అలసిపోయి ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో, వేడి వేడి ఒక ప్లేట్ మిర్చీ బజ్జీ.
జీతం రాగానే, పెద్దగా అవసరం లేకున్నా కూడా సరదాగా ఆన్లైన్ ఆర్డర్‌లో కొన్న ఆ వస్తువు.
ఎగ్జిబిషన్‌లో కలర్ నచ్చి, మళ్లీ ఎప్పుడూ వాడమని తెలిసినా కొనేసిన, ఆ పింక్ రబ్బర్ బ్యాండ్.
వేసవి మధ్యాహ్నం వేళ ఓ కునుకేసి లేచి, తినాలనిపించిన చల్లటి వెనీలా ఐస్క్రీం. దారిలో కనిపించిన బుజ్జి పాపకి, పక్కనే ఉన్న కిరాణా కొట్టులో కొనిచ్చిన రూపాయి చాక్లెట్టు. బోరు కొట్టి, ఏమి తోచక, సరదాగా అల్లరి చేసి, ఆ రోజు అమ్మకు తెప్పించిన కోపం.
వర్కుతో రోజూ విసిగిపోయి, ఒక సాయంత్రము ఇష్టమైన పాట పెట్టుకుని వేస్కునున్న ఓ వాటర్ కలర్ పెయింటింగ్. ఎంతో ఆసక్తిగా అనిపించిన ఆ క్షణాన్ని డైరీలో రాసుకున్న ఆ అమూల్యమైన మొదటి కవిత. ఆ రోజు మెరిసిపోతున్న చంద్రుడు నచ్చేసి తీసుకున్న ఆ బ్యాడ్ క్లారిటీ ఫోటో. మొదటి జీతం రాగానే చందనబ్రదర్స్‌లో అమ్మమ్మకు చెప్పకుండా కొనిచ్చిన ఆ నీలి రంగు చీర. ఇంటి నుండి స్కూలుకు వెళ్లే దారిలో, ఇష్టమైన టీచర్ కోసం కోసిన ఎర్ర రోజా పువ్వు. చాలా రోజులకి కలిసిన బంధువులతో- మేడ పైన చెప్పుకున్న సరదా కబుర్లు. చాన్నాళ్ళ తరువాత చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ స్నేహితుడితో మాట్లాడిన పెద్ద కాల్. నచ్చిన సినిమా టీవిలో వచ్చినప్పుడు, హీరోను చూస్తూ, ‘యే డిష్యూం’ అంటూ మిమిక్ చేసిన ఆ రెండు ఫైటులు.
షాపులో, ఆ ఎవ్వరూ చూడరులే అనుకుంటూ బ్యాగ్‌లో చుప్‌చాప్‌గా వేసేసిన దొంగ వస్తువు. స్నేహితుడు క్లాస్ వింటున్నప్పుడు, వాడికి తెలీకుండా నెత్తి మీద వేసిన ఆ చిలిపి మొట్టికాయ.
ఏజ్, రిలీజియన్, జెండర్, ఏ ఫాక్టర్‌తోనూ అస్సలు సంబంధమే లేకుండా అందరినీ, హుషారుగా ముందుకు తోసేవి, మనకు ఈ కష్టమైన ఇష్టమైన చిన్ని జీవితంలో ఉన్న, అంత కన్న చిన్న, తప్పక అవసరమైనవి ఈ బుల్లి ఆనందాలే!
సాయి మల్లిక పులగుర్త