అమ్మమీద బెంగ

May 19,2024 11:42 #Sneha

ఇరవైమాసాల పాప
నింటివద్ద వదిలిపెట్టి
పట్టా స్వీకారమునకు
పట్టణమెళ్లింది అమ్మ!!

నాన్న, తాత, నానమ్మలు
వున్నారుగ ఇంటి వద్ద!
పాపను కడు భద్రంగా
కాపాడెద రనుకున్నది!!

నాన్న నొదలదాయె పాప
అన్ని పనులు నాన్నెచేసె!
అయినగాని మధ్య మధ్య
అమ్మకోస మేడ్చె పాప!

అమ్మ మీద వున్న బెంగ
నెమ్మదిగా పాదోల
మాయమాట లెన్నొ చెప్పి
మాయ బుచ్చితిరి పాపను!

నాన్న ఎదుట లేనప్పుడు
‘నాన్నలేడు, అమ్మలేదు’
అనెను పాప దీనంగా
మనసుకలత చెందంగా!

అయిదు రోజులైన పిదప
‘అమ్మ’వచ్చినది ఇంటికి!
అమ్మను చూడంగానే
ఆనందమాయె పాపకు!

చెకచెక అమ్మదరికెళ్లి
పకపక నవ్వింది పాప!
వెనువెంటనె చిత్రంగా
వెక్కివెక్కి ఏడ్చెపాప!

అలాఅలా కొంతసేపు
ఆపకుండ ఏడ్చెపాప!
ఆ ఏడ్పుకు అర్థమేమి?
అమ్మ మీద బెంగగాదె!

– అలపర్తి వెంకటసుబ్బారావు
9440805001

➡️