‘మా ఇంట్లో ఇవాళ వాటర్ రాలేదు. స్నానాలు, పనీ, వంటా అన్నీ లేటైపోయి, బుర్ర పిచ్చెక్కింది.’ జాహ్నవి లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ అన్నది.
అది సబ్ కలెక్టర్ కార్యాలయం. మధ్యాహ్నం ఒంటి గంట. లంచ్ రూం సందడిగా ఉంది.
జాహ్నవి చెబుతోంది.. ‘పిల్లల స్కూల్ టైం కూడా మించిపోయింది. పాపం ఏం పనిష్ చేశారో?’
‘నీకేమ్మా? ఎన్ని ఇబ్బందులున్నా మీ వారు హెల్ప్ చేస్తారు’ అంది భారతి.
‘ఏంటీ? మా వారా? హెల్ప్ చేస్తారు. కానీ ఆయన పని చేస్తే నాకు డబుల్ పనే. తనకు పనిచెప్పడం కంటే నేను చేసుకోవడం ఉత్తమం’ చిరుకోపంతో బదులిచ్చింది జాహ్నవి.
‘మా వారూ అంతే! వంట చేశారంటే కిచెన్ అంతా పెంటవుతుంది. సర్దేసరికి నాకు తల ప్రాణం తోకకు వస్తుంది.’ అని ఒకరు; ‘మరి నేను మొన్న రెండు రోజులు ఊళ్లో లేను కదా. ఇంటికి వచ్చాక చూడాలి మా ఇల్లు! సర్దుకోడానికి నాకు మూడు రోజులు పట్టింది’ అంటూ మరొకరు.. భర్తల ఘన కార్యాల గురించి వారి వారి అనుభవాలు చెప్పుకొని నవ్వుకుంటున్నారు.
పక్కనే లంచ్ చేస్తున్న దామోదరం ‘మేడమ్.. ఎందుకండీ, మా మీద కోపాలు ప్రదర్శిస్తారు? పని వచ్చినా రాకున్నా మీరు చెబితే మాకు తప్పుతుందా?’ అంటూ నవ్వాడు.
‘అరే.. మీరేమీ మాట్లాడరేమండీ, అనుపమ గారూ..’ వారం కిందట బదిలీపై వచ్చిన అనుపమను అడిగింది భారతి.
‘మా వారు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండీ’ చెప్పింది అనుపమ.
ఆ మాట విని మిగతా వారి గుండె జల్లుమంది.
‘అంటే మావారు చెయ్యరని కాదండీ.. మా ఆయనా చేస్తారు. కాకపోతే వెనుక అన్నీ సర్దుకోవాలి. మగవారికి పని రాదు కదాండీ!’ భుజాలు తడుముకున్నట్టుగా అంది జాహ్నవి.
‘మావారు అది రాదు.. ఇది రాదు..’ అని చెప్పరండీ. ఏ పని చేసినా నీట్‌గా చేస్తారు. నాకు బెంగ ఉండదు. బాధ్యత అనేది ఒకటి మనసు మీద ఉంటే అన్నిపనులూ అందరూ సవ్యంగా చేయగలరు’ మళ్లీ సూటిగా చెప్పింది అనుపమ.
అందరిలోనూ మళ్లీ అలజడి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘అంటే మా వారికి బాధ్యత లేదనా? ఏమంటోంది ఈమె’ అని కొందరు చిన్నపాటి కలవరపాటుకు లోనయ్యారు. కొద్దిసేపు గదంతా నిశ్శబ్దం.
అనుపమ తినడం పూర్తి చేసి, బాక్సు పట్టుకొని బయటకు వెళ్లగానే.. అందరూ నోరు విప్పారు.
‘అదేంటీ.. మనమేదో సరదాగా మాట్లాడితే.. ఏకంగా మన భర్తలంతా చెడ్డవారన్నట్టు, ఆమెకే బంగారం లాంటి భర్త ఉన్నట్టు టకీటకీమని మాట్లాడేసింది..’ అనుకుంటూ ఆ టాపిక్కు పైనే చాలాసేపు మాట్లాడుకున్నారు.
తర్వాతి రోజు ..
లంచ్ రూంలోకి అందరూ చేరుకున్నారు.
‘ఏమండీ మీదేమి కూర? మీవారే చేశారా? అన్నీ మీవారే చేస్తారన్నారుగా?’ అనుపమను అడిగింది జాహ్నవి.
అనుపమ లంచ్ బాక్స్ తెరిచింది. అందులో పెరుగన్నం ఉంది.
‘ఇదేమిటండీ.. పెరుగన్నం తెచ్చుకున్నారు? మీవారు వంట చేయలేదా?’ అంది భారతి నవ్వుతూ.
మిగతావాళ్లు ముసిముసి నవ్వులు నవ్వారు.. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ.. వారి వ్యంగ్యాస్త్రాలు అర్థమవుతున్నా.. ఏమీ అర్థం కానట్టు తాపీగా చెప్పింది అనుపమ.
‘నాకు కడుపులో కాస్త బాగోలేదు మేడం. అందుకే ఇలా..’ అంటూనే త్వరత్వరగా తినడం పూర్తి చేసి, ‘వెళ్తానండీ, నాకు కొంచెం పని పెండింగ్‌లో ఉంది’ అని చెప్పి, అక్కడి నుంచి వెళ్లింది.
ఆమె వెళ్లగానే…
‘కనీసం బట్టలైనా ఉతుక్కుంటుందో లేదో.. అన్నీ మొగుడి చేతే చేయిస్తుందేమో! మెత్తగా కనబడుతుందిగానీ మహా గడుసుపిండంలా ఉంది.’ అన్నది భారతి.
‘మనకేం తెలుసండీ. అయినా ఇద్దరూ కలిసి పనిచేసుకుంటే హ్యాపీనే కదా!’ అన్నది మంజుల.
‘అనుపమ పక్క సీటు కదా! అప్పుడే వెనకేసుకొచ్చేస్తుంది’ భార్గవి టపీమని అనేసింది.
‘అలా నిందలు వేయకండి తల్లీ’ అంది మంజుల నవ్వేస్తూ.
‘అది కాదండీ.. మనం ఇంటా బయటా పనిచేసి ఎంతగా అలసిపోతాం. అలాగని భర్త చేత అన్నిపనులూ చేయిస్తామా? ఒకవేళ చెయ్యమంటే మాత్రం వాళ్లు చేస్తారా? అది ఇలాంటి గడుసుపిండాలకే సాధ్యం. మనలాంటోళ్లకి కాదు..’ మళ్లీ భారతినే అంది.
‘ఏమో బాబూ! మా వారు ఇటుంచిన పుల్ల అటు వేయరు. నేను ఎంత లేవలేకపోయినా.. కాళ్లు ఈడ్చుకుంటూ నేనే పనిచేస్తా కానీ ఆయనకు చెప్పను.’ అంది మరో ఆమె.
‘ఆమె అదృష్ట జాతకురాలు’ అక్కడ లేని అనుపమను ఉద్దేశిస్తూ మళ్లీ వ్యంగ్యంగా అంది జాహ్నవి.
అప్పుడే అటెండరు అప్పలస్వామి సర్క్యులర్ పట్టుకొని అక్కడికి వచ్చాడు.
‘వచ్చేవారం మహిళా దినోత్సవం కదా! ఆ నోటీసే మోసుకొచ్చాడు. ఇందాక మేనేజరు ఛాంబర్లో ప్రిపేరు చేయటం చూశాను..’ భార్గవి చెబుతూనే సర్క్యులర్‌ని అందుకొని చదివింది : ‘రేపు ఉదయం 11 గంటల నుంచి మహిళా సాధికారతపై డిబేట్ కమ్ మీటింగ్ ఉంది. అందరూ రావాలి’ అని.
అందరూ నవ్వుతూ సంతకాలు చేశారు. ప్రతి ఏటా ముందుగా వివిధ ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు జరుగుతాయి. దినోత్సవం రోజు బహుమతి ప్రదానం ఉంటుంది. అలాగే సబ్ కలెక్టరేట్ పరిధిలోని కొంతమంది మహిళా ఉద్యోగులకు సాధికారిత అవార్డులు కూడా ఇస్తారు.
మర్నాడు డిబెట్‌లో కొంతమంది సిబ్బంది మాట్లాడారు. అనుపమ పేరు పిలవడంతో వేదిక ఎక్కి, మాట్లాడటం మొదలుపెట్టింది.
‘మహిళా సాధికారత ఒకరు ఇస్తే పుచ్చుకునేది కాదు. అలాగని ఒక్కరు మాత్రమే సాధించగలిగేదీ కాదు. స్త్రీ-పురుష సమానత్వం సాధ్యమైన నాడే మహిళా సాధికారత సాకారమవుతుంది. ఇంటా బయటా ఆడా మగా అంతా సమానమనే భావనతో, బాధ్యతతో ఉన్నప్పుడు సమాజం నిజంగా వికసిస్తుంది..’ ఉపన్యాసం సాగుతోంది.
‘వాళ్లింట్లో ఈమెదేగా సాధికారత! అందుకే ఎన్నయినా చెబుతుంది’ అనుకున్నారు జాహ్నవి, భారతి.
అనుపమ మాట్లాడుతుండగానే ఆమె ఫోన్ రెండుసార్లు మోగింది. తీసుకొని చూడమని అనుపమ సైగ చేయడంతో- మంజుల స్టేజ్ దగ్గరకు వచ్చి ఆ ఫోన్ అందుకొని లిఫ్ట్ చేసింది.
‘హలో..’ అంటూ మాట్లాడుతున్న మంజుల ముఖకవళికలు చూసిన అనుపమ ఉపన్యాసం ముగించింది. స్టేజ్‌పై నుంచి గబగబా దిగేసింది. ఏం జరిగిందో మంజుల చెప్పేలోపే ఫోన్ అందుకొని, రివర్స్ కాల్ చేసి మాట్లాడుతూ బ్యాగ్ అందుకుంది. బలహీనంగా అడుగులు వేస్తూ ఆఫీసు బయటకు వచ్చింది. అనుపమ ఏమీ మాట్లాడే స్థితిలో లేదని గమనించి అందరూ మంజులని చుట్టుముట్టి, ఏం జరిగిందని అడిగారు.
‘ఎవరో కాలుజారి పడిపోయారని’ వాళ్ల తమ్ముడు ఫోన్ చేశాడు. ఎవరని అడిగేలోగా కాల్ కట్ అయింది..!’ చెప్పింది మంజుల.
అనుపమ ముఖంలో ఆందోళన.. ఏదో ఆవేదన ఆమెను అతలాకుతలం చేస్తోంది. ఏం జరిగిందో అడిగినా ఆమె సమాధానం చెప్పే స్థితిలో లేదు.
‘పదండి మనమూ వెళ్దాం.’ అంటూ మహిళా సిబ్బంది సిద్ధమయ్యారు.
‘ఆగండి అనూ.. అసలు ఏమైంది? ఎందుకీ ఆందోళన మేమూ వస్తాం.’ అంటూ భార్గవి, మంజుల, జాహ్నవి, మరో ఇద్దరు ఆమె వెంటే బయలుదేరారు. వారితో పాటు కొలీగ్స్ దామోదరం, కిరణ్ కూడా బయల్దేరారు.
ఆమె ఇంట్లో అడుగు పెట్టగానే నిర్ఘాంతపోయారు. ఒక కాలు, చేయి చచ్చుబడిపోయి లేవలేని స్థితిలో ఉన్న పదేళ్ల్ల బాబు ఏడుస్తున్నాడు. తనే బాత్‌రూంలో పడిపోయాడు. కాల్ చేసింది అనుపమ తమ్ముడు అరవింద్.
బాబు మంచం దగ్గర చతికిలబడింది అనుపమ. బాబును తనవైపు తిప్పుకొని ఒడిలోకి తీసుకుంది. ‘ఏం నాన్నా.. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది కదా, ఏడవకు’ అంటూ బిడ్డను గుండెలకు హత్తుకుని ఊరడిస్తోంది.
‘అక్కా, కంగారు వద్దు. డాక్టరు గారు వచ్చి వెళ్లారు. ఏం ఫర్వాలేదన్నారు. కాకపోతే బాబుకు కాలు చీరుకొని కొద్దిగా బ్లడ్ వచ్చింది. కట్టు వేశారు’
తమ్ముడు వివరాలు చెబుతున్నాడు.
అవతలి గదిలో ఒకామె మంచం మీద ఉన్నారు. ఉన్నచోటికి అందిస్తే తప్ప ఏదీ తినలేని పరిస్థితి ఆమెది!
‘బాబుకి ఏమైందని వంద సార్లు అడిగాను అనూ.. వాడు ఏదీ సరిగ్గా చెప్పటం లేదు..నువ్వైనా చెప్పు’ అని అంటూ ఆమె ఏడుస్తోంది.
‘ఏం కాలేదు అమ్మా. నా బంగారు కొండకు ఏమౌతుంది? ఏమీ కాదు కదా..’ అంటూ బాబు వైపు చూసి కన్నీరు పెట్టుకుంది అనుపమ. తమ్ముడికి సైగ చేయడంతో అతడు వెళ్లి ఆమెకు ఏదో చెప్పి ఊరడించాడు.
ఈ దృశ్యం చూసిన భారతి, జాహ్నవిలకు తల తిరిగిపోయింది. కన్నీళ్లు, పశ్చాత్తాపం తన్నుకు వచ్చాయి.
కొద్దిసేపటి తర్వాత తేరుకున్న అనుపమ బాబుకు వేయాల్సిన మందులు వేసి, బట్టలు మార్చి పౌడర్ అద్దింది. డాక్టరుకు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంది. డాక్టరు ఏం ఫర్వాలేదు అనడంతో ఊరట చెందింది.
తర్వాత కొలీగ్స్‌కి కాఫీ పెట్టి ఇచ్చింది.
‘వద్దండీ.. మనసేమీ బాగోలేదు’ చెప్పింది జాహ్నవి.
‘ఫర్వాలేదు.. తీసుకోండి..’ అని చెబుతూనే, ‘అమ్మను పరిచయం చేస్తాను.. రండి.’ అని వారిని లోపలికి తీసుకెళ్లింది అనుపమ.
‘అమ్మ పేరు అనసూయ’ అని చెప్పి, తన కొలీగ్స్‌ని పేరుపేరునా ఆమెకు పరిచయం చేసింది.
అందరూ దు:ఖం నిండిన మనసుతో ఆమెకు నమస్తే చెప్పారు. కూర్చోమన్నట్లు ఆమె సైగ చేస్తే, కుర్చీల్లో కూర్చున్నారు.
వెల్లకిలా పడుకున్న అనసూయ కళ్లల్లోని కన్నీటి ధార ఎవ్వరికీ కనిపించకుండా నిశ్శబ్దంగా కనుకొనల నుంచి జారుకుంటోంది. మరోవైపు అనుమప – బాబుకు దెబ్బ తగిలిన బాధను దిగమింగి, తోటి ఉద్యోగుల జాలి చూపులు అమ్మకు, తమ్ముడికి కనిపించనివ్వకుండా హడావుడిగా తిరుగుతూ తన చిరునవ్వును అడ్డు తెరగా వేస్తోంది.
‘ఆఫీసులో మీ లంచ్ బాక్స్, ఫైల్స్ అన్నీ మేం సర్దిపెడతాం. మీరిప్పుడు రావొద్దు అనూ. మేనేజర్ గారికి చెబుతాములే. రేపు లంచ్ బాక్సు తెచ్చుకోకండి. నేను తెస్తాను..’ స్నేహపూర్వకంగా చెప్పింది భార్గవి.
వారిని వీధి వరకు దింపి రమ్మని తమ్ముడు అరవింద్‌కు పురమాయించింది అనుపమ. బయటకు వచ్చినవారు అతడిని అనుపమకు సంబంధించిన వివరాలు అడిగారు.
‘అక్క బాగా చదివేది. మంచి జాబ్ కూడా వచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరింది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే అన్నీ అయ్యి మమ్మల్ని పెంచింది. తను కూడా ఈ మధ్యే చనిపోయింది. ఇక మాకు మిగిలింది మా అక్కయ్య అత్త గారు అనసూయమ్మ. ఆమె ఆ మంచంలోనే ఉంటున్నారు. అక్కకు ఆ బాబు ఒక్కడే కొడుకు. ఫస్ట్‌లో బాగానే ఉన్నాడు. ఈ మధ్యే ఒక కాలు, చేయికి రక్త ప్రసరణ ఆగిపోయి చచ్చుబడ్డాయి.’ చెబుతూ ఉన్నాడు.. అరవింద్.
‘ఆమె మీ అమ్మగారు కాదా. మీ అక్క అత్తగారా? ‘ అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.
‘మరి మీ బావగారూ..?’ అని అడిగింది భార్గవి.
చెప్పటానికి కాస్త తటపటాయించాడు అరవింద్. తరువాత చెప్పాడు : ‘అతడు అస్సలు మంచోడు కాదు. అక్కను లవ్ మ్యారేజీ చేసుకున్నాడు. వాళ్ల కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఉన్న ఉద్యోగాన్ని సైతం వదిలి, అక్క హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేసింది. పట్టుమని ఏడాదైనా అక్కతో సరిగ్గా లేడు. తాగుడు, తిరుగుడు.. ఇంటికి వచ్చి అక్కను బాధించేవాడు. అడ్డు చెప్పబోతే వాళ్లమ్మను, నాన్నను కూడా కొట్టేవాడు. చాలా గొడవలు జరిగాయి. రెండేళ్ల క్రితం అక్కతో పూర్తిగా తెగతెంపులు చేసుకొని, అతడి తల్లిదండ్రులను కూడా వదిలేసి వెళ్లిపోయాడు. అతడి తల్లిదండ్రులనూ అక్కే చూస్తోంది. ఈ మధ్యే మామ గారు చనిపోగా, అత్తగారు మంచం పట్టారు .. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడు రాలేదు’
ఆ మాటలు విని, నిర్ఘాంతపోయారు వారంతా. ‘అనుపమ జీవితంలో ఇంత విషాదం ఉందా?’ అనుకున్నారు.
‘మరి బాబును మంచి డాక్టరుకు..’ దామోదరం అడగబోయాడు.
‘చూపించాం సార్. మంచి వైద్యం, బలమైన ఆహారం అందిస్తే తప్పక కోలుకుంటాడని డాక్టరు చెప్పారు. అక్క ఆ ఆశతోనే బతుకుతోంది. కేరళలో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉందని తెలిసింది. డాక్టరు సలహా మేరకు అక్కడకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాం..’ అని చెప్పాడు అరవింద్.
మర్నాడు లంచ్ రూంలో ఎవరూ లంచ్ బాక్సులు ఓపెన్ చెయ్యలేదు. అనుపమ కోసం ఎదురుచూస్తున్నారు. అనుపమ కామ్‌గా లంచ్ బాక్స్‌్‌తో వచ్చింది.
కుశల ప్రశ్నలు అయ్యాక.. బాక్స్ ఓపెన్ చేసి తినబోతోంది.
‘నేను బాక్స్ తెస్తానన్నాను కదా! తెచ్చాను.. తిను అనుపమా. ప్లీజ్ .. కాదనకు..’ అంది భార్గవి.
‘అనుపమా.. సారీ! నిన్ను ఇన్ని రోజులూ తప్పుగా అర్థంచేసుకున్నాం..’ అంది జాహ్నవి.
‘ఏకవచన ప్రయోగం చేస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఇప్పుడు నువ్వు మాకు కొలీగ్‌వి కాదు; ఒక సోదరివి, మేం నీకు సొంత అక్కల మాదిరే. ఇది జాలి అనుకోకు ప్రేమ!’ అంది భార్గవి ఆప్యాయంగా.
‘ఇన్ని రోజులూ అలా చెప్పావెందుకు? మీ భర్త ఉన్నట్టు, నీకు లోటు లేనట్టు.. మాకు ఇబ్బందులు చెబితే తప్పేముంది? మేం పరాయివారమా?’ అన్నారు అంతా.
నవ్వింది అనుపమ.
‘ఆరోజు చర్చ నాకు నచ్చక అలా చెప్పాను. క్షమించండి.. ఇక నా ఇబ్బందులు.. ఒకరికి చెప్పుకున్నంత మాత్రాన తీరిపోతాయా? ఎవరి బాధలు వారికుంటాయి. అందుకే అలా.. బాబుకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. పూర్తిగా నయం కాలేదు. ఫిజియోథెరఫీ చేయిస్తున్నాం. ఈ మధ్య కాస్త బాగున్నాడు అనుకునేలోగా మళ్లీ కాలికి గాయం. రాత్రంతా నిద్ర పోలేదు. బాగా ఏడ్చాడు. వాడిని నేను బాగా చూసుకోవాలి. బాబు తనంతట తాను లేచి హాయిగా తిరగగలిగితే అంతే చాలు. అంతకంటే నాకు ఏమీ ఆశలు లేవు.!’ అని చాలా సంగతులు చెప్పింది బాధగా
‘ఏం ఫర్వాలేదు అనుపమా.. ఆ రోజు త్వరలోనే వస్తుంది. కేరళ వెళ్దామనుకుంటున్నారట కదా. వెళ్లండి. తప్పక కోలుకుంటాడు.’ అన్నారు మంజుల, భార్గవి
‘మీ భర్త విషయంలో మా ఎత్తిపొడుపులకు మేం సిగ్గుపడుతున్నాం. సారీ.. అనుపమా..!’ అంది జాహ్నవి.
‘ఇట్స్ ఒకే అండీ. అవేమంత పెద్ద విషయాలని..’ అంది అనుపమ.
ఈ ఏడాది సబ్ కలెక్టరేట్ పరిధిలో మహిళా సాధికారతా అవార్డును అనుపమకు కూడా ఇవ్వాలన్న మహిళల విజ్ఞప్తికి మేనేజర్ అంగీకరించారు. విషయం అనుపమకు తెలిసింది. వెంటనే మేనేజర్ రూంకి వెళ్లింది.
‘అలాంటివేమీ వద్దు సర్.. నాకు ఏ అవార్డులూ వొద్దు. వాళ్లు నా బాబుకు బాగోలేకపోవడం చూసి జాలితో సిఫార్సు చేసినట్టున్నారు. నాకు వద్దండీ. దయచేసి సీనియర్ ఎంప్లాయీస్‌కి ఆ అవార్డు ఇవ్వండి!’ అని స్పష్టంగా చెప్పింది అనుపమ.
బయటకు వచ్చిన అనుపమ చుట్టూ మహిళలు, పురుష సిబ్బంది అంతా చేరారు.
‘ఎందుకు వద్దన్నావు అనుపమా? నిజానికి అవార్డు పొందే అర్హత నీకు ఉంది.. ఆఫీసులోనూ, ఇంట్లోనూ సమర్ధతతో, సాధికారతతో పనులు చక్కబెడతావు… ‘ అంటూ జాహ్నవి ఏదో చెప్పబోయింది.
‘చూడండి ఫ్రెండ్స్. నాకెలా ఆ అర్హత సడన్‌గా వచ్చి పడింది? అవార్డుల వల్ల మహిళలకు గౌరవం అమాంతం పెరగదు, సాధికారతా రాదు. అసలు ఈ విషయంలో నా అభిప్రాయాలు పూర్తిగా వేరు. ‘సాధికరత అనేది ఒకళ్లు ఇస్తే పుచ్చుకునేది కాదు. మనకు మనంగా సాధించాలి. చిన్న చిన్న విషయాల్లోనే మనం అవగాహనా రాహిత్యంతో ప్రవరిస్తున్నాం. జాబ్ హోల్డర్స్ అయ్యుండీ కుటుంబాల్లో సమాన పని విధానాన్ని ఆచరించలేకపోతున్నాం. మన చర్చల్లో అది నాకు కనిపించింది. పనిచేయని మగవారి సంగతి సరే.. కనీసం సహకరించే వారితోనైనా పని చేయించుకోగల సన్నద్ధత మనకు ఉందా? హక్కులు కావాలని అడిగేముందు వాటిని అందుకొని, ఆచరించే చైతన్యం ఉండాలి కదా! తోటి మహిళకు భర్త సాయం చేస్తే, మనమే ఆ భార్యాభర్తలిద్దర్నీ అంత ఎగతాళిగా మాట్లాడితే మనం ఏం ముందడుగు వేయగలం? మన పిల్లలకు సమానత్వం ఎలా నేర్పగలం?’ అంది.
‘వయసులో చిన్నవారే అయినా బాగా చెప్పారు మేడమ్..’ అంటూ ముందుకొచ్చాడు దామోదరం.
‘అసలు ఇంటిపని, వంటపని విషయంలో హెల్ప్ అనే మాట కూడా సరైంది కాదని నా అభిప్రాయం’ అన్నాడు ఉద్యోగి కిరణ్.
‘ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. మనం ”సాయం” అనే భావనను వదిలించుకోనంత కాలం బాగుపడలేం. ఇంటిపనిలో మగవారు చేసేది సాయం కాదు. అది వారి బాధ్యత, ఇంకా ఇంట్లోని అందరి బాధ్యతా కావాలి. ఆ విషయం పిల్లలు, భర్త గుర్తెరిగేలా మనం చైతన్యంతో మెలగాలి’ అంది అనుపమ.
‘భర్త ఇటు ఉన్న పుల్ల అటు వేయకపోవడాన్ని ఒక రోగంగా కాక, గొప్పగా, గారాంగా మాట్లాడుకునే రోజులు పోకపోతే మన గతి ఇలానే ఉంటుంది. ఆఫీసులో ఎంత వెలగబెట్టినా… ఇంట్లో అంట్లు తోముడు తప్పదు’ అంది మంజుల.
‘అయితే మాచేత అంట్లు తోమిస్తారా ఏంటి, మేడమ్?’ అన్నాడు కిరణ్ సరదాగా.
‘తోమిస్తారా ఏమిటి? తోమడం మీ బాధ్యత కదా!’ అంది జాహ్నవి.
‘మా ఇంట్లో మాత్రం అంతా సమానం. ఎందుకంటే ఎప్పుడూ ఆ బాధ్యత నాదే కదా మరి’ అత్యత్సాహంలో అసలు రహాస్యాన్ని బయటపెట్టాడు దామోదరం.
ఇక హాలంతా నవ్వులే నవ్వులు.
ఎల్ శాంతి
76800 86787