళజోళ్ళు ఎన్ని పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో చెప్పారు. తనకు మాతృభాషలోనే విద్య నేర్పమని ఔరంగజేబు తన గురువుకు ఉత్తరం రాసిన సంగతి చరిత్రలో ఉంది. ఆనాటి విద్యావ్యవస్థపై ఔరంగజేబు చేసిన ఫిర్యాదు అది.

 


ఏ భాష నేర్వాలన్నా..
ప్రపంచవ్యాప్తంగా జరిపిన జరుగుతున్న పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏ శాస్త్రమైనా ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరైనదని తేల్చారు. జపాన్‌, ఐర్లాండ్‌, ఫిన్లాండ్‌, చైనా లాంటి దేశాల్లో ఆ ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవంగా ఉన్నప్పటికీ మాతృభాష పరిరక్షణ తప్పనిసరి అవుతుందని యునెస్కో తెలుపుతుంది. ‘నేను నా మాతృభాషలోనే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాష కారణం. మా అభిమాన మాతృభాషనే మా బిడ్డలకు నేర్పుతాం. వారెవరో వారికి తెలియాలి!’ ఇలాంటి నినాదాలు యునెస్కో ఎప్పటినుంచో గుర్తుచేస్తూ ఉంది.
భాషను వ్యాపార వస్తువు చేయడం మన రాష్ట్రంలో మరీ మితిమీరినట్టుగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాన్వెంట్ల మోజు విపరీతంగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా భాషను బ్యాలెట్‌ పేపర్‌గా చూడడం మొదలుపెట్టాయి. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో చేర్పించి, పిల్లవాడు చాలా త్వరగా ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నాడంటూ మురిసిపోతున్నారు. అందులో వారి తప్పేమీ లేదు. ఆంగ్లం కేవలం 26 అక్షరాలతో కూడిన భాష. తొలి 100 పదాలను సులభంగా నేర్చుకుంటారు. ”మమ్మీ డాడీ” అని పిలుస్తూ తిరుగుతూంటే ఇంగ్లీష్‌ అంతా వచ్చేసిందనే భ్రమలో తల్లిదండ్రులు ఉండిపోతారు. తెలుగులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, వాటి ఒత్తులు మొత్తంగా సుమారు 15 వందలకు పైగా అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒక్కసారి అక్షరాలను నేర్చుకుంటే ఏ వాక్యాలనైనా, ఏ కావ్యాలనైనా సులభంగా చదివేయొచ్చు. కానీ ఆంగ్ల భాష అలాకాదు.. జీవితాంతం ప్రతి పదానికీ కొత్తగా ఉచ్చారణ, రాసే విధానం నేర్చుకుంటూ పోవాల్సిందే.
పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టే తెలుగు బాగానే వస్తుందనే భ్రమలో మనం ఉండిపోయాం. తల్లిదండ్రులు రోజూ పిల్లలతో కొద్దిసేపు తెలుగు కథలను చెప్పడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలను, మన సాహిత్య ఇతిహాసాలు వంటివి పిల్లలకు సులభంగా చేరతాయి. పిల్లలు కథలను చదవడం ద్వారా వారి మీద వికాసం చాలా బాగుంటుంది. మాతృభాషలో కథలను చదువుతున్నప్పుడు అవి వారి మనసుల్లో దృశ్య రూపంలోకి సులభంగా మారుతూంటాయి. అవి అలా గుర్తుండిపోతాయి. అందువల్ల పిల్లల్లో సృజనాత్మకత మెరుగుపడుతుంది. కథలను టీవీలోనూ యూట్యూబ్‌ ఛానల్‌లోనూ చూస్తున్నప్పటి కంటే చదువుతూ ఉన్నప్పుడు పిల్లలే దృశ్యకరణ చేసుకోగలరు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి.

ప్రస్తుతానికి సురక్షితం..
ప్రస్తుతానికి తెలుగు భాష యునెస్కో లెక్కల ప్రకారం 65 సురక్షిత భాషలలో ఒకటిగా ఉంది. మన దేశంలో గానీ మన రాష్ట్రంలో గానీ ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులను పరిశీలిస్తే.. వారికి బోధించే ఉపాధ్యాయులు కేవలం పాఠాన్ని చెప్పడానికి సాంకేతిక పదాలు మాత్రమే ఆంగ్ల భాషలో ఉపయోగిసూ,్త మిగిలినదంతా మాతృభాషలోనే చెప్తారు. బోధించే వారికి కూడా ఆ భాషలో సరైన భావ ప్రసారం ఉండదు. ఏది ఏమైనప్పటికీ కాస్తో కూస్తో సినిమా పరిశ్రమల వాళ్ళు మాతృభాషలో సినిమాలు తీసి సేవ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లు కూడా ఆంగ్ల మాధ్యమంలో సినిమాలు తీయడం మొదలుపెడితే మన భాష పరిస్థితి ఇక అంతే. కేవలం మాట్లాడే వాళ్ళు ఉంటే భాష బతికేస్తుంది అనే మాట తప్పు. ఆ భాషలో రచనలు రావాలి. వాటిని చదివే వాళ్ళు ఉండాలి. ఈ తరంలో సొంతంగా ఐదారు వాక్యాలు కూడా తెలుగులో సరిగా రాయలేని వాళ్ళు గణనీయమైన శాతంలో ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మాతృభాషలో చదువుని ప్రారంభించిన విద్యార్థి ఒత్తిడిని సులభంగా అధిగమించగలడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వారి వారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి, వారు రాజకీయ కిరీటాలు ధరించడానికి, వాళ్లు ప్రజలలోకి చొచ్చుకుపోవడానికి చేసింది వారికి మాతృభాషలో ఉన్న పట్టు మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తించాలి.


పరిరక్షణ కోసం..
1. ప్రాథమిక స్థాయి వరకైనా తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కచ్చితంగా అమలుపరచాలి.
2. జీవోలు తెలుగులో ఇవ్వడం, తీర్పులు తెలుగులో ఇవ్వడం మాతృభాషను పరిరక్షించినట్టు కాదు.
3. పాఠశాల కేంద్రంగా మాతృభాషను, మాతృభాషలో బోధనను సమర్థవంతంగా నిర్వహించాలి.
4. మాతృభాషలో మాట్లాడడం ఎంతో గర్వకారణం అనే విషయాన్ని ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ కలిగించాలి.
5. తెలుగు నాట ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు మాతృభాషకి సంబంధించిన కార్యక్రమాలను నెలనెలా నిర్వహించాలి.
6. శాస్త్ర, సాంకేతిక గ్రంథాలను మాతృభాషలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వాలు గ్రాంట్లు కేటాయించాలి.
7. మాతృభాషలో చదివేవాళ్ళకి ఉద్యోగాల్లో ఎంతో కొంత రిజర్వేషన్‌ ఉండే అవకాశం చూడాలి.
8. మాతృభాషలోనే చదువుకుంటూ ప్రపంచంలో అపారమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశాల విజయగాథలను ప్రజలకు, విద్యార్థులకు తెలియజేయాలి.
9. ఇవాళ మీడియా రంగంలోనూ, అనువాదంలోనూ మాతృభాషకి అపారమైన అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేయాలి.
10. మన వారసత్వ సంపదగా వస్తున్న మాతృభాష వ్యాకరణం, ఉచ్చారణ, సాహిత్య సంపద, సంస్కృతిని కోల్పోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది.
11. మాతృభాషను కేవలం భాషగా నేర్చుకోవడం అనే విధానానికి స్వస్తి చెప్పాలి. మాతృభాషను నేర్చుకోవడం మన జీవనవిధానంగా తెలియజేయాలి.
12. ఉన్నత పాఠశాల …లోపు విద్యార్థులకు కనీసం వంద పద్యాలు నేర్పించగలిగితే, వారిలో మాతృభాష పట్ల ప్రేమతో పాటు ధారణాశక్తి పెరగడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైతికంగా కూడా నిలబెడుతుంది.


ముగింపు..
‘తల్లిపాలు తాగి పెరిగినవాడికి, దాది పాలు తాగి పెరిగినవాడికి ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విషయం నేర్చుకున్నవాడికీ పరభాషలో నేర్చుకున్నవాడికీ అంతే తేడా ఉంటుంది!’ అంటారు కొమర్రాజు లక్ష్మణరావు. శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది, ఆత్మ వికాసాన్ని కలిగించి, జాతి అభివృద్ధికి, దేశ అభ్యుదయానికి, లోకానికి మేలు చేయడానికి ఒక వ్యక్తి సమర్థుడిగా తయారుకావాలంటే ఆ శక్తి మాతృభాషకే ఉంది. తమ భాషలో సాహిత్యాన్ని రాసి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంతోమంది కవులు ఇతర భాషలో తెలిసినప్పటికీ, ఆ భాషలో కవిత్వం రాయడానికి ప్రయత్నిస్తే వారు కనీసస్థాయిని కూడా అందుకోలేకపోయారు మాతృభాషలో ఆలోచించినంత స్వేచ్ఛగా పరాయిభాషలో ఆలోచించలేకపోవడం దీనికి కారణం. మాతృభాషలో చదవడం పసిపిల్లల హక్కు. యునెస్కో రిపోర్టు ప్రకారం ఏ భాష అయితే కనీసం 40 శాతం మంది మాతృభాషలో విద్యను నేర్చుకోలేకపోతారో, ఆ భాష కొన్ని సంవత్సరాలలోనే అంతమైపోతుంది. ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది.

మీకు తెలుసా ?
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 1999 ఫిబ్రవరి 21న ప్రకటించారు. ఇది 2000 ఫిబ్రవరి 21 నుండి జరుపుకుంటున్నారు. కానీ ఇది ఎందుకు ఆ రోజున నిర్ణయించారో మీకు తెలుసా? 1947లో ఇండియాకి, పాకిస్తాన్‌కి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పాకిస్తాన్‌ రెండు భాగాలుగా ఉండేది. ఇప్పుడు ఉన్న పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌, అలాగే తూర్పు పాకిస్తాన్‌, ఇప్పటి బంగ్లాదేశ్‌ అందులో భాగంగా ఉండేది. కానీ పాకిస్తాన్‌ రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా 1948లో ఉర్దూ ఒక్కటే అధికార భాషగా నిర్ణయించారు. బంగ్లాదేశ్‌లో బెంగాలీ అధికంగా మాట్లాడతారు. కాబట్టి బెంగాలీని కూడా అధికార భాషగా చేయాలని ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు సామాన్య ప్రజలతో కలిసి 1952, ఫిబ్రవరి 21న ఒక భారీ ర్యాలీని చేయగా, పోలీసులు ర్యాలీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఐదుగురు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. ఒక భాష కోసం జరిగిన ఈ ఉద్యమానికి గుర్తుగా ఫిబ్రవరి 21ని ఎన్నుకున్నారు.
గ్రాంథిక భాషను వ్యతిరేకిస్తూ వ్యవహారిక భాష ఉద్యమాన్ని ముందుకు నడిపి, తన జీవితాన్ని తెలుగుభాషకి అంకితం చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఆగస్టు 29ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. ఈయన కృషి వల్లనే నేడు పత్రికలు, పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. యూనెస్కో వరల్డ్‌ అట్లాస్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ ప్రకారం ధ్రువీకరించబడిన భాషలు 8,324 ఉండగా, ప్రస్తుతం సుమారు 7000 భాషలు ఉన్నాయి.

మానవుడు శైశవావస్థ నుంచి, తన హావభావాలను, క్రోధానురాగాలను, ఆలోచనలను, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తంచేస్తాడో ఆ భాషే మాతృభాష.
– గొడవర్తి సూర్యనారాయణ

శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష!
– గాంధీజీ

పరభాష ద్వారా బోధన అంటే సోపానములు లేని సౌధం వంటిది.
– ఠాగూర్‌

తల్లిపాలు తాగి పెరిగినవాడికీ దాది పాలు తాగి పెరిగినవాడికీి ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విషయం నేర్చుకొన్నవాడికీ పరభాషలో నేర్చుకొన్నవాడికీ అంతే తేడా ఉంటుంది.

  • – కొమర్రాజు లక్ష్మణరావు

– డాక్టర్‌ సుంకర గోపాలయ్య, 9492638547
దోర్నాదుల సిద్ధార్థ, 9492374787

➡️