బుద్ధిబలం

May 19,2024 11:45 #Sneha, #Stories

ఒక అడవిలో ఒత్తయిన కొమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరించుకున్న ఒక పెద్ద మర్రిచెట్టు. దాని మీద చిలుకలు, పావురాళ్ళు, కాకులు, పిచ్చుకలు మొదలగు పక్షులు గూళ్ళు కట్టుకుని, కాపురమున్నాయి. అవి కలిసికట్టుగా ఒకరికి ఒకరు తోడుగా స్నేహంగా ఉంటున్నాయి. పెద్ద పక్షులు ఆహారం కోసం అడవిలోకి వెళ్లినప్పుడు, ఒక ముసలి కాకి పిల్లలకు కాపలాగా ఉంటుంది. అది అందరికీ పెద్ద దిక్కుగా మంచీ చెడూ చెప్తుంది. అందరూ దాన్ని ‘తాతా! తాతా!’ అని పిలుస్తారు. దాని సలహాల వల్ల పక్షులన్నీ ఎటువంటి సమస్యా లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాయి.
కొన్ని రోజుల తరువాత కొంచెం దూరంలో ఉన్న మరో పెద్దచెట్టు కాండానికి ఒక తొర్ర ఉంది. దాని ముఖద్వారం చిన్నగా ఉండటంతో చీకటిగుహలా ఉంది. దాన్ని అక్కడకు కొత్తగా వచ్చిన కొన్ని గుడ్లగూబలు నివాసంగా చేసుకున్నాయి. సహజంగా గుడ్లగూబలు పగలంతా నిద్రపోయి, రాత్రిపూట బయటకు వస్తాయి. అలాగే అవి రాత్రయ్యాక చుట్టూ తిరుగుతూ మర్రిచెట్టు మీదున్న పక్షుల గూళ్ళ దగ్గరకు వచ్చాయి. ఒక్కసారిగా గూట్లో నిద్రపోతున్న పక్షుల మీదకు దాడి చేశాయి. అనుకోని సంఘటనకు పక్షులన్నీ బెదిరిపోయాయి. గుడ్లగూబలు పక్షుల పిల్లలను ముక్కుతో కరచుకుని, నేల మీద పడేసాయి. అవి ఏడుస్తూ ప్రాణాలు విడిచాయి. గుడ్లగూబలు కాసేపు అక్కడ భీభత్సం సృష్టించి, తిరిగి వాటి నివాసానికి వెళ్లిపోయాయి.
‘తాతా! ఏమిటి ఈ ఘోరం? ఈ గుడ్లగూబలు ఎక్కడ నుండి వచ్చాయి?’ ముసలి కాకిని ప్రశ్నించింది పావురం.
‘అవి ఎక్కడ నుండో ఇక్కడకు కొత్తగా వచ్చినట్లున్నాయి. వాటి నివాసం ఎక్కడో మనం తెలుసుకోవాలి’ అంది ముసలి కాకి.
ఒక పావురం వాటిని అనుసరించి వెళ్ళి, వాటి స్థావరం తెలుసుకుని వచ్చింది. మరుసటిరోజు రాత్రి కూడా గుడ్లగూబలు అలాగే దాడి చేశాయి. వాటిని ఎదుర్కోవడం పెద్ద పక్షులకు సాధ్యం కాలేదు. గుడ్లగూబలు మళ్ళీ కొన్ని పిల్లపక్షులను హింసించాయి.
‘రాత్రి వేళ కావడం వల్ల వాటికి చూపు బాగా ఆనుతుంది. దానితో వాటి బలం రెట్టింపవుతుంది. మనకు చీకట్లో ఏమీ కనిపించకపోవడంతో వాటిని ఎదుర్కోలేకపోతున్నాం. మనం బుద్ధి బలంతో శత్రువులను గెలవాలి’ ఆలోచిస్తూ అంది ముసలి కాకి.
‘తాతా! ఎలాగైనా సరే నువ్వే మమ్మల్ని కాపాడాలి’ ప్రాధేయపూర్వకంగా అంది చిలుక.
‘సరే’ అంటూ ఆలోచనలో పడింది ముసలికాకి. కాసేపటి తరువాత అందరికీ ఒక ఉపాయం చెప్పింది. అన్ని పక్షులు సరేనని తలూపాయి. తరువాత వాటి గోర్లతో ముసలి కాకిని రక్తం వచ్చేలా గీరేసాయి. అది అక్కడ నుండి అలాగే మూలుగుతూ వెళ్ళి గుడ్లగూబలుండే చెట్టు క్రింద కూర్చొని, ఏడవడం మొదలుపెట్టింది.
‘ఎవరిదీ? ఎందుకలా ఏడుస్తున్నారు?’ అంటూ ఒక గుడ్లగూబ బయటకు వచ్చింది. ‘నేను కాకిని. నన్ను మా వాళ్ళు చాలా హింసించారు’ అని ఏడవసాగింది కాకి.
‘ఎందుకు?’ ప్రశ్నించింది గుడ్లగూబ.
‘మీరు చాలా బలవంతులు. మీతో గొడవవద్దు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నాను. అది మా వాళ్లకు నచ్చలేదు. అందుకే నన్ను శిక్షించారు. నేనా ముసలిదాన్ని, నాకు ఇప్పుడు ఆశ్రయం ఇచ్చేవారు ఎవరూ లేరు’ అంది కాకి.
‘అయ్యో! మా వల్ల నిన్ను తరిమేశారా? వాటి పని పడతాం. నువ్వు కూడా మాతో పాటు మా గుహలో ఉండు’ అంది గుడ్లగూబ.
‘మీరు చాలా మంచివారు. నాకు ఆశ్రయం ఇచ్చారు. కానీ నాకు గుహ లోపల ఉండటం అలవాటు లేదు. నేను చెట్టు మీద ఉంటాను. మీరు లోపల ఉండండి’ అంది కాకి.
‘సరే అలాగే’ అంది గుడ్లగూబ.
పగలంతా గుడ్లగూబలు పడుకునే సమయంలో ముసలికాకి ఎండు పుల్లలు ఏరి, చెట్టు వెనుక భాగంలో పేరుస్తుంది. అలాగే ఒక పది రోజులు గడిచాయి. ఈ పది రోజులు గుడ్లగూబలు రోజూ రాత్రిళ్ళు పక్షులను చిత్రహింసకు గురిచేస్తున్నాయి.
ఒక రోజు గుడ్లగూబలు నిద్ర పోతున్న సమయంలో ‘మన ప్రణాళిక అమల్లో పెట్టడానికి మీరంతా రావాలి’ అని ముసలికాకి పక్షులందరినీ పిలిచింది. వెంటనే అన్ని పక్షులూ శబ్ధం చేయకుండా వచ్చి చెట్టు వెనుక పేర్చిన ఎండు పుల్లలను గుడ్లగూబల నివాసమైన చెట్టు తొర్రకు అడ్డుగా, దట్టంగా దారి లేకుండా మూసేశాయి.
తెల్లారి నిద్ర లేచిన గుడ్లగూబలు బయటకు రావడానికి తోవ లేక, అల్లాడుతూ అందులోనే ఉండిపోయాయి.
‘అనవసరంగా ఒకరిని బాధ పెడితే ఎవరైనా ఫలితం అనుభవించక తప్పదు’ అంది ముసలికాకి.
‘తాతా! నీ వల్ల మేము శత్రువుల బారి నుండి రక్షింపబడ్డాము’ అంటూ అన్ని పక్షులూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి.

కె.వి. సుమలత
94926 56255

➡️