కార్డిసెప్స్‌

Feb 2,2025 09:51 #Cordyceps, #Sneha

‘కీడెంచి మేలెంచమన్నారు కదా పెద్దోళ్ళు !’
‘ఇది నా మేలుకోసమే కదా నానమ్మా’
‘తనకుమాలిన ధర్మం మేలు చేస్తుందా?’
‘ధర్మపత్ని ధర్మం తప్పకూడదంటుంది మా అత్తమ్మ’
‘నీతులుండేవి ఎదుటివాళ్లకు చెప్పేందుకే కదా!’
‘పాపం.. ఆమె ఏం చేయగలదు?’
‘ఎందుకు చేయలేదు? భర్త, పెద్దకొడుకు ఆరోగ్యంగానే ఉన్నారు కదా? వాళ్లకు చెప్పొచ్చు కదా?’
‘తల్లి కదా! చెప్పకనే ఉంటుందా?’
‘మరైతే..?’
‘నువ్వు మరీనూ నానమ్మా! వాళ్లు ఒప్పుకోవాలి కదా?’
‘ఏం పాపం? ఆయనకు కొడుకు.. అతనికి తమ్ముడూనూ కదా? తర్వాతే కదా నీకు భర్త అయింది?’
‘కానీ.. ఆయన జీవితం నాతో, నా బిడ్డలతో ముడిపడింది కదా?’
‘అందుకని.. పూర్తి బాధ్యత నీదే అంటారు. వాళ్లకు రక్తసంబంధం లేదంటారా? బాధ, బాధ్యత లేదా?’
‘లేదా అంటే .. అవును .. కాదు.. కూడా!’
‘పిచ్చిపిల్లా! పరీక్షలో సరైన జవాబుకే మార్కులు పడేది.’
‘అలాగైతే.. తీసుకోవాల్సిన బాధ్యత నాదేనని నొక్కి చెప్పేసారు నానమ్మా!’
‘ఓహో! అయితే వాళ్ల శుష్కబాధ, శుష్క మాటల వల్ల ఒరిగే లాభమేమీ లేదని నీకు తెలియదా?’
‘తెలిసినా చేసేదేముంది? అవతల ప్రాణం కదా నానమ్మా!’
‘నీది మాత్రం ప్రాణం కాదా బంగారూ!’
‘నానమ్మా..’
‘మీ అత్త, తోడికోడళ్ళ స్వార్థం.. రక్త సంబంధాన్ని, ప్రేమను మింగేసింది.’
‘తమ భర్తలకి ఏమన్నా అయితే ఎలాగన్న భయం వుంటుంది కదా నానమ్మా?’
‘నిజమే! ఆ భయం నీకు లేకుండా పోయిందన్నదే నా బాధ’
‘ఏం మాట్లాడుతున్నావు నానమ్మా?’
‘ఉన్న మాటే తల్లీ! నువ్వు ఎంతసేపు నీ భర్త గురించే ఆలోచిస్తున్నావు కానీ నీ బిడ్డల గురించి ఆలోచించడం లేదు. చేజేతులా నీ బతుకును ప్రమాదంలో నెట్టుకుంటే.. రేపు ఒకవేళ.. మీరిద్దరూ లేకపోతే వాళ్ల గతి ఏమిటి? మీరున్నప్పుడే.. మీరు ఒక ఆపదలో ఉన్నప్పుడే పట్టించుకోని నీ అత్తింటివాళ్ళు రేపు నీ బిడ్డల్ని చూస్తారని నమ్మకం ఏమిటి?’
‘నానమ్మా! నా బిడ్డల గురించే నా బాధ.. భయం కూడా!’ దుర్గ కన్నీరుపెట్టుకుంది.
‘ఏడవద్దు మా! ”తల్లి ఛస్తే తండ్రి దాయాది అవుతాడంట బిడ్డలకు. అదే తండ్రి చచ్చి, తల్లి ఉంటే కొంగుపరచన్నా బిడ్డల్ని సాకుతుంది!” అని సామెత. పోయే ప్రాణం నిలుస్తుందని డాక్టర్లే ఇవ్వని నమ్మకాన్ని నమ్మి, నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం నీ బిడ్డలకే కాదు.. నీకు నువ్వే చేసుకుంటున్న అన్యాయం. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. ఇక నీ ఇష్టం, నీ బిడ్డల కర్మ’

                                                                                            ***

‘నానమ్మ చెప్పేవన్నీ నిజాలే! కానీ నన్ను నేనే సమాధాన పరుచుకోలేకపోతున్నాను. ఇక నా అత్తమామకు, బావకు, మరణంతో పోరాడుతున్న భర్తకు ఏమి చెప్పను?’ నిస్సహాయంగా చూసింది దుర్గ.
‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా నీ తెలివితేటలు. నిన్ను చదివించి ఉంటే, ఎక్కడో ఏదో పెద్ద ఉద్యోగంలో రాణించాల్సిన దానివి. మేనరికం అంటూ చిన్న వయసులోనే తాగుబోతుతో పెళ్లి చేసి, నీ భవిష్యత్తుని నాశనం చేశారు మీ పేరెంట్స్‌’ బాధగా అంది సుధీర.
‘గత జలసేతు బంధనం ఎందుకు ఇప్పుడు?’ దుర్గ అసహనంగా వెలిబుచ్చింది.
‘ఎందుకంటే .. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నీ తెలివిని తొక్కేసే ఎమోషన్స్‌ నిన్ను వదలడం లేదు కాబట్టి’
‘సుధీరా..’
‘ఆ ! లేకపోతే ఏమిటే? తాగుబోతు మొగుడి ఆగడాలు ఎదిరించలేవు. సరైన సంపాదనలేని మొగుడితో రెండో బిడ్డ వద్దనలేవు. మొగుడు తిట్టినా, కొట్టినా లోలోపల ఏడవడం తప్ప, అత్తమామలకు ఫిర్యాదు చేయలేవు. తాగుబోతు, తిరుగుబోతు తమ్ముడి ప్రవర్తన సరిదిద్దమని బావకు చెప్పలేవు. మొగుడు అంటించే సుఖరోగాలను గురించి ఫ్రెండ్‌గా కాకపోయినా డాక్టర్‌గా కూడా నాతో చెప్పలేవు. నీరసించిపోతున్న నిన్ను చూసి బలవంతం చేస్తే తప్ప నేను నీకు వైద్యం చేయలేకపోయాను. నిన్ను కనీసం సాటి మనిషిగా కూడా ఆదరించని, గౌరవించని, బాధ్యత లేని భర్త అనే మనిషి కోసం నీకింతగా తాపత్రయం ఎందుకే’ కోపంగా అంది సుధీర.
‘నువ్వే అంటున్నావు కదా భర్త అని’ భర్త అనే పదాన్ని నొక్కి పలుకుతూ అంది దుర్గ శుష్కహాసం చేస్తూ.
‘అదే అంటున్నా! నీ ఎమోషన్సే నిన్ను అన్నివిధాలా దెబ్బతీస్తున్నాయని!’
‘కాదబ్బా! భార్యగా నాకు కొన్ని ధర్మాలు, బాధ్యతలు ఉంటాయంటే.. అటు నానమ్మ.. ఇటు నువ్వూ ఒప్పుకోరు ఎందుకు?’
‘దుర్గా! స్వధర్మాన్ని కాదనే ఏ ధర్మమూ ధర్మం కాదు. బాధ్యత అంటావా? నిజమే.. కానీ పోయేప్రాణం కోసం రిస్క్‌ చేయడం కన్నా పదికాలాలు ఎదగాల్సిన పసిప్రాణాల్ని నిలబెట్టడమే నీ ముందున్న పెద్ద బాధ్యత అంటాను నేను’
‘అయ్యో! నానమ్మ కూడా ఇదే మాట! నువ్వన్నా సరైన సలహా ఇస్తావనుకుంటే .. నువ్వూ ఇదేనా? కనీసం ఒక డాక్టర్‌గా ఆలోచించు సుధీ..’ బేలగా అంది దుర్గ.
‘ఆ! అయితే విను బాగా. డాక్టర్‌గా చెబుతున్నా. అతని రెండు కిడ్నీలూ పాడైపోయాయి. డయాలసిస్‌తో ఊగులాడుతున్నాడు. స్మోకింగ్‌ ఒక లంగ్‌ను స్మాష్‌ చేసేసింది. ఇంకో లంగ్‌ ఊపిరితో ఉయ్యాలూగుతున్నాడు. ఆపరేషన్‌ వల్ల అతను కోలుకోవడంపై అస్సలు గ్యారెంటీ ఇవ్వలేము. నీ త్యాగం వల్ల నీ ఇల్లు, ఒళ్ళు గుల్ల కావడం తప్ప, వొనగూరే ప్రయోజనం ఏమీ లేదు’ స్థిరంగా చెప్పింది సుధీర.
‘సుధీ..’ ఆందోళనగా, భయంగా చూస్తున్న దుర్గ భుజం చుట్టూ చెయ్యి వేసి, దగ్గరగా తీసుకుంది సుధీర ఆత్మీయంగా.
‘దుర్గా! కాసేపు ఎమోషన్స్‌ పక్కకు పెట్టి లాజికల్‌గా ఆలోచించు. నిజానికి నువ్వు అలా ఆలోచించ లేకపోవడానికి కారణాలు తరతరాలుగా, యుగయుగాలుగా మన స్త్రీల రక్తంలో ఇంకిపోయిన ఆచారాలు, సాంప్రదాయాలు, మనుధర్మాలు! మను ధర్మాలు ఎప్పుడూ మనిషి ధర్మాలు కానే కావు. మగాళ్ళ సుఖసంతోషాల కోసం వాళ్లే రాసుకొని, స్త్రీల మీద బలవంతంగా ఉగ్గుపాలతో రంగరించినవి. ఆ ఉగ్గుపాలు స్త్రీల తరతరాల జీవితాలను కాలరాస్తున్నాయి. మగాడు.. మొగుడు.. చెప్పిందే వేదం! అన్న బాటలో నడవడం తప్ప, కొత్తదారులను కాదు కదా.. కనీసం ఆ ఆలోచనను కూడా చేయనివ్వవు. తాము ఒక బానిస భావజాలంతో బతుకుతున్నామన్న స్పృహను కూడా పొందలేనంతగా.. బాధ్యత, నైతిక విలువలు అనే చీకటి భ్రమలోనే బతికేస్తున్నారు. ఆ భ్రమలో బతుకులు కూడా బలి చేసుకుంటున్నారు. ఇది నిజం దుర్గా!
కార్డిసెప్స్‌ అనే పరాన్నజీవి గురించి చెప్పాలి నీకు. ఇది చీమలు, ఇతర క్రిమి కీటకాల శరీరాల్లో ఉండే ఒక భయంకరమైన ఫంగస్‌. ఇది ఒకవేళ చీమకు సోకితే దాని ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఇది చీమ కేంద్ర నాడీవ్యవస్థలో స్థావరం ఏర్పాటు చేసుకొని, అక్కడ్నుంచి చీమ చేసే పనుల్ని.. అది తీసుకునే నిర్ణయాలను కూడా ఈ ఫంగసే నిర్ణయిస్తుంది. ఈ విషయాలు ఏమీ తెలియని చీమ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటున్నాననే భ్రమలో ఉంటుంది. కానీ ఈ ఫంగస్‌ మెల్లగా తను పెరగడానికి అనుకూల ప్రదేశానికి ఆ చీమను దారి మళ్లిస్తుంది. అలా చేరగానే చీమ తనంతట తాను ఒక కొమ్మను తన కోరలతో గట్టిగా పట్టుకొని, ఆగిపోతుంది. ఆ మరుక్షణమే ఆ ఫంగస్‌ చీమను చంపేసి, దాని శరీరాన్ని తన అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది. అలాగే లక్షల కొద్ది బ్యాక్టీరియాకు నిలయమైన మన శరీరాన్ని.. ఆలోచనలను.. మనకు మనమే నడిపిస్తున్నామా లేక ఎవరో నిర్ణయించిన ధర్మాలు, నీతులు, నియమాలు, కట్టుబాట్లు అనే ఫంగస్‌ చేరి నడిపిస్తున్నాయా? మన ఆలోచనలను, అభిప్రాయాలను, అంతిమంగా జీవితాలనే కంట్రోల్‌ చేస్తూన్న ఈ ఫంగస్‌ విషయాన్ని గ్రహించలేకపోతున్నారన్నది వాస్తవం! బాగా ఆలోచించి, నిర్ణయం తీసుకో దుర్గా!’ అని చాలా ఓర్పుగా చెప్పింది.
కాసేపు గాలి కూడా స్తంభించి మౌనం రాజ్యమేలింది.
‘వినని వాళ్ళకు ఎంత చెప్పినా వేస్టే!’ అనుకుంటూ సుధీర టేబుల్‌పైన ఉన్న నీళ్ల గ్లాస్‌ తీసుకుని, తాగబోతుంటే దుర్గ చేయి చాపింది.
సుధీర చేతిలోని నీళ్ల గ్లాసు తీసుకొని, నిదానంగా నీళ్లు తాగేసి.. గ్లాసు టేబుల్‌పైన పెడుతూ మరింత నింపాదిగా, స్థిరంగా మాట్లాడింది దుర్గ .
‘నా భర్త కర్మకు నా కర్మను ముడిపెట్టడం మూర్ఖత్వమే! అతని కర్మ ఫలం అతనిదే! నానమ్మ చెప్పినట్లు నేను నా కిడ్నీ అపాత్ర దానం చెయ్యను.’

యం. ఆర్‌. అరుణకుమారి
8121523835

➡️