గుంపులో బంతి

May 19,2024 11:41 #Sneha

సెలవుల్లో ఇంటి దగ్గర ఉంటున్న పిల్లలు చాలా మంది ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతున్నారు. దాన్నుంచి వారి దృష్టి మళ్లించి ఫిజికల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చేయాలి తల్లిదండ్రులు. పిల్లల చేతుల్లో నుంచి ఫోన్‌ లాక్కుంటే మొదట ఊరుకోరు. ఏడుస్తారు, అలుగుతారు. ఫోన్‌ ఇవ్వమని మారం చేస్తారు. ఈ క్రమంలో వారికి మంచి మాటలు చెబుతూ ‘ఒక మంచి ఆట ఆడదాం. ఎవరు గెలిస్తే వారికి ఒక బహుమతి’ అంటూ వారిని ఆటలు ఆడించాలి. అప్పుడే వారి శరీరంతో పాటు మెదుడు చురుకుగా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు.
ఇలా ఆడాలి : గ్రౌండ్‌లో పిల్లలు వయస్సు, ఎత్తును బట్టి ఒక వృత్తం గీయాలి. ఈ వృత్తంలో కొందరు పిల్లలుంటారు. వృత్తం బయట కొంచెం దూరంలో ఒక పిల్ల నిలబడి బంతితో వృత్తం లోపలి వారిని కొట్టాలి. బంతి ఎవరికి తగిలితే వారు అవుట్‌. ఈ అమ్మాయి/ బాలుడు వృత్తంలోని పిల్లల్లో చేరుతుంది. అవుటయినవాడు బంతి తీసుకొని ఆట మళ్లీ మొదలెడతాడు.
ఇలా ఆడుతున్నప్పుడు చిట్టచివరిదాకా బంతి తనకు తగలకుండా తప్పించుకొని అవుట్‌ కాకుండా ఉన్న అమ్మాయి గెలిచనట్టు. తపిపంచుకొనేపుడు వృత్తం బయటికి వచ్చిన వారు కూడా అవుటయినట్టే లెక్క.
ఈ ఆటను ఇంకో విధంగా కూడా ఆడొచ్చు. పిల్లలు రెండు జట్లుగా మారుతారు. ఒక జట్టు వృత్తంలో ఉంటుంది. మరో జట్టు వృత్తం బయట ఉంటుంది. బయటి వారికి ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్సు ఇచ్చి వృత్తంలోని వారిని కొట్టమనాలి. అందరూ అవుటయ్యాక వృత్తంలోని వారు బయటికి వచ్చి ఆట మొదలెడతాడు. వృత్తం పెద్దదిగా ఉండి పిల్లలు బంతిని తప్పించుకోడానికి అనుకూలంగా ఉండాలి. వృత్తానికి బయటి నుంచి బంతి వేసే వారికి మధ్య దూరం- ఆటలో పాల్గొన్న పిల్లల సంఖ్యను బట్టి ఉండాలి. ఈ ఆట వల్ల పిల్లల మధ్య స్నేహబంధం కూడా బలపడుతుంది. దాంతో ఇలాంటి ఆటలు ఎన్నో ఆడుకునేలా దోహదపడుతుంది.

➡️