పిల్లల పాటలు సిరిమల్లెలు

Dec 1,2024 07:35 #book review, #Sneha

పిల్లలకు కథలన్న, పాటలన్న ఎంతో ఇష్టం. ఏదైనా విషయాన్ని పాట రూపంలోనో, కథ రూపంలోనో చెబితే అది పిల్లలకు ఎక్కువ అర్థమవుతుంది. అందుకే తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కందుకూరి భాస్కర్‌ గారు పిల్లల కొరకు ‘సిరి మల్లెలు’ పాటల పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో పాఠశాల పిల్లల కొరకు ఉపయోగపడే 18 పాటలు ఉన్నాయి. పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలలో ఈ పాటలు పాడుకోవడానికి వీలుగా ఉన్నాయి.
మొదటి పాటలో తెలంగాణ గొప్పతనం గురించి తెలిపారు. ‘కాకతీయ రుద్రమ్మ, చాకలి ఐలమ్మ వీర వనితల కన్న భూమి’ అంటూ ‘యాదగిరి నరసన్న ఏములాడ రాజన్న కరుణ చూపిన నేల..’ అంటూ తెలంగాణలోని ప్రముఖ విషయాలను వర్ణించారు. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్‌ 2 సందర్భంగా రాశారు. తరువాత ఉన్న పర్యావరణ పరిరక్షణ పాట ‘ప్లాస్టిక్‌ వాడొద్దు, చెట్లను పెంచాలి’ అని, ‘పంటలకు రసాయనాలు వాడొద్దు, సేంద్రీయ ఎరువులు వాడాలని, నీళ్లను ఎప్పుడూ పొదుపు చేయాలని చక్కని సందేశాన్ని ఇచ్చింది.
మూడవది తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు ఆచార్య జయశంకర్‌ గురించిన పాట ఉన్నది. ఆ తరువాత ఉన్న మన దేశం పాట గాంధీ, నెహ్రూ ఆశయాలను నేతాజీ, భగత్‌సింగ్‌ల ధైర్యమును, అంబేద్కర్‌ ఆలోచనను కలిగి ఉండాలని తెలుపుతూ దేశభక్తిని గురించి తెలియజేసింది.
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాసిన పాట ఉపాధ్యాయుడి గొప్పతనం గురించి తెలుపుతూ చక్కగా రాశారు.
మరొక పాటలో చదువుకుంటేనే సంస్కారం ఉంటుందని, చదువుతూనే గౌరవం ఉంటుందని విద్యార్థులకు చక్కని సూచన చేశారు. ఇలా ఈ పుస్తకంలో రాసిన పాటలన్నీ చాలా బాగున్నాయి.
‘సిరిమల్లెలు పాటల’ పుస్తకం విద్యార్థులను ఆకట్టుకునేలా ఉంది. పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఇందులో ఒక పాట ఉంది. విద్యార్థులు ఆ పాటను నేర్చుకొని చక్కగా పాడవచ్చు. నేను మా పాఠశాలలో ఈ పాటల్ని పాడాను. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఈ పుస్తకం ఉంటే పిల్లలకు ఉపయోగంగా ఉంటుంది. పిల్లలకు అర్ధమయ్యేలా పాటలు రాసిన భాస్కర్‌ సార్‌కి ధన్యవాదాలు.

– జి. అభిలాష్‌, 10వ తరగతి,
జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి,
పెద్దపల్లి జిల్లా. సెల్‌. 8019153752

ప్రతులకు..
రచయిత : కందుకూరి భాస్కర్‌
వెల : 45/-
ఫోన్‌ : 9441557188

➡️