అహంకారి

Dec 8,2024 14:59 #Arrogant, #Sneha

అది ఒక అందమైన సరస్సు. తామర పూలతో, జల పక్షులతో కళకళలాడుతోంది. తాబేళ్ళు, చేపలు నివసిస్తున్నాయి. అనేక జంతువుల దప్పికను తీర్చేది సరస్సు. కొలనుఒడ్డున ఏనుగు ఒకటి నివాసం ఏర్పర్చుకుంది. అది రోజు వచ్చి కొలనులో దాహం తీర్చుకునేది. పోతూపోతూ తన తొండంతో నీళ్లు చల్లుకునేది. నీటిలో అటు ఇటు పొర్లేది. దీనితో చేపలు, తాబేళ్ళు భయపడుతుండేవి. ఆ ప్రాంతంలో పక్షులకు, జంతువులకు నీటిని తాగడానికి లేకుండా కలుషితం చేసేది. దీని బాధను తొలగించుకోవాలని సమయం కోసం పక్షులు ఇతర జంతువులు ఎదురుచూశాయి.
అన్నీ నక్కను కలిసాయి. నక్క ఆలోచించి ఉపాయాన్ని చెప్పింది. వెంటనే పక్షులు, జంతువులు తాబేళ్ళను కలిశాయి. నక్క చెప్పిన ఉపాయాన్ని తాబేళ్లకు తెలిపాయి. అమలు చేయమని ప్రాధేయపడ్డాయి. ఆ మరుసటి రోజే ఏనుగు కొలనులోకి వచ్చింది. ఎప్పటిలాగానే నీటిని మురికిగా చేయడం మొదలు పెట్టింది. అప్పుడు తాబేళ్ళ గుంపు ఏనుగు కాళ్లుపట్టి లోపలికి లాగడం ప్రారంభించాయి. తన పొడవాటి తొండంతో తాబేళ్ళను పట్టడానికి లోపలికి వెళ్ళింది ఏనుగు.
నీటిలో తాబేళ్ళు దొరకలేదు. ఏనుగు కాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ కొరకడం మొదలుపెట్టాయి తాబేళ్ళు. ఏనుగు కాళ్ళకు రక్తం కారీ గాయాలయ్యాయి. ఆ బాధను తట్టుకోలేక సరస్సు నుంచి బయటికి వెళ్లిపోయింది. గాయాలనొప్పి వల్ల కొన్ని రోజులు సరస్సువైపుకు రాలేదు ఏనుగు.
కొన్ని రోజులకు గాయాలు మానాయి. మళ్లీ సరస్సుకు వెళ్ళలా?వద్దా? అని ఆలోచించింది.
నా బలం ముందు వాటి బలం ఎంత? చిన్న జీవులైన తాబేళ్ళకు భయపడి సరస్సుకు పోకపోవడమేమిటి? అని అనుకుంది. మనసులో తర్జనభర్జన పడింది. చివరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సరస్సు వద్దకు వచ్చింది. అక్కడ తాబేళ్ళు, పక్షులు ఇతర జంతువులు ఆనందంగా ఉండడం చూసింది. చూసి ఓర్వలేకపోయింది ఏనుగు.
ఎలాగైనా వీటి సంతోషాన్ని దూరం చేయాలని అనుకుంది. సరస్సు నుండి అన్నింటినీ వెళ్ళగొట్టాలని భావించింది. వెంటనే కోపంగా తొండంతో ఘీంకరించింది ఏనుగు. అనుకోని సంఘటనకు పక్షులు, జంతువులు భయపడిపోయాయి. ఆ శబ్దానికి నీటిలోని తాబేళ్ళు అలలు రేపాయి. తలలు నెక్కించి సై అంటే సై అన్నట్టుగా ఏనుగు వైపు చూసాయి. ఏనుగు తాబేళ్ళను చూసింది. నన్ను గాయాలపాలు చేసిన తాబేళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటన్నింటిని అంతం చేయాలని భావించింది. కోపంతో ఊగిపోతూ సరస్సులోకి అడుగు పెట్టింది. యధాప్రకారంగా తాబేళ్ళు అన్ని ఏనుగును చుట్టుముట్టాయి. కొరకడం మొదలుపెట్టాయి. ఏనుగు వాటి దాటికి తట్టుకోలేకపోయింది. తీవ్రంగా గాయపడింది. బతుకు జీవుడా అని బయటపడింది. సరస్సుకు దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏనుగు జాడ కనిపించలేదు.

జూటూరు తులసీదాస్‌
9848859954

➡️