కాఫీ పొడితో తెల్లజుట్టు నల్లగా..

Jun 9,2024 07:29 #Health Awareness, #Sneha

చాలామంది తమ రోజును కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయం పూట ఒక కప్పు వేడి కాఫీ తాగితే రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది. దాని సువాసన ఎంతటివారినైనా తనవైపుకు ఆకర్షింప చేస్తుంది. అదే కాఫీ జుట్టుకు ఎంతో ఉపయోగకారి అని మీకు తెలుసా? చెంచాడు కాఫీ పొడితో తెల్లజుట్టును నల్లగా చేయగలదంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంకా జుట్టు ఆరోగ్యానికి కాఫీ ఎంతలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

కాఫీలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అదే కాఫీ జుట్టుకి, చర్మానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలుసుకున్నారు. అవును జుట్టు పెరుగుదలకు కాఫీ సహాయపడుతుంది. శరీరానికి, అలాగే జుట్టుకు ప్రయోజనకరంగా భావించే కాఫీలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షిస్తాయి. దీనితో పాటు, కాఫీలోని కెఫిన్‌ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా చేయడానికి కాఫీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. కొన్నింటిలో ఈ కాఫీపొడిని మిక్స్‌ చేసి ఉపయోగించే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

కొబ్బరినూనెతో..
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కాఫీ, కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరినూనెలో ఒక చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. దీన్ని పూర్తిగా జుట్టుకు పట్టించాలి. కాసేపు మసాజ్‌ చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూ ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ హెయిర్‌ మాస్క్‌ని ఉపయోగించండి. కొబ్బరినూనెలో ప్రోటీన్‌, విటమిన్‌ ఇ, యాంటీ-ఆక్సిడెం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

కలబందతో..
కాఫీ, కలబంద కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల అలోవెరా జెల్‌, చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను స్కాల్ప్‌, హెయిర్‌కి అప్లై చేసి కాసేపు మసాజ్‌ చేయండి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ హెయిర్‌ మాస్క్‌ని ఉపయోగించండి.

పెరుగుతో..
పెరుగు జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది. దీని నుండి హెయిర్‌ మాస్క్‌ చేయడానికి, ఒక కప్పు తాజా పెరుగు తీసుకోండి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ కాఫీ పోడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసం కూడా కలపండి. ఇప్పుడు దీన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.

తేనెతో..
తేనె జుట్టును బలపరుస్తుంది. దీని కోసం, ఒక గిన్నెలో ఒక టేబుల్‌ స్పూన్‌ కాఫీ పొడిని తీసుకోండి. దానికి తేనెను యాడ్‌ చేయాలి.. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు జుట్టుకు అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.

ఆముదంతో..
ఈ హెయిర్‌ మాస్క్‌ చేయడానికి, ఒక గిన్నెలో ఒకటి లేదా రెండు చెంచాల కాఫీ పొడిని తీసుకుని, దానికి ఆముదం కలపండి. దీని నుండి మందపాటి పేస్ట్‌ను సిద్ధమవుతుంది. ఇప్పుడు దీన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు గంట తర్వాత షాంపూతో కడగాలి.

➡️