పట్టాభిషేకం

Feb 2,2025 10:45 #Coronation, #Sneha

‘అమ్మా! అమ్మా! ఇవాళ యువరాజుల వారికి పట్టాభిషేకమట కదా! చూడడానికి వెళదామా? నన్నూ తీసుకువెళ్ళు.’ గారంగా అడిగాడు పదేళ్ళ నందు.
‘తప్పకుండా. ఊరంతా పండుగే. ఆ వేడుక నువ్వూ చూద్దువుగానీ. నా చెయ్యి పట్టుకునే ఉండాలి మరి. రద్దీలో తప్పిపోకుండా.’ అంది అమ్మ. అలాగేనంటూ ఒప్పుకుని ఉత్సాహంగా వెళ్ళి యువరాజు పట్టాభిషేక మహోత్సవాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు నందు. ఆ రోజు ఆ వైభవం, మణిమయ కిరీట ధారణ, ప్రజలంతా యువరాజుపై కురిపించిన పూలవర్షం, ఏనుగు అంబారీపై ఊరేగడం అన్నీ చూసి సంబరపడిపోయాడు. విందు భోజనం తిని, ఇంటికి వెళ్ళే దారంతా అదే తలుచుకుంటూ ఉప్పొంగిపోతూ నడిచాడు.
ఆ రాత్రి అమ్మ పక్కన పడుకుని, నడుము చుట్టూ చేతులు వేసి ‘అమ్మా! నాకూ పట్టాభిషేకం చేయవూ!’ అనడిగాడు గారంగా. తల్లి నవ్వుకుంది. మురిపెంగా ముద్దు పెట్టుకుంది. జో కొట్టి నిద్రపుచ్చింది.
నిద్రలో తనకు పట్టాభిషేకం జరిగినట్లు కలకన్నాడు నందు. తెల్లవారి లేచాక బడికి బయలుదేరుతుండగా తండ్రి స్నేహితులు ఇంటికి వచ్చారు. వారు తండ్రితో మాట్లాడడం విన్నాడు.
‘నిన్న పట్టాభిషేకం అయిందో లేదో రాజావారు వెంటనే బాధ్యతలు స్వీకరించారు. అడవి సరిహద్దులలో పులుల దాడికి బలవుతున్న చిన్నారులను, పాడి పశువులను కాపాడడానికి పరివారంతో ఉదయం వేటకు స్వయంగా వెళ్ళారటఊ’ అని ఒకాయన అన్నారు.
‘వచ్చిన తరువాత క్రూరుడైన పొరుగు రాజు మన దేశాన్ని ఆక్రమించకుండా తానే యుద్ధం ప్రకటిస్తాడుఊ’ అని అన్నాడు మరొకాయన.
‘రాజ్య రక్షణ రాజు బాధ్యత. ఆయనకు సహకరించడం మన కర్తవ్యం. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం..!’ అన్నాడు మరొక స్నేహితుడు.
‘ఓహో! పట్టాభిషేకం అంటే పూలవాన, ఏనుగు అంబారీ కాదన్నమాట. ప్రాణాలకు తెగించవలసిన గొప్ప బాధ్యత!’ అని మనసులో అనుకున్నాడు నందు.
బాగా చదువుకుని మంచి పౌరుడిగా మారాలనే సంకల్పంతో సంతోషంగా బడిబాట పట్టాడు.

➡️