పిల్లలకు లైంగిక విద్య అవసరమే !

Apr 21,2024 12:10 #Sneha

పిల్లలకు ఏ విషయంలో అయినా తొలి గురువులు తల్లిదండ్రులే. బాల్యంలో బుడి బుడి అడుగులు వేయించినా.. పెరిగే క్రమంలో ఎలాంటి సందేహాలైనా ముందు పంచుకోవాల్సింది తల్లిదండ్రుల వద్దే. అమ్మానాన్న దగ్గర బిడియపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఎలాంటి సందేహాలైనా నిస్సంకోచంగా వెల్లడించవచ్చు. వాళ్లు తమ అనుభవాల నుంచి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి వీలవుతుంది అంటున్నారు నిపుణులు. ఎదుగుతున్న పిల్లల్లో శరీరంలో అనేక మార్పులు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో పిల్లలకు తల్లిదండ్రుల సపోర్టు చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు.

లైంగికపరమైన అవగాహన ఎదిగే పిల్లలకు అత్యవసరం. అది అవసరమైన దశలో అవగాహన కలిగించకపోతే పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. అందుకే తల్లిదండ్రులు ఎదిగే పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులది పర్యవేక్షణలా ఉండాలి తప్పా, నిఘా వేస్తున్నట్లు ఉండకూడదు.

అంతర్జాలం..
చేతిలోకి మొబైల్‌ వచ్చాక దానివల్ల ప్రయోజనాలు ఎన్నో, దుష్ప్రభావాలు కూడా అన్నే ఉన్నాయి. పిల్లలు ఫోన్ల ద్వారా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అలవాటుపడుతుంటారు. అందులో తప్పుదారి పట్టించే అంశాలు అనేకం ఉంటాయి. ఆ వయసు వారికి మంచి, చెడు విచక్షణ నేర్పవు. ఆసక్తితో వారు ఒకదాంట్లో నుంచి మరోదాంట్లోకి వెళ్లిపోతుంటారు. అదో అనంతం… అలా వాళ్లు చూసే క్రమంలో అశ్లీల చిత్రాలను చూడటం జరుగుతుంది. వాళ్లలోని ఆసక్తి.. మరింతగా వాటిని చూసేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా వాళ్లు అవగాహన లేమితో తప్పుడు మార్గంలో ప్రవేశిస్తారని అంటున్నారు నిపుణులు. తమకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందు తల్లిదండ్రుల వద్దే వ్యక్తపరచాలని చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారి సందేహాలు వ్యక్తం చేసేలా అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు.

చాటుమాటుగా..
స్నేహితులు తీసుకొచ్చే సెక్సు వీడియోలను పిల్లలు చాటుమాటుగా చూస్తున్నారంటే.. వాళ్లల్లో కలిగే హార్మోన్‌ ప్రభావాలు.. బోలెడు సందేహాలను కలిగిస్తాయి. దాంతో వాళ్లు స్నేహితులతో వాటిని పంచుకున్నప్పుడు.. ఇదిగో ఇలా సెక్సు వీడియోలు చూపిస్తుంటారు. వాళ్లు ఒకసారి వాటిని చూడటానికి అలవాటుపడ్డాక, ఆ ఊబిలో నుంచి బయటకు రావడం కష్టమవు తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అప్రమత్తంగా ఉండాలి. వారి ప్రవర్తనా సరళిని, మొబైల్‌లో ఏం చూస్తున్నారో పర్యవేక్షిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితుల్లా ఉండాల్సిన వయస్సు ఇదే. అప్పుడు పిల్లలు తమ సందేహాలను నిస్సంకోచంగా వ్యక్తపరుస్తారనేది నిపుణుల మాట. అప్పుడు ఈ చాటుమాటు వ్యవహారాల జోలికి పిల్లలు పోరు. అలాంటివి చూసే స్నేహితులను సరిజేసేందుకు కూడా వీరు సహాయపడగలరు.

చెడు స్నేహాలు..
వయసు పెరిగే క్రమంలో హార్మోన్ల ప్రభావంతో పిల్లలు అయోమయంలో ఉన్నప్పుడు చెడు స్నేహితులు పరిచయం అయితే.. వాళ్లు లంపెన్‌ గ్యాంగ్‌గా మారే ప్రమాదం ఉంది. వీళ్లు హోమో సెక్సువల్స్‌గా.. తమలో కలిగే భావోద్వేగాలను తీర్చుకునేందుకు ఇలాంటి పిల్లల్ని మాయమాటలతో మోసపుచ్చు తుంటారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు చేస్తుంటారు. అందుకే పిల్లల స్నేహాల విషయంలో కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారి స్నేహాలను బట్టి ఆలోచనా సరళిని అర్థం చేసుకోవచ్చు. మన పిల్లల్ని మనం గమనించుకోకపోతే, అంతా అయ్యాక వ్యాకులపడి ఉపయోగం లేదనేది నిపుణుల మాట. ఆదిలోనే ఇలాంటి చెడు స్నేహాలను తుంచేయాలి.

తల్లిదండ్రుల ప్రవర్తన..
కొందరు తల్లిదండ్రులు ఎదిగే పిల్లలు ఉన్నారనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటారు. వాళ్ల ముందే అతిగా వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న విచక్షణ కూడా ఉండదు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయనేది నిపుణుల మాట. అందుకే పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రులు వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాలు ఉండాలిగానీ, అన్నీ బాహాటంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎదిగే క్రమంలో ఇలాంటి వాటి పట్ల ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలనేది నిపుణుల హెచ్చరిక.

స్కూల్స్‌లోనూ చెప్పాలి..
పాఠశాల విద్యలో కూడా ఎదిగే పిల్లలకు సెక్సు ఎడ్యుకేషన్‌ బోధించాలి. ఏయే వయస్సులో ఎలాంటి మార్పులు శారీరకంగా వస్తాయనేది.. ఆ ప్రభావంతో మానసికంగా వచ్చే భావోద్వేగాలను కూడా పిల్లలకు చెప్పేలా స్కూల్స్‌ ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని నిపుణులు చెప్తున్నారు. ఇది కూడా ఒకరకంగా సైన్స్‌ లాంటిదే. పిల్లలు ఈ విషయంలో ఎలాంటి సందేహాలైనా ఆ బోధన సమయంలో వ్యక్తపరిచేలా, వాటిని నివృత్తిపరిచేలా మంచి బోధకులను ఏర్పాటు చేయాలి. దీనివల్ల కొందరు తల్లిదండ్రులు చెప్పలేని విషయాలు పిల్లలకు ఇక్కడ బోధపడతాయి. తద్వారా అవగాహన కలిగిన మంచి పౌరులుగా తయారవుతారనేది నిపుణులు చెప్తున్న మాట.

➡️