పువ్వుల్లో రాణీ ఏది అంటే.. గులాబీ. ప్రేమకు కానుకగా ఇచ్చే పువ్వు గులాబి. గులాబీ పూల అందం, సువాసనలకు అందరం దాసోహమే. గులాబీలు కేవలం అందమే కాకుండా ఆరోగ్యాన్నీ ఇస్తాయంటున్నారు నిపుణులు. ఇది యాంటీ ఇనÛ్ఫ్లమేటరీ, రిఫ్రిజెరాంట్, డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది. వేరు నుండి ముల్లు వరకు గులాబీ మొక్క ఔషధకారిణి. అయితే మంచి సువాసనను గుబాళించే పాత కాలపు నాటు గులాబీగా (డమాస్క్ గులాబీలు) పిలువబడే గులాబీల్లోనే ఈ లక్షణాలుంటాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే శక్తి గులాబీకి ఉంది. రక్తపోటు, ఊబకాయం, సుగర్‌లెవెల్స్‌ను తగ్గిస్తుంది. డిస్మెనోరియా, డిప్రెషన్, ఒత్తిడి, మూర్చల చికిత్సలో సహకరిస్తుంది. రోజ్ వాటర్ చర్మ సంరక్షణకు, అందాన్ని మెరుగుపరిచేందుకు వివిధ మైక్రోబయోటాపై యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్న గులాబీలతో కొన్ని వంటకాలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
షర్బత్..
కావలసినవి : సబ్జా గింజలు-4 స్పూన్లు, రోజ్ సిరప్-75 మి.లీ., నిమ్మరసం-11/2 స్పూను, సోడా/చల్లటి నీళ్ళు-600 మి.లీ.
సిరప్ కోసం : ఎండిన గులాబీపూల రేకులు-కప్పు, పంచదార-కప్పు, బీట్‌రూట్ రసం-1/4 స్పూను, ఎసెన్స్-1/2స్పూను, ఉప్పు -చిటికెడు, నిమ్మరసం-స్పూను
ముందుగా అర కప్పు నీటిని మరిగించి, దానిలో ఎండుగులాబీ రేకులు వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించి, వేరే గిన్నెలో వడకట్టి పక్కనుంచాలి. గిన్నెలో కప్పు నీళ్ళు, పంచదార తీసుకుని స్టౌమీద పెట్టి తిప్పుతూ మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా తయారుచేసుకున్న రోజ్ సిరప్, బీట్‌రూట్ రసం, ఎసెన్స్, ఉప్పు, నిమ్మరసం (చల్లారిన తర్వాత కూడా గడ్డకట్టకుండా ఉండేందుకు) ఒకదాని తర్వాత ఒకటి కలపాలి. ఇవన్నీ కలిపి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేం మీద ఉడికించిన తర్వాత (సిరప్ కాస్త జిగురుగా తయారవుతుంది) స్టౌ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే తాజాగా ఉంటుంది.
తయారీ : ముందుగా సబ్జా గింజలు పది నిమిషాలు నానబెట్టాలి. ఒక గిన్నెలో రోజ్ సిరప్, నానిన సబ్జా గింజలు, నిమ్మరసం, సోడా లేదా చల్లటి నీళ్ళుకలిపితే గులాబీ షర్బత్ తయారైనట్లే. సమ్మర్‌లో అయితే ఎనిమిది నుంచి పది ఐస్‌క్యూబ్స్ చేర్చుకుని తీసుకుంటే కూల్‌గా బాగుంటుంది.
గుల్కండ్..
కావలసినవి : గులాబీపూల రేకులు-50 గ్రా, పటికబెల్లం-60 గ్రా, సోంపు-స్పూను, యాలకుల పొడి-1/2 స్పూను, తేనె- 6 స్పూన్లు
తయారీ : గులాబీ పూల రేకులను శుభ్రంగా కడిగి, పొడి టవల్ మీద ఆరనివ్వాలి. ఒక గిన్నెలోకి ఈ గులాబీ రేకులు, పటికబెల్లం పొడి వేసి చేతితో నలిపినట్లు కలపాలి. గిన్నెను వేడిచేసి పటికబెల్లం కరిగి ఉడుకుతున్నప్పుడు సోంపు పొడి, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, తేనె కలపాలి. అంతే ఎంతో రుచికరమైన గుల్కండ్ రెడీ. దీనిని శుభ్రంచేసిన సీసాలో పెట్టి తడి తగలకుండా వాడుకుంటే నెల రోజులు తాజాగా ఉంటుంది.
మిల్క్‌షేక్..
కావలసినవి : పాలు- 1/2 లీ., రోజ్‌వాటర్-స్పూను, పంచదార-4 స్పూన్లు, రోజ్ సిరప్-1/4 కప్పు, ఐస్‌క్యూబ్స్- 5, నానిన సబ్జాగింజలు-4 స్పూన్లు, గులాబీపూల రేకులు -కొంచెం
తయారీ : పాలు, రోజ్‌వాటర్, పంచదార, రోజ్ సిరప్, నానిన సబ్జా గింజలు, గులాబీ పూల రేకులు అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా చిలకాలి. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. వీటిని గాజుగ్లాసులో పోసి సర్వ్ చేయటమే.
టీ..
కావలసినవి : గులాబీ పూల రేకులు-ఒక పువ్వు, తేనె-2 స్పూన్లు, నిమ్మరసం-ఒక కాయ
తయారీ : గిన్నెలోకి రెండు టీ గ్లాసుల నీళ్ళు, గులాబీపూల రేకులు తీసుకుని ఐదు నిమిషాలు మరిగించి వడపోయాలి. దానిలో తేనె, నిమ్మరసం కలపాలి. అంతే ఘుమఘుమలాడే గులాబీ టీ రెడీ. ఈ టీని ఉదయం పూట రెగ్యులర్‌గా తీసుకుంటే అనేక రుగ్మతల నివారిణిగా పనిచేస్తుంది.