నేను ఇన్ని రోజులు అనుకున్నా, ఆనందంగా ఉంటేనే అది ఐడియల్ జీవితం అని, ఇప్పటిదాకా ఏం రాసినా, ఏ బొమ్మలు గీసినా, ఆనందంగా ఉన్న ఏదో రోజు రాసినవే, గీసినవే. అన్ని రోజులూ ఒకేలా ఉండవుగా, ఒక వేళ అలా ఉన్నా కూడా, నా స్నేహితురాలు సింధు ఒకరోజు చెప్పినట్టు, ఇలా బాడ్ డేస్ వస్తేనేగా, హ్యాపీ డేస్ విలువ తెలిసేది. చిన్న కష్టం ఏదైనా ఎదురవ్వగానే, వెంటనే నాకు నచ్చినవి చెయ్యడం ముందు మానేస్తా, ఆ కష్టాన్ని జయించే వరకు, ఇంకేవీ ముట్టుకోను.
ఆ కష్టం తీరేంతవరకూ, ఇంకేవి చెయ్యకుండా కేవలం దాని గురించే ఆలోచిస్తూ, దానికై జీవిస్తూ ఒంటి కాలి మీద తపస్సు చేస్తేనే, దక్కే ఫలితంతో ఆకాశాన్ని అందుకోగలను, అని గట్టిగా నమ్మేదాన్ని. ఇదొక్కటే దాటేస్తే, ఇంక నాకు తిరుగులేదు, జీవితాన్ని జయించిన దాన్ని అయిపోతా అనుకుంటా, కానీ ఎప్పటికప్పుడే ఎదురయిన ప్రతీ ఛాలెంజ్, ముందు దాన్ని మించినదై వస్తోంది.
ఏదో, ఎప్పుడో, వస్తుందనే ఆశలో, నిజానికి అది వస్తుందో లేదో గారెంటీ లేదు, ఒకవేళ వచ్చినా, ఆ తరువాత దానికి వారెంటీ లేదు, అలాంటి దానికోసం ఇప్పటి ఆనందాలు దూరం చేసేసుకోవడం ఎందుకు అనిపించింది. ఏదైనా గోల్ సాధించే ప్రాసెస్ లో కష్టం మాత్రమే ఇచ్చి, వేరే ఏ ఇష్టాన్నీ పైకి కనపడనీ కుండా దాచేసా, ఇన్నాళ్లూ, ఇన్నేళ్లుగా. ఒకరి ఇష్టాలను దూరం చేస్తూ వచ్చిన ఫలితం, వారికి అవసరమా అనిపించింది.
ఇలా కాదని, రెండు నెలల తరువాత మళ్ళీ ఈరోజే నాకు ఎంతో ఇష్టమైన నా మెదడును హుషారుగా ఉంచి, మనసును హాయిగా ఉంచే ఆ పాటను విన్నా. ఇన్ని రోజులూ ఏం వదిలేసానో తెలుసుకున్నా. ఒకేసారి ఆనందం బాధ, తూచలేనివిగా వచ్చి నా భుజాల మీద వాలాయి, చెప్పలేని ఓ అద్భుతమైన ఎమోషన్ అది. గాలి సన్నగా ఈల వేస్తుండగా, నా ఆ బుల్లి స్పార్క్ మళ్ళీ తిరిగి నా దగ్గరకి, ఓనరును చూడగానే ఆనందం పట్టలేని, ఓ చిన్న కుక్క పిల్లలా పరిగెత్తుకు వచ్చి హత్తుకున్నట్టుగా అనిపించింది.
దేనికోసమూ, వదులుకోలేని స్వచ్ఛమయిన ఆనందం అది. నన్నెప్పటికి వదిలిపోకు అని, నా బుల్లి స్పార్క్‌కు, నాకు నచ్చిన పాట ఆరోజంతా రిపీటులో పెట్టుకుని, దానికి గులాబీ రంగు పీచుమిఠాయి కొనిచ్చా. అది నాకు తిరిగి, ఎన్ని చేసినా సాధ్యం కాలేని కష్టాన్ని జయించడం, మరింత సులువు చేసి చూపించింది. ఆ బుల్లి స్పార్కుకి అలక రాక రాక వచ్చినందుకు, పీచు మిఠాయితో సరిపెట్టుకోను అని మారాం చేస్తే, దానికోసం మళ్ళీ నా ఆ ప్రియమైన పాటను, బొమ్మ రూపంలో వేసి చూపించి నా దగ్గరే శాశ్వతంగా ఉండిపొమ్మంటూ, మొత్తానికి, ఒప్పించగలిగా. దాన్ని గట్టిగా తాడు కట్టేసి దెగ్గరగా ఉంచోవాలని చూసిన రోజు అది దొరకదు, దానికి రావాల్సిన సమయం వచ్చినప్పుడే అది వస్తుంది…