ఆకలి లేకున్నా తింటున్నారా?

May 26,2024 10:20 #arogyam, #Sneha

కొందరు ఆకలి వేసినా.. వేయకున్నా.. పొట్టలోకి ఒకదాని తర్వాత ఒకటి తోసేస్తూ ఉంటారు. అలా తినడం అనారోగ్యకర ఆహారపు అలవాటు అంటున్నారు పరిశోధకులు. ఇలా తినడం వల్ల అనేక అనర్థాలు కలిగే ప్రమాదం ఉంది. అయితే అలా తింటేనే వాళ్లు తృప్తి చెందుతుంటారు. చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇవన్నీ అనారోగ్యకర లక్షణాలే అంటున్నారు నిపుణులు. అసలు అలా ఎందుకనిపిస్తుందో.. కారణాలేమిటో.. ఇటీవల కొందరు పరిశోధకులు కొన్ని విషయాలు వెల్లడించారు.

కడుపు నిండినా రుచిగా ఉందని కొందరు తింటుంటారు. దీనివల్ల వాళ్లకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇది వాళ్లొక అనారోగ్యకర అహారపు అలవాటులో చిక్కుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు. ఈ అలవాటునే ‘హెడోనిక్‌ ఈటింగ్‌’ అని పిలుస్తారు. ఆకలిగా అనిపించకపోయినా కేవలం సంతోషం కోసం ఏదో ఒకటి తినడాన్నే ‘హెడోనిక్‌ ఈటింగ్‌’ అంటారని చెప్పారు. హెడోన్‌ అనే గ్రీకు పదం నుంచి ‘హెడోనిక్‌ ఈటింగ్‌’ అనే పేరు వచ్చింది. హెడోన్‌ అంటే ఆనందం/ ఆహ్లాదం.
ఆనందం కోసం తినడం తప్పు కాదు. కానీ అతిగా తినడం, వ్యసనంగా మార్చు కోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుర్కియేలో చేసిన ఒక అధ్యయనం హ్యుమన్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ అనే జర్నల్‌లో 2024, జనవరిలో ప్రచురితమైంది. ఇది ఒబెసిటీతో ఉన్న వయోజనుల్లో హెడోనిక్‌ హంగర్‌ గురించి విశ్లేషించింది. అధిక బరువున్న వారిలో హెడోనిక్‌ హంగర్‌ పెరగడంతో ఆత్మస్థైర్యం తగ్గి, ప్రతికూల భావాలు పెరిగినట్లు గుర్తించారు.

అంటే ఏంటి?
మనం తినే ఆహారం, తాగే పానీయాల నుంచి వచ్చే కేలొరీల శక్తితో మన శరీరం పనిచేస్తుంది. తీసుకున్న కేలొరీల కంటే ఎక్కువ కేలొరీలను ఖర్చు చేసినప్పుడు ఆకలిగా అనిపిస్తుంది. కడుపు ఖాళీ అయినప్పుడు పొట్టలో ఉండే హార్మోన్‌ వ్యవస్థ ఈ విషయాన్ని మెదడుకు చేరవేస్తుంది. అలా మనకు ఆకలి తెలుస్తుంది. దీన్ని సాధార ణంగా శరీరంలో కలిగే ‘ఆకలి / ఫిజికల్‌ హంగర్‌’ అని పిలుస్తారు. హెడోనిక్‌ హంగర్‌ లేదా హెడోనిక్‌ ఆకలి అంటే, మనకు ఆకలిగా లేనప్పటికీ కేవలం ఆనందం కోసమే ఏదైనా తినాలనే కోరిక కలగడం.
‘దాదాపు ప్రతి ఒక్కరికీ హెడోనిక్‌ ఈటింగ్‌ అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఆహారం చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది’ అని యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ అపటైట్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టబ్స్‌ అన్నారు. ఆనందమే కాకుండా భావోద్వేగాలు, ఒత్తిడి, అసౌకర్యం వంటి ఇతర అంశాలతో మన ఆహారపుటలవాట్లు ముడిపడి ఉంటాయని స్టబ్స్‌ అభిప్రాయపడ్డారు. అయితే వీరు ఆకుకూరలు, సలాడ్‌, మొలకలు తినరు.
‘మనకు సాధారణంగా కొవ్వులు, ఉప్పు, చక్కెర పాళ్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలే బాగా నచ్చుతాయి. ఎందుకంటే, అవి ఎక్కువ శక్తినిస్తాయి’ అని లివర్‌పూల్‌ యూనివర్సిటీ అపటైట్‌, ఒబెసిటీ రీసెర్చ్‌ గ్రూప్‌ పరిశోధకులు, లెక్చరర్‌, డాక్టర్‌ బేథమ్‌ మీడ్‌ అన్నారు. ‘ఈ ఆహారాలు అందించే శక్తి, వాటిని తినడం వల్ల పొందే ఆనందంతో వాటి పట్ల ఎక్కువ ఆకర్షితులమవుతాం. అయితే, మనకు ఈ భావన ఫిజికల్‌ హంగర్‌ వల్లా? లేక హెడోనిక్‌ హంగర్‌ వల్లా? అని చెప్పడం కష్టం’ అని ఆయన వివరించారు.

ఊబకాయం ముప్పు..
కొవ్వు, ఉప్పు, చక్కెర అధికపాళ్లలో ఉండే ఆహారాలు ఎక్కువగా అందుబాటులో ఉండటమూ హెడోనిక్‌ ఈటింగ్‌కు దారితీసే కారణాల్లో ఒకటి. హెడోనిక్‌ ఈటింగ్‌ అలవాటుతో అనారోగ్యకర ఆహారం తీసుకోవ డం వల్ల అధికబరువు ముప్పు పెరుగుతుం దని చెప్తున్నారు. ‘ఈ రోజుల్లో మనకు ఎక్కడ చూసినా చాలా రుచికరమైన, సులభంగా లభించే, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. ఇది బరువు పెరగడానికి అనుకూలం. భూమ్మీద ప్రస్తుతం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బందిపడుతున్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు’ అని స్టబ్స్‌ అన్నారు.

ఏం చేయాలి?
హెడోనిక్‌ ఈటింగ్‌ కారణంగా అతిగా తినడాన్ని తగ్గించుకోవడానికి ‘మనం బరువు తగ్గినప్పుడు హెడోనిక్‌ హంగర్‌ కూడా తగ్గుతుందని పరిశోధనలో తెలిసింది’ అని డాక్టర్‌ మీడ్‌ అన్నారు. ‘ప్రయత్నం మీద బరువు తగ్గినవారు అలాంటి ఆహారాలకు స్పందించే తీరులో మార్పు రావడం వల్ల ఇలా జరుగుతుండొచ్చు’ అని ఆయన చెప్పారు.
బరువు తగ్గడం, కొత్త ఆహార అలవాట్లు చేసుకోవడం, కొత్త ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంభించడం చాలామందికి అంత సులువు కాదు. కానీ, దీన్ని ఆనందకర అలవాటుగా మార్చుకోవడానికి ఒక మార్గం ఉందని ప్రొఫెసర్‌ స్టబ్స్‌ చెప్పారు. ‘ఉదాహరణకు మీరు శారీరక శ్రమను పెంచుకోవడంతో బరువు తగ్గించుకోవాలంటే ఏ పని చేస్తే మీకు ఎక్కువ ఆనందం కలుగుతుందో ఆలోచించుకోండి. జిమ్‌కు వెళ్లడం మీకు నచ్చుతుందా?/ స్నేహితులతో కలిసి వాకింగ్‌ చేయడం / డాన్స్‌ చేయడం వంటివి ఎంచుకోండి. మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని కలిగించే అంశాలేంటో తెలుసు కోవడం చాలా ముఖ్యం. వాటి ప్రకారం, కొత్త అలవాట్లు, కొత్త ఆరోగ్యకర జీవనాన్ని అల వాట్లు చేసుకోవచ్చు’ అని ఆయన చెప్పారు.
హెడోనిక్‌ ఈటింగ్‌ లేదా అతిగా తినడాన్ని నివారించడానికి ‘మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌’ ఒక మార్గం కావొచ్చు. ‘మేం ప్రజలకు ఉన్న హెడోనిక్‌ ఈటింగ్‌ అలవాటును ఆపాలని అనుకోవట్లేదు. కానీ, ఆ అలవాటును మరింత ఆరోగ్యకర ఆహారపు అలవాటుగా మార్చాలనుకుంటున్నాం’ అని స్టబ్స్‌ అన్నారు. రుచికరమైన ఆహారపదార్థాలు ఇచ్చే ఆనందాన్ని కోల్పోకుండా ఆరోగ్యకర ఆహారం తినడాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో ఆయన వివరించారు. ’80:20 లైఫ్‌ స్టయిల్‌కు మీరు మారొచ్చు. అంటే మీరు తక్కువ కేలోరీలు, పుష్కలంగా పోషకాలు ఉన్న ఆహారపదార్థాలను 80 శాతం తింటూ, 20 శాతం మీకు ఆనందాన్ని ఇచ్చే ఆహారపదార్థాలను తినాలి’ అని ఆయన సూచించారు.

➡️