తెల్లవారి లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకూ ఏమాత్రం అవకాశం ఉన్నా.. చేతిలో మొబైల్‌తోనే పిల్లలు కనిపిస్తారు. ఇది ఎవరి తప్పు అంటే వేలు చూపెట్టేది తల్లిదండ్రులనే అంటున్నారు నిపుణులు. పిల్లలు పెద్దవాళ్ల నుంచే కదా ఏదైనా అలవాట్లు అలవరచుకునేది. అందుకే తల్లిదండ్రులు ఫోను విషయంలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే.. పిల్లలూ అదే ఫాలో అవుతారు. అందుకే పిల్లలను నియంత్రించాలంటే.. పెద్దలు నియంత్రణలో ఉండాలి. ఇందుకోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఒక ప్రతిపాదన వచ్చింది.. అదేంటంటే.. పదహారేళ్ల లోపు పిల్లలకు ఫోన్ నిషేధం అని.. నిషేధం విధిస్తే పిల్లలు ఫోన్ చూడటం ఆపేస్తారా? అంటే … వెయ్యి కోట్ల రూపాయల ప్రశ్నే కదా.. ఎందుకంటే పెద్దవాళ్లు ఫోన్ వదలకుండా పిల్లల్ని చూడొద్దంటే వింటారా? వినరు కదా..! అందుకే మార్పు పెద్దల నుంచే ప్రారంభం కావాలి అనేది నిపుణుల మాట. అందుకోసం నిర్దిష్ట సమయాల్లోనే ఫోన్ ఉపయోగించడం, ఆ ఫోన్ చూసే విలువైన సమయాన్ని వేరే ప్రయోజనకరమైన పనులకు కేటాయించి చూస్తే.. ఫలితాలు ఎంత బాగుంటాయో అనుభవంలోకి వస్తుంది.
ఏ సమయంలో..
పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు సమయం కేటాయించడం అనేది ముఖ్యమైన విషయమని నిపుణులు చెప్తున్నారు. ఏ సమయంలో ఎంతసేపు ఫోను వినియోగించాలి అనేది నిర్దిష్టంగా పిల్లలకు కేటాయించాలని అంటున్నారు. అప్పుడే పిల్లలు ఫోన్‌కే సమయమంతా వెచ్చించకుండా ఉంటారని చెప్తున్నారు. పిల్లలకు ఇలా సమయం కేటాయించడం వల్ల వాళ్లు ఒక క్రమ పద్ధతిలో ఫోను వాడటం అలవాటవుతుందనేది నిపుణుల మాట.
ఆటలు, కథలు చదవడం.. బొమ్మలు, క్రాఫ్ట్స్..
పిల్లలు ఫోన్ వాడని సమయంలో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వీటిపై ఆసక్తి కలిగించేలా ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ కొన్ని వారికి పరిచయం చేయాలి. వాళ్ల ఆసక్తికి అనుగుణంగా పాత ఆటలనే కొత్తగా వారికి పరిచయం చేయొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే కథలు చెప్పడం.. దాని మీద కాసేపు వారితో సంభాషించడం కూడా మంచి అలవాటు. పిల్లలకు కథల పుస్తకాలు కొనివ్వడం ఒక భాగమైతే, తల్లిదండ్రులు కూడా కథల పుస్తకాలు తెచ్చి, పిల్లలకు చదివి వినిపించడం చేయాలి. లేదా తమకు తెలిసిన కథలు చెప్పొచ్చు. ఒక సంఘటన, కొన్ని పాత్రలు ఇచ్చి, పిల్లలతో కథా రచనకు శ్రీకారం చుట్టొచ్చు. అలాగే బొమ్మలపై ఆసక్తి ఉంటే పిల్లలకు చిత్రలేఖనానికి సంబంధించిన పుస్తకాలు, పేపర్లు, కలర్ పెన్సిల్స్, క్రెయిన్స్ కొని ఇస్తే, వాళ్ల లోకం అందమైన చిత్రాలతో నిండిపోతుంది. అలాగే క్రాఫ్ట్స్ తయారుచేయడం కూడా పిల్లలకు ఆసక్తిగా చేసేవాటిల్లో ఒకటి. ఇలాంటివన్నీ ఫోను వాడని సమయంలో అలవాటు చేస్తే, ఆ వైపు ధ్యాస మళ్లదని నిపుణులు మాట. అంతేకాదు. వాళ్లల్లోని సృజనకు మంచి వేదిక కల్పించినట్లే.
అమ్మానాన్నలకు ఇంటిపనుల్లో సహాయం..
ఇంటిపనుల్లో అమ్మానాన్నలకు సహాయపడేలా పిల్లలను ఫోను ఇవ్వని సమయంలో కేటాయించాలి. కూరగాయలు కట్ చేయడమో, పుస్తకాల అల్మరా సర్దడమో పిల్లలతో చేయించవచ్చు. ఇల్లు ఊడ్వడం, మాపింగ్ కూడా పిల్లలకు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తోడ్పడేవే. ఇంటికి అవసరమైన సరుకుల లిస్టు చెప్తుంటే వాళ్లు రాసేలా చేయొచ్చు. వారితోనే షాపింగ్ చేసి, అవసరమైనవి తేవడం.. ఇవన్నీ పిల్లలతో తల్లిదండ్రులు కొంత సమయం గడపడానికి గొప్ప అవకాశం అంటున్నారు నిపుణులు. అంతేకాదు తల్లిదండ్రులతో పిల్లలకు మంచి అనుబంధం ఏర్పడడానికి వీలవుతుందని చెప్తున్నారు. తోట పనులు కూడా పిల్లలకు మంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఒక గులాబీ మొక్క పిల్లలతోనే వెళ్లి ఎంపిక చేసుకుని, వారికి నచ్చిన రంగు కొని తీసుకురండి. వాళ్లతో కుండీలో నాటిస్తే పిల్లల ఆనందం వర్ణించలేం. అలాగే వారితో కొన్ని గింజలు ఒక టబ్‌లో మట్టి వేయించి, చల్లిస్తే, అవి మొలకలు వచ్చినప్పుడు ఎంత సంబరపడిపోతారో మాటల్లో చెప్పలేం. ఇలాంటివన్నీ పిల్లలకు ఫోను వాడని సమయం ఎంతో ప్రయోజనకరంగా తయారవుతుంది.
కళలు.. సంగీతం.. ఇనుస్ట్రిమెంట్స్..
పిల్లలకు ఏయే కళల పట్ల ఆసక్తి ఉందో తల్లిదండ్రులు గమనించుకోవాలి. వాళ్ల ఆసక్తికి అనుగుణంగా సంగీతం, సాహిత్యం, ఇనుస్ట్రుమెంట్స్‌లో ఏదైనా నేర్పేందుకు వాళ్లను సన్నద్ధం చేయాలి. అలా వాళ్ల ఆసక్తి ఉన్న రంగంలో చేర్చడం వల్ల పిల్లలకు ఫోను గురించిన ఆలోచన తగ్గుతుంది. ఒకవేళ ఫోను ఉపయోగించినా, దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఎక్కువ చూస్తుంటారు. ఆయా కళలు నేర్చుకోవడానికి వెళ్లడం, అక్కడ కొంత సమయం గడపడంతో కొత్త స్నేహాలు ఏర్పడతాయి. స్కూలు కాకుండా మరో లోకంలో ఉండడం వారికి ఒక మార్పుగానూ, ఒత్తిడిని నుంచి కొంత రిలీఫ్‌గానూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
వ్యాయామం.. తదితరాలు.. ఈత, స్కేటింగ్.. సైక్లింగ్..
అలాగే వ్యాయామం చేయడం అనేది నిత్యకృత్యంగా పిల్లలకు అలవాటు చేయాలి. నడక మాత్రమే కాకుండా ఈత, స్కేటింగ్, సైక్లింగ్ వంటివి పిల్లలకు సరికొత్త విద్య నేర్చుకున్నట్లు అవుతుంది. వ్యాయామం అనేది పిల్లలు చురుకుగా ఉండడానికి, చక్కని ఆలోచనలు చేయడానికి ఎంతగానో తోడ్పడుతుందనేది నిపుణులు చెప్తున్న మాట. ఒక క్రమశిక్షణ పిల్లలకు అలవడాలంటే పెద్దల్లోనే ముందు మార్పు రావాలి. వ్యాయామం అనేది పెద్దలు చేస్తూ, తమతో పిల్లలను తీసుకుని వెళ్లాలి. ఆ వైపు పిల్లలను మళ్లించాల్సిన బాధ్యత, రోల్ మోడల్స్‌గా నిలవాల్సిందీ పేరెంట్సే.. పిల్లలకు ఫోను వాడని సమయం ఇలాంటి మంచివాటికి కేటాయించడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు అపారం కదా!