పిల్లలు నడక నేర్చేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయుంటారు.. పడినా లేచి మళ్లీ మళ్లీ నడుస్తూ.. పడిపోతూనే ఉంటారు. అలాగే వాళ్లు ఏదో ఒకరోజు నడవడంలో తమ లక్ష్యాన్ని సాధిస్తారు. సాధించానన్న సంతోషం వాళ్లదైతే.. పిల్లలు నడుస్తున్నారనే ఆనందం తల్లిదండ్రులది. అదే ఎక్కడ పడిపోతారో అని నడవకుండా అడ్డుకుంటే.. వాళ్లెప్పటికి నడుస్తారు..? ఈ పాయింటు అన్నింటిలోనూ వర్తిస్తుంది. అది తెలిసి కూడా తల్లిదండ్రులు కొందరు ప్రతి చిన్న విషయానికీ వాళ్లు భయపడిపోయి, పిల్లల్నీ భయభ్రాంతులకు గురిచేస్తారు. అంతేకాదు.. వాళ్లని పిరికివాళ్లుగా తయారుచేస్తున్నారు.. ఇది సరికాదంటున్నారు నిపుణులు. అలా చేయకుండా ఏం చేయాలో పేరెంట్స్‌కు వారు కొన్ని సూచనలు చేస్తున్నారు.
సందీప్ తల్లి ‘పచ్చిమిర్చి లేవు.. ఇప్పుడెలా?’ అని ఆందోళపడుతోంది. ‘అమ్మా డోంట్ వర్రీ.. నేను వెళ్లి షాపులో తెస్తాను.. డబ్బులు ఇలా ఇవ్వు’ అంటూ హడావిడి చేస్తున్నాడు సందీప్.. ‘రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్.. షాపులో ఎలా తేవాలో నీకు తెలియదు..’ అంటూ తల్లి అడ్డుకోవడం సందీప్‌కి నచ్చలేదు. తన డిబ్బీలో డబ్బులు తీసుకుని దగ్గరలోని కూరగాయల షాపుకు వెళ్లి పచ్చిమిర్చి తెచ్చి, వాళ్లమ్మ చేతిలో పెట్టాడు. అంతే సందీప్ తల్లి వండర్ అయిపోయింది.
‘పక్కవీధిలో సుమ దగ్గర నోట్‌బుక్ తీసుకొచ్చుకుంటాను!’ అంటూ ప్రసన్న తల్లిని అడుగుతోంది. ‘నాన్న వచ్చాక తీసికెళ్తారులే! ఆ దారిలో కుక్కలు ఉంటాయి. నీకు 12 ఏళ్లొచ్చాయి.. ఆడపిల్లవి.. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దు..’ అంటుంటే.. ‘చిన్నపిల్లని కాదంటావు.. ఒక్కదాన్నే వెళ్లొద్దంటావు.. ఏంటమ్మా?’ అని ప్రసన్న గట్టిగా నిలదీసింది. అయినా తల్లి ఒప్పుకోలేదు. ప్రసన్న అలిగి పడుకుంది.
ఇలా తల్లిదండ్రులు తమ భయాల్ని పిల్లలపై రుద్దుతారు. వాళ్లు ఎంత బతిమిలాడినా ససేమిరా అంటారు. ఇది వాళ్లని అడుగు ముందుకు వేయనీయకుండా చేయడమేనని నిపుణులు అంటున్నారు.
నేర్చుకోనివ్వండి..
సైకిల్ తొక్కుతా కొనమని పిల్లలు పట్టుబడతారు. ‘వేలెడంత లేవు.. నీకు సైకిల్ ఎందుకు? పడ్డావంటే కాళ్లూచేతులూ విరుగుతాయి!’ అంటూ కొనడానికి ఇష్టపడరు కొందరు తల్లిదండ్రులు. మరికొందరు తల్లిదండ్రులు సైకిల్ కొన్నా.. వాళ్లే నడిపించేస్తుంటారు. ‘కొంచెం పెద్దయ్యాక బడికి సైకిల్‌పై వెళుదువు’ అంటూ సైకిల్ తొక్కనివ్వరు. ఇంకొందరు స్కూల్‌కి సైకిల్‌పైనే వెళతానని పిల్లలు అడిగితే.. ‘ఇప్పుడు ఆటోలో వెళ్తున్నావు. ట్రాఫిక్‌లో రిస్క్ అవసరమా? సేఫ్‌గా ఉండాలి!’ అని ఒప్పుకోరు.
పిల్లల్నీ ఇలా భయపెట్టేస్తే ఆ పిల్లలు సైకిల్ ఎప్పటికీ నేర్చుకోలేరు. ‘ఇలా భయపడే వీళ్లంతా అసలు ఒక్కసారైనా కింద పడకుండా సైకిల్ నేర్చుకున్నారా?’ అని అడిగితే.. లేదనే చెప్తారు. మరిప్పుడు పిల్లల్ని ఇలా భయపెట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలకు సైకిల్ తొక్కడంలో మెళకువలు నేర్పాలి. పడిపోకుండా నడపడానికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఒకవేళ పడినా.. దెబ్బలకు మందు రాసి, తగ్గాక మళ్లీ సైకిల్ ఎక్కించాలని చెప్తున్నారు నిపుణులు.
ఒంటరిగా..
పిల్లలు కాస్త పెద్దయ్యాక ఒంటరిగా వెళ్లనివ్వండి.. అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే వెంటుండి తీసికెళ్లాలని అనుకోవద్దు.. దగ్గరలోని బంధువుల ఇంటికి వెళ్లాలన్నా.. ఏదైనా షాపుకు వెళ్లాలన్నా.. వెళ్లనివ్వండి. ఏదైనా అత్యవసరమై మీరు ఊరు వెళ్లాల్సి వస్తే.. పిల్లలు ఒక్కళ్లే ఉంటే ఎలా? అనే
ఆలోచనలు చేయొద్దంటున్నారు నిపుణులు. ఒంటరిగా ఇంట్లో ఉండగలిగేలా వాళ్లని సిద్ధం చేయాలని చెప్తున్నారు. అవసరమైనప్పుడు ఒంటరిగా ఉండటమూ పిల్లలకు అలవాటు కావాలంటున్నారు. పిల్లల్ని సంసిద్ధం చేయడానికి ఇలాంటి పరిస్థితుల్ని కల్పించి మరీ బంధువుల, స్నేహితుల ఇళ్లకి పంపాలని చెప్తున్నారు. ఒంటరిగా ఉంచడం ధైర్యాన్నిస్తే, వేరే వాళ్ల ఇంటిలో ఉండటం అనుబంధాలను పెంచుతుందని అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని పనులు అప్పగించి, ఎలా చేయాలో చెప్పి చూడండి. చిన్న చిన్న సమస్యలొచ్చినా.. పిల్లలు త్వరగానే అలవాటవుతారు. తల్లిదండ్రుల గారాబం.. గాబరాతో పిల్లల్ని అశక్తుల్ని చేయొద్దనేది నిపుణుల సూచన.
బొమ్మరిల్లు పేరెంటింగ్ వద్దు..
కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఎవరితో స్నేహం చేయాలో కూడా చెప్తుంటారు. పిల్లలు వాళ్ల అభిరుచులకు, ఆసక్తతలు, అనుబంధాలను బట్టి కొందరితో స్నేహాలు ఏర్పర్చుకుంటారు. తల్లిదండ్రులు వాళ్లల్లో ఉన్న బలహీనతలను పిల్లలపై రుద్దుతారు. తాము పాటించే మూఢత్వం తప్పని తెలిసినా.. అదే తామూ ఆచరిస్తూ, పిల్లలకు నేర్పిస్తారు. ఫలితంగా వివక్ష, మూఢత్వంతో పిల్లలు ఎదుగుతారు. దీనివల్ల పిల్లలకు స్వయంగా జరిగే నష్టం కాకుండా, సమాజానికీ తీరని నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిత్యజీవితంలో సైన్స్ ఒక భాగం. అందుకని మన ఆలోచనలు కూడా శాస్త్రీయంగా ఉంటేనే మనమైనా, సమాజమైనా ముందుకు వెళ్తుంది..
అలాగే కొందరు తల్లిదండ్రులు అసలు పిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైనవి చెప్పరు. పిల్లలు పెద్దవాళ్లని మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కొందరు తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అది తగని పని అని మందలించాలి. అంతేగానీ పిల్లల్ని ఇలాంటి విషయాల్లో వాళ్ల ఇష్టానికి వదిలేయవద్దు. ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! కథల ద్వారా కూడా వాళ్లకర్థమయ్యేలా చెప్పాలి అంటున్నారు నిపుణులు.