‘ఆహా!. ఓహో!..అద్భుతం!. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే సాహసాలు. మనసుదోచే విన్యాసాలు. చూస్తేనే ఆ అద్భుతం ఏమిటో అనుభవంలోకి వచ్చేది. ఎంత వర్ణించినా మతి భ్రమింపజేసే దృశ్యాన్ని కనుల ముందుకు తీసుకురాలేం…’ తిరుపతిలో ఇటీవల మంగాపురం రోడ్డు పక్కన ఉన్న మైదానంలో ఆంధ్ర సర్కస్ ఏర్పాటు చేశారు. చిన్న మామయ్యతో వెళ్లి ఆ సర్కస్ చూసి వచ్చిన దీపేంద్ర- ఫోన్ గ్రూపులో మిగతావారితో చెబుతున్నాడు.
గ్రూపులో మిగతావారు దినేష్, దినకర్, ధీరేంద్ర, ధీరజ్. దీపేంద్రతో సహా ఐదుగురు స్నేహితులు. వాళ్లు రామచంద్రపురం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇటీవల కాలంలో కాలాన్ని వృథా చేస్తూ చదువుపై శ్రద్ధ తగ్గుతూ ఉంది. అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్లకుండా, మామిడితోటలో ఆటలాడుతున్నారు. ఊరు చెరువులో ఈత కొడుతూ, సినిమాలకు వెళ్లడం లాంటి అల్లరి పనులకు పాల్పడుతున్నారు. దీపేంద్ర మాటలకు అందరూ మద్దతు తెలుపుతున్నారు. ఒకరోజు వారికి ఎలాగైనా తిరుపతికి వెళ్లి ఆంధ్ర సర్కస్ చూసి రావాలి.. అన్న ఆశ కలిగింది.
తిరుపతి వెళ్లిరావాలంటే ఒక్కొక్కరికి రానూపోనూ 300 రూపాయలు ఖర్చవుతుంది. సర్కస్ టిక్కెట్టు ఒక్కొక్కటి 300. ఆటోలకు 100 ఇలా చాలా ఖర్చుతో కూడినపని. అంత డబ్బు ఖర్చుపెట్టగలిగే స్తోమత ఆ పిల్లల్లో ఎవరికీ లేదు. కానీ దినేష్ అందరి ఖర్చూ తాను భరించగలనని హామీ ఇచ్చాడు. దినేష్ తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళు. తల్లిదండ్రులు లేని సమయం చూసి బీరువాలో నగదు పెట్టె అరలో డబ్బు దొంగలించాడు దినేష్. కానీ ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోనని అతనిలో భయం మొదలైంది.
పిల్లలు వెళ్లాలనుకున్న రోజు రానే వచ్చింది. గుండెల్లో గూడుకట్టుకున్న భయం కారణంగా ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆ రోజు త్వరగా నిద్ర లేవవలసిన వాడు, ఇంకా నిద్ర లేవలేదు. తల్లి సుజాత దినేష్‌ను నిద్ర లేపి ‘త్వరగా స్నానాలు టిఫినులు ముగించి రెడీ అవ్వు. అందరూ కారు ఎక్కేశారు. బయలుదేరడానికి సిద్ధంగా ఉంది’ అంది. అప్పటికే తండ్రి రఘురాం, తమ్ముడు, చెల్లెలు కారులో కూర్చుని ఉన్నారు. తల్లి సుజాత- కొడుకు దినేష్‌ను దగ్గరుండి రెడీ చేసింది. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. తామంతా ఎక్కడికి వెళుతున్నామో దినేష్‌కు అర్థంకాలేదు. ఆ రోజు తమ పథకం అమలు చేసే వీలులేకుండా పోయిందే అనుకుంటూ ఉండగా..
ఆ కారు నేరుగా వెళ్లి తిరుపతిలోని ఆంధ్ర సర్కస్ ప్రదర్శించే టెంట్ ముందు ఆగింది. దినేష్ ఆశ్చర్యానికి అంతే లేదు. అదే సమయంలో ఆంధ్ర సర్కస్ మొదటి షోకి, టిక్కెట్లు ఇస్తున్నారు. ‘దినేష్ నువ్వు వెళ్లి మనందరికీ టిక్కెట్లను తీసుకుని రా, నీ దగ్గర 5000 ఉన్నాయి కదా!’ అన్నాడు నాన్న.
అప్పటికి అర్థమైంది. తాను డబ్బులు దొంగతనం చేసిన విషయం ఇంట్లో తెలిసిందని. ఇక రహస్యం దాచి లాభం లేదని ‘నన్ను క్షమించు నాన్న! ఇకముందు ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను!’ అంటూ ప్రాధేయపడ్డాడు.
దినేష్ వాళ్ళ క్లాస్ టీచర్ ప్రసాద్‌బాబు చాలా బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు. దినేష్ స్నేహితులు ఐదుగురు. అప్పుడప్పుడు స్కూలుకు నామం పెట్టి, బయట తిరుగుతుంటే ఆ ఉపాధ్యాయుడికి బాధ కలిగింది. వాళ్లు బడి విడిచి వెళ్లి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఏమేం చేస్తున్నారు? కనుక్కొని రమ్మని తన క్లాసులోని ఒక విద్యార్థిని రహస్యంగా పంపించారు. మామిడి తోపులో ఆ అబ్బాయి ‘డి’ గ్రూప్ స్టూడెంట్స్ మాటలని విన్నాడు. సర్కస్‌కి వెళ్లాలన్న వారి ఆలోచనని క్లాస్ టీచర్ ప్రసాద్‌బాబుకి చేరవేశాడు. ప్రసాద్ బాబు- దినేష్ తండ్రి రఘురాముని స్కూలుకు పిలిపించాడు. దినేష్, తోటిపిల్లలతో కలిసి చేస్తున్న పనులు చెప్పారు.
‘కొందరు తల్లిదండ్రులు అందరికన్నా తమ పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని, చదువు తప్ప వేరే వ్యాపకం లేకుండా కట్టడి చేస్తుంటారు. శరీరానికి వ్యాయామాన్ని అందించే ఆటలని ఆడుకోనివ్వరు. మనసుకు వినోదాన్ని, ఉల్లాసాన్ని అందించే సినిమాలకు దూరం పెడతారు. అలా కట్టడి చేస్తే అవి పొందాలని ఆకాంక్షతో ఈ వయసు పిల్లలు దారి తప్పే ప్రమాదం ఉంది. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక మీ కుమారుడిని ఎలా బాగు చేసుకుంటారో మీ ఇష్టం.’ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు.
రఘురాం కూడా దినేష్ పట్ల కఠినంగా వ్యవహరించేవాడు. ప్రసాద్‌బాబు చెప్పిన తర్వాత తనను తాను సరిదిద్దుకున్నాడు. దినేష్ ఆకాంక్ష ప్రకారం కుటుంబం అంతా కలిసి ఆంధ్ర సర్కస్‌కు తీసుకువచ్చాడు. ఆ రోజు దినేష్ చాలా సంతోషపడ్డాడు. ఆ సంఘటన తర్వాత మళ్లీ దొంగతనంగానీ, చెప్పకుండా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడంగానీ చేయలేదు.
– గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు
6302099718