వినియోగదారుడి హక్కు అడిగితేనే దక్కు

Mar 9,2025 09:39 #consumer, #rights, #Sneha

తమ అవసరాలను బట్టి ప్రతిఒక్కరూ మార్కెట్‌తో సంబంధం కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసి చాలీచాలని జీతంతో ఇంట్లోకి కావల్సిన వస్తువులను కొంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ప్రతిదీ కల్తీ, నాసిరకం వస్తువులు, తూకంలో మోసాలు, నకిలీ సరకుల అమ్మకాలు, ప్రకటనల హోరుతో మోసగించడం. వీటికి తోడు ఆన్‌లైన్‌ మోసాలు.. ఇలా లాభార్జనే లక్ష్యంగా వ్యాపారలావాదేవీలు జరుగుతున్నాయి. వీటి నుంచి ఎలా రక్షణ పొందాలి? ఎలాంటి మోసాలకు ఆస్కారం లేని వస్తు, సేవలను పొందడం కొనుగోలుదారుల హక్కు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కొనుగోలుదారుల మేలుకొలుపు కోసమే ఈ కథనం..

ఈ రోజుల్లో 4జి, 5జి టెక్నాలజీ నడుస్తున్న తరుణం. మనం ఏం తినాలో, ఏం తాగాలో, ఏవి ధరించాలో, ఏ కంపెనీ సేవలు వినియోగించుకోవాలో అనేది సాంకేతిక పరిజ్ఞానం దిశానిర్దేశం చేస్తోంది. ఆలోచన మాట ద్వారా వినబడగానే దానికి సంబంధించిన ప్రకటనలు అరచేతిలో వైకుంఠంలా దర్శనమిస్తున్నాయి. కంటికి కనిపించి మనల్ని శాసిస్తున్నాయి. వాటి మాయలో పడి మనం డబ్బు పోగొట్టుకోకుండా వస్తు, సేవల విషయంలో సరైనవి పొందడం వినియోగదారుల హక్కు.

హక్కులేంటి..?

ఇంతకీ వినియోగదారుల హక్కులేంటి..? అమ్మకపుదారు ఏదైనా నాసిరకం వస్తువును అమ్మిన సందర్భంలో సరైన ఫోరమ్‌ను ఆశ్రయించి, న్యాయం పొందటం. మోసపూరిత వాణిజ్యం కారణంగా నష్టపోతే పరిహారం కోరే హక్కు వినియోగదారులకి ఉంటుంది. కొన్న వస్తువుకు సంబంధించి సరైన అవగాహన పొందే హక్కు కూడా ఉంటుంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, మన్నికకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. సేవా లోపం జరిగితే బ్యాంకింగ్‌, వైద్య రంగం, విద్యుత్తు, రవాణా, బీమా తదితర సంస్థలపైనా కేసులు వేయవచ్చు.

మీరూ నష్టపోయారా..?

బిస్కెట్‌ ప్యాకెట్లో ఉండాల్సిన వాటికన్నా ఒక బిస్కెట్‌ తగ్గిందని తమిళనాడులో ఓ కొనుగోలుదారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దాంతో బిస్కెట్ల తయారీ కంపెనీకి ఆ కమిషన్‌ లక్ష రూపాయాల జరిమానా విధించింది. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారుడు సినిమా చూసేందుకు ఐనాక్స్‌ థియేటర్‌లో టిక్కెట్‌ కొన్నాడు. ఆ టిక్కెట్‌పై నిర్ణయించిన సమయానికి మించి ప్రకటనలు వేసి ఆలస్యంగా సినిమాను ప్రదర్శించడంతో అతను అసౌకర్యానికి గురై జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఆ కమిషన్‌ సదరు థియేటర్‌ యాజమాన్యాన్ని నిర్ణయించిన సమయానికే చిత్రాన్ని ప్రదర్శించాలని మందలించి, లక్ష రూపాయల జరిమానా విధించింది. పూనేకు చెందిన ఓ కస్టమర్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో సేవింగ్స్‌ ఖాతా ఉంది. ఖాతాదారులకు ప్రమాదబీమా చెల్లించేందుకు ఆ బ్యాంక్‌ ఓరియంటల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద అగ్రిమెంట్‌ తర్వాత అతను ప్రమాదవశాత్తు మృతి చెందగా అతని భార్య ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం అప్పీలు చేసుకున్నారు. కానీ, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా చెల్లించేందుకు నిరాకరించడంతో ఆమె కన్జ్యూమర్‌ కోర్టును ఆశ్రయించారు. ఒప్పంద సమయానికి ముందే అతను శాలరీ అకౌంట్‌గా మార్చుకున్నాడంటూ బీమా కంపెనీ చేసిన ఫిర్యాదును తోసిపుచ్చి, ఆమెకు బీమా మొత్తం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. ఏలూరులో ఒక వ్యక్తి కొనుగోలు చేసిన వాటర్‌ ఫ్యూరిఫయర్‌ సేవా లోపానికి జిల్లా వినియోగదారుల సంఘం ఆ కంపెనీకి రూ.25 వేల జరిమానా విధించింది. డిల్లీలో ఒక కోచింగ్‌ సెంటర్‌ సంతృప్తికరమైన శిక్షణను అందించకపోవడంతో విద్యార్థి ఫీజు మొత్తం వెనక్కి చెల్లించాల్సిందిగా తీర్పు నిచ్చింది.

రుజువు అవసరం..!

ఫిర్యాదు చేయాలంటే సరైన రుజువులు అవసరమని వినియోగదారులు గుర్తించాలి. విజయవాడలోని సోమేష్‌ అనే కొనుగోలుదారుడు ఓ ఎలక్ట్రికల్‌ షాపులో ఫ్యాను, ట్యూబ్‌లైట్‌ కొనుక్కున్నాడు. దానికి సంబంధించి రశీదు, వారంటీకార్టు అడిగి తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ట్యూబ్‌లైట్‌ పనిచేయకపోవడంతో అతను వారంటీకార్టును తీసుకుని వెళ్లి, చూపించి తిరిగి కొత్తదాన్ని పొందాడు. ఖరీదైన వస్తువులను కొన్నప్పుడు మాత్రమే తప్ప వెయ్యి, రెండు వేల వస్తువులు కొన్న సమయంలో బిల్లులు, వారంటీకార్డులు అడిగి తీసుకునేందుకు కొనుగోలుదారులు సంశయిస్తుంటారు. దీనివల్ల ఏదైనా లోపం తలెత్తినా వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించలేక నష్టపోతుంటారు. చిన్న వస్తువైన సరైనది పొందడం కొనుగోలుదారుల హక్కు.

ఒకప్పుడు మార్కెట్‌కి వెళ్లి నాలుగైదు దుకాణాలు తిరిగి మనకు నచ్చిన వస్తువులను తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మార్కెటే మనదగ్గరకు వచ్చేసింది. అన్ని వస్తువులు, ఒకేచోట దొరికేలా పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్‌ వచ్చేశాయి. అవసరం ఉన్నా, లేకున్నా కొనుగోలు చేసేస్తున్నాం. కొనుగోలు చేసిన ఈ సరకుల తూకంలో వ్యత్యాసం ఉందన్న సంఘటనలు బయటపడ్డాయి. మరోవైపు షాపింగ్‌కు బయటకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే కొనుగోలు చేసేందుకు అమ్మకపు యాప్‌లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆన్‌లైన్‌ అమ్మకాలు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కనిపించే వస్తువు ఒకటైతే మనకు వచ్చేది మరొకటి.. ఇలా అనేక మోసాల్లో చిక్కుకుంటున్నారు కొనుగోలుదారులు. ఇలాంటి వాటికీ కన్య్జూమర్‌ ఫోరమ్‌ను ఆశ్రయించొచ్చు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్న కొద్దీ పెరిగే వినియోగదారుల ఫిర్యాదులకు తగినట్టుగా యంత్రాంగాన్ని పెంచాలి. కేసులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలి. చట్టాలకు తూట్లు పొడవకుండా పటిష్టపరిచే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి.

ఒకప్పుడు టి.వి కార్యక్రమాలు, ఇతర ఆహ్లాద, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడానికి వివిధ ప్రకటనలు తోడ్పాటునిచ్చేవి. రానురాను యాడ్స్‌ను ప్రమోట్‌ చేయటానికే ప్రసార కార్యక్రమాలు వచ్చేలా కాలం మారిపోయింది. ఆధునిక ప్రపంచంలో అందులోనూ విస్తారమైన జనాభా ఉన్న మనలాంటి దేశాల్లో ఎక్కువమంది అవసరాలు తీర్చే అంశాలపైనే వ్యాపారం నడుస్తోంది. లాభాలబాట పట్టాలన్న అత్యాశతో వస్తువుల ఉత్పత్తిలో మన్నిక, నాణ్యత తగ్గిపోతోంది. భార్యాభర్తలిద్దరూ కష్టపడితేనేగానీ సాగని జీవనంలో మన చుట్టూ ఏం జరుగుతోంది. వాటిని ఎలా ప్రశ్నించాలో అన్న అవగాహన సాధారణ వినియోగదారుడికి కొరవడుతోంది. అందుకే మేలుకో వినియోగదారుడా మేలుకో..! నీ హక్కు నువ్వు అడిగితేనే దక్కేది!!

వినియోగదారుల హెల్ప్‌లైన్‌

ఇలా వస్తువుల కొనుగోలు, సేవల విషయంలో మోసం, అలక్ష్యంపై వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. దేశీయంగా చాలా మందికి వీటికి సంబందించిన సరైన అవగాహన లేదు. ఒకవేళ ఉన్నా చిన్న చిన్న విషయాలకే కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాం, ఎప్పటికి తీర్పు తేలుతుందోనన్న నిరాశతో చాలామంది వినియోగదారులు మిన్నకుండిపోతున్నారు. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ నంబర్‌ (1915) ఒకటుందని కూడా చాలా మందికి తెలియదు. వినియోగదారులకు మేలైన ప్రయోజనాలు కల్పించేందుకు 1986లోనే చట్టాన్ని ఏర్పాటు చేశారు. 2019లో ఈ చట్టాన్ని సవరించారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిషన్లుగా పనిచేస్తాయి. దేశంలో నేడు 629 జిల్లా, 35 రాష్ట్రస్థాయి వినియోగదారుల కమిషన్లున్నాయి. అక్రమ వ్యాపార లావాదేవీల విధానాల విషయంలో కొనుగోలుదారులకు ఈ చట్టం భద్రత కల్పిస్తుంది. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఈ చట్టం సూచిస్తోంది. ఆరోగ్యానికి హాని కలిగించే ప్రకటనల్లో భాగస్వాములయ్యే ఏజెంట్లు, సెలబ్రిటీలను సైతం శిక్షించే అవకాశముంది.

ఎలా ఫిర్యాదు చేయాలి?

తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి ఫిర్యాదు దారుడైనా, అతని ఏజెంటైనా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. వస్తు సేవల విలువ రూ.50 లక్షల వరకు జిల్లా కమిషన్‌ ఫోరానికి వెళ్లవచ్చు. నష్టం జరిగిన రెండేళ్ల కాల పరిమితితో కేసు వేయొచ్చు. ఆస్తి, ప్రాణనష్టం కలిగించే వస్తు సేవలను మార్కెటింగ్‌ చేసే వారి నుంచి తమను తాము రక్షించుకునే హక్కు కూడా ధీనిలో భాగమే.

కోడె హేమలత

➡️