నేడు గడిచి రేపు పొద్దు పొడిచినట్టు. అంబా అంటూ అరిసే తువ్వాయి కొన్నేళ్లకు పాలిచ్చే ఆవుగా మారినట్టు, లేలేత చివుళ్లతో తలెత్తిన మామిడిమొక్క మహావృక్షంగా ఎదిగినట్టు, చిన్ని చిన్ని చినుకుల ఏకధార బుల్లి కాలువై, వేగ ప్రవాహాల వెల్లువై సాగినట్టు .. ప్రకృతిలోని ప్రతిదీ నిరంతరంగా మారుతూనే ఉంటుంది. కొన్ని కొత్తగా పుట్టుకొస్తాయి. కొన్ని పాతగిల్లి కాలగర్భంలో కలసిపోతాయి. పండగలూ అంతే! పండగల్లోని సందళ్ల స్వరూపాలూ అంతే! మన ఊళ్లూ, మన వ్యాపకాలూ, వ్యవహారాలూ కాలానికి అనుగుణంగా మారినట్టే.. మన పండగల రూపురేఖలూ మారుతూ వస్తున్నాయి. ప్రకృతిలో మారకుండా ఏదీ ఉండదు; మార్పు అనే ప్రక్రియ ఒక్కటీ తప్ప. మారిన క్రమంలో సంక్రాంతి పండగ సందళ్లను, ఆయా కాలాల్లోని మనుషుల సందోహాల ఉరవడినీ పరిచయం చేయటమే ఈ వారం అట్టమీది కథ. పదండి.. పండగ కాలాల్లోకి.. సందళ్ల సమూహాల్లోకి.
కాలం ఏదైనా, కథలు చెప్పే కారణాలేమైనా.. మనుషులు కలగలిసి సాగటమే పండగ. ఆటపాటలతో, ఆప్యాయతా మాటలతో అందరూ ఒకచోట చేరి పల్లవించటమే పర్వదినం. మనుషులు లేకుండా, మనుషులు భాగస్వామ్యం వహించకుండా ఏ పండగా జరగదు. ఏ సందడీ ఉండదు. తంతులూ తతంగాలూ, ఆరాధనా పద్ధతులు, రకరకాల ఆలంబనలూ అన్నీ మనుషులతో కూడినవే! ఆయా కాలాల్లోని ఆడామగా, పిల్లా పాపా, ముసలీ ముతకా అందరూ మమేకమై సందడై రవళించటమే సంబరం. ఈ సంబరాల్లో ఒక్కో కాలానికి ఒక్కో వైభవం. పరిస్థితులను బట్టే పర్వదినం.
1925
ఇప్పటి ఆధునికత కొంతమాత్రం కూడా సోకని పల్లెల సముదాయం ఆనాటి దేశం. పరాయి పాలన సాగుతూనే ఉంది. వానొస్తేనే నీరు, చెరువులే సాగునీటి ఆదరువు. పంటలు, దిగుబడులు అంతంతమాత్రం. కాయకష్టమ్మీదనే ప్రతి పనీ సాగే కాలం. మధ్యాహ్నం వేళకి ఇంటిల్లిపాదికీ ఇంత అన్నం వండి వార్చాలంటే – జొన్నలో, సజ్జలో నలుగురైదుగురు దంచి, సిద్ధం చేయాల్సిందే! ఒక దిబ్బరొట్టో, తునకం అట్టో సిద్ధం చేయాలంటే- రుబ్బురోలు ముందు కూచొని, కాయకష్టం చేయాల్సిందే!
అలాంటి కాలాన సంక్రాంతి పండగ వస్తుందంటే- నిండా నెల రోజుల పని. ఇంటి నిండా మనుషులు ఉంటే తప్ప పనులు సాగవు. కడివెడు నీళ్లు కావాలన్నా ఏటికో, చెరువుకో పరుగెత్తాలి. మట్టిగోడలను అందంగా మెత్తుకోవాలంటే- చెరువు కింది మట్టిని తట్టల్లోనో, గంపల్లోనో నెత్తిన మోసుకురావాలి. ప్రతిచోటా ప్రతి పనిలో మనిషికి మరొక మనిషి సాయం కచ్చితంగా అవసరం. మట్టిని తవ్వడం, తట్టను నెత్తిన ఎత్తుకోవటం మరొకరి చేతి సాయం లేకపోతే సాధ్యమయ్యే పనులు కావు.
”బుల్లమ్మత్తా, ఎరుకులమ్మ వదినా, నాగేంద్రమ్మ, నాయురాలమ్మ .. రండి రండి..” అని అందరినీ హుషారుగా కదిలించే అమ్మాజమ్మలు వీధికొకరైనా ఉండేవారు. గుంపులు గుంపులుగా కదిలి వెళ్లటంతోనే పండగ సందడికి ఆరంభం. చెరువు గట్టు కిందికి, ఊరిలోని ఇంటికీ అనేక వేల అడుగులు పడితేనే ఇంటిముందు ఒక మట్టికుప్ప. దానిని తగినంతగా నానేయటం, ఇంటి చుట్టూ ఉన్న అరుగులను గోకి, కొత్త మట్టితో మెత్తటం ఒక కళాత్మక శ్రమ. మట్టి గోడలు ఆరాక, పేడతో అలికితే అదొక అందం. అరుగులకు ఎర్రమట్టి పూసి, నానబెట్టిన నాముతో ముగ్గులను అద్దటం అందానికే అందం! కనీసంలో కనీసం పదిరోజుల నిరంతర శ్రమతో ఈ పని పూర్తవుతుంది.
తరువాత ఇంటిలోని కంచుపాత్రలను వాకిలిలో పడేసి, అణువణువూ తోమటం ఒక మూకుమ్మడి ప్రక్రియ. చాలా ఇళ్లల్లో ఇంటిలోపలా, బయటా పేడతో అలకటం ఒక్కటే పండగ శుభ్రత. పొద్దున్నే వాకిళ్లకు కళ్లాపి చల్లి, రాతి పిండితో ముగ్గులు వేయడం గొప్ప అలంకరణ.
జానపద కళాకారులకు కొదవ లేని కాలం. ప్రతిరోజూ గంగిరెద్దుల విన్యాసాలో, హరిదాసు కీర్తనలో, కొమ్ము దాసరి కబుర్ల వినోదమో సాగుతూనే ఉంటాయి. వాళ్లంతా పండగను పదే పదే గుర్తు చేసే ప్రచారకులు. సందడిని అంతకంతకు పెంచి, అందరికీ పంచే సాంస్క ృతిక వారథులు. పండిన పంటలో నుంచి తీసి, కొంగెడు ధాన్యం చేట కొస నుంచి వొంపితే చాలు; పరమానంద భరితులవుతారు. అప్పుడు దాదాపు ఏ ఊరికి ఆ ఊరే స్వయంపోషకం. ఊరందరి అవసరాలను ఊరే తీరుస్తుంది. చేనేత చలమయ్య ఇంట తీరిక లేకుండా మగ్గం నడుస్తూనే ఉంటుంది. పండక్కి సింగారించే కోకలు, పంచెలు, తువ్వాళ్లు తయారవుతుంటాయి. దాదాపుగా సగం బట్టలకు కుట్టు అవసరం లేకుండానే ధరించే రోజులు! నడుముకు పంచె కట్టి, భుజం మీద కొత్త తువ్వాలు వేస్తే- చాలా ఇళ్లల్లో పురుషుల పండగ వస్త్రధారణ జరిగిపోయినట్టే! మహిళలు ధరించే చీరలకు నాలుగో, ఐదో ఏకరూప సహజ రంగులు.
పండక్కి ఊరి సాంస్కృతిక సందడిని ఊరే సమకూర్చుకుంటుంది. వ్యవసాయ పనులు అయిపోయాక, దీపాలు పెట్టే వేళలో ఏ పెద్దాయన సమక్షంలోనో యువకులంతా చెక్కభజన, చెట్టుభజన, కోలాటం వంటివి నేర్చుకోవటం మహా సరదా వ్యాపకం. అప్పుడప్పుడే ఉనికిలోకి వచ్చిన హరిశ్చంద్ర పద్యాలను గొంతెత్తి పాడడం గొప్ప ఆకర్షక మంత్రం. నీలాటి రేవు కాడ, చేనేతల ఇళ్ల వద్ద పండగ కబుర్లు అల్లనల్లన నడుస్తూ ఉంటాయి. అత్తింటి అలంకరణ పనులన్నీ పూర్తయితే గానీ, కొత్త కోడలికి పక్కూరిలోని అమ్మ గారింట్లో అడుగు పెట్టడం సాధ్యం కాదు. అన్నో, నాన్నో వచ్చి ఆదరంగా వెంటబెట్టుకు వెళుతుంటే అదో హృదయానంద సన్నివేశం. ఊళ్లకు వెళ్లేవారితో, వచ్చేవారితో పండగ శోభ తోవల నిండా అలముకొని ఉండేది. ఎంత దూరమైనా కాళ్ల నడక. ఎదురుపడ్డ ప్రతి మనిషినీ పలకరించటమే! కష్టసుఖాలు కలవరించటమే! మనిషి మనిషినీ ఆరా తీయటమే!
పండగంటే పనిపాటుల సందడి. పండగంటే ఊరందరి ఆటపాటల కలబోత. ప్రతి చిన్ని రాగాన్ని, ప్రతి చిన్ని వినోదాన్ని మనసారా ఆస్వాదించే మనుషుల కాలం. ఏ వీధిన చూసినా తండోపతండాల జనం. పంటలను, ఫలసాయాలను పరస్పరం పంచుకొని, ఇంత పప్పు, కొంత గుమ్మడికాయ కూర, పెరట్లో కాసిన చిక్కుడుకాయలు.. అలా ఆ కాలాన పండే కూరగాయలతో పులుసూ వండుకుంటే- పండగ విందు సిద్ధం అయినట్టే! అరిసెలు, పోకుండలు వండేస్తే పిండివంటలు అయినట్టే! పండగ వేళ తాడిపెద్దు ఊరేగింపు, పెద్ద పెద్ద తాళాలతో పాటల మోహరింపు, తాటాకుల పందిరి కింద ఊరి జనం గుంపు .. అంతే! అదే పండగ. అదే సందడి. ఊరి జనమంతా ఊరినే అట్టి పెట్టుకొని ఉన్న రోజులు. నాలుగైదు ఊళ్లకు మించి వేరే ప్రయాణాలే అక్కర్లేని రోజులు. ఉన్న దానిలోనే తిని పనిపాటులే పరమార్థంగా బతికిన కాలాలు. ఏ ఒక్కరో సమీప పట్టణాలకు వెళ్లొచ్చి, గాంధీని చూశాననో, ప్రదర్శనల్లో పాల్గొన్నాననో చెబితే, ఊరు ఊరంతా ఒక్క చెవై అపురూపంగా విన్న సందర్భాలు..
అప్పటి సంక్రాంతిలో దేవుళ్లు లేరు. పూజలు లేవు. సంక్రాంతి అంటే గతించి పోయిన పెద్దలకు మూలన బట్టలు పెట్టే సందర్భం. ఏ దేవుడి పటాలూ లేని నట్టింటి మూలన నాలుగు ఆకులు వేసి, అన్నం వగైరాలు వడ్డించి, ఆనక పిల్లలూ పెద్దలూ కలిసి భుజించే సన్నివేశం. సంక్రాంతి అంటే నూటికి నూరుపాళ్లూ వ్యవసాయ పండగ. పాడిపంటల పండగ. పెద్దలను తలచుకునే పండగ. వ్యవసాయంలో సాయపడిన అన్ని చేతివృత్తుల వారిని, పశుసంపదనీ గౌరవించుకునే పండగ.
1975
ఊరికి, పక్కనున్న పట్టణానికి సంబంధాలు అల్లుకున్న కాలం. ఆ పట్టణం జూట్‌మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్న రామకృష్ణయ్య అత్తారింటికి సైకిలు మీద రావటమే గొప్ప విశేషం. చేతికి వాచీ ఉన్నా, ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలు చూసొచ్చినా – ఊళ్లో పొందే మర్యాద ఇంతా అంతా కాదు. నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోవటం, ఉత్తరాలు రాయడం, చదవడం, వీధి అరుగు మీద కూర్చొని పుస్తకం చదివి వినిపించటం.. వ్యాపకాల్లోకెల్లా అత్యుత్తమ వ్యాపకం. ఎంతోకొంత చదువుకున్న యువకులు గ్రామాల్లో తయారు కావడంతో వ్యవసాయ పనుల్లో ఉన్న యువకులు కూడా వారి చుట్టూ చేరేవారు. ఎక్కడో పట్టణాల్లో వేస్తున్న సాంఘిక, పౌరాణిక నాటకాలను తమ ఊళ్లో తామే స్వయంగా ప్రదర్శించాలని ఉవ్విళ్లూరేవారు. పద్యాలు నేర్చుకోవడం, హార్మోనియం వాయించటం, సంక్రాంతి రోజునో, మర్నాడో ఊళ్లో నాటకం ప్రదర్శించటం ఎంతో ప్రతిష్టాత్మకం. భజనలు, కోలాటాలు వంటి పాత కళలు సాగుతుండగానే నాటకాలు వాటికి కొత్త చేర్పు. తొలుత పౌరాణికంలో ప్రారంభమై, తరువాత సాంఘిక నాటక ప్రదర్శనలుగా పరిణామం చెందాయి. ఏది పాడినా, ఆడినా, ప్రదర్శించినా ఆ ఊరి యువతీ యువకులే భాగస్వాములు. ఒక్కసారి కళా ప్రదర్శన చేస్తే- అది పదేళ్ల ప్రస్తావనగా మిగిలిపోయేది.
అదే సందర్భంగా నెమ్మది నెమ్మదిగా సినిమా వినోదం పెరిగింది. సంక్రాంతికి పోటాపోటీగా సినిమాలు విడుదలయ్యేవి. ఊరి నుంచి ఎడ్లబళ్లు జనంతో పట్టణానికి వరుస కట్టేవి. ఒకటో ఆట ఎన్టీఆర్‌ది చూస్తే, రెండో ఆట ఎఎన్నార్‌ది. ఎవరు ఏ సినిమా చూసినా ఆ తరువాతి రోజు ఊరి నిండా అవే ముచ్చట్లు! జమున, సావిత్రి చీరకట్టులు; రామారావు, నాగేశ్వరరావు తలకట్టులు అనుకరించటం, అనుసరించటం కొత్తదనానికి నాంది.
సంక్రాంతి వంటల్లో కొత్తకొత్తవి వచ్చి చేరాయి. జంతికలు, మురిపీలు, గోరుమీటీలు, కొబ్బరిబూరెలు, గవ్వలు, వెన్నప్పాలు వంటివి ఊరంతా గుబాళించాయి. నేర్పు తెలిసిన అమ్మలు ఊరందరికీ వంట పాఠాలు బోధించటం ఒక గొప్ప దృశ్యం. ”వదినా, అరిసెల పాకం చూసి వెళతావా?”, ”పెద్దమ్మలూ, ఒకసారి జంతికల గొట్టాలు ఇస్తావా?” అంటూ ఒకరి సాయం ఒకరు తీసుకోవడం పండగల వేళకు పరిమళం అద్దటమే! కొత్త కోడళ్ల ద్వారా, కొత్త ఊళ్ల నుంచి బంధుత్వాల ద్వారా కొత్తరకం నగలు, వంటలు ఊళ్లలోకి వచ్చి వాలేవి. కాకినాడ నుంచి అమ్మాజీ కోడలొచ్చినా, విజయనగరం నుంచి నాగరత్నం వలస వచ్చినా ఊరి సంస్క ృతికి కొత్త చేర్పు చేకూరినట్టే! ప్రతి కొత్తను ఆహ్వానించటం, ఆస్వాదించటం ఊరికి ఒక అలవాటుగా మారింది. మట్టి కుండలు, దాకలు రంగం నుంచి తప్పిపోయి, స్టీలు, అల్యూమినియం పాత్రలు వచ్చాయి. పండగ వేళల్లో అమ్మల శ్రమ ఎప్పటిలాగానే ఉన్నా కొంత వెసులుబాటు చేకూరింది. మట్టి నేలలు పోయి గచ్చులు మొదలయ్యాయి. పేడ అలుకుళ్లు తగ్గి, నీటితో కడిగేసి, నామ్ముక్కతో ముగ్గులు పెట్టేయగలగటం గొప్ప సులభం అనిపించింది.
సంక్రాంతికి తీర్థాలు మొదలయ్యాయి. రంగు కాగితాల కళ్లద్దాలు, బూరలు, ప్లాస్లిక్ ఆట వస్తువులు కొలువు తీరాయి. పది పైసలో, పావలానో వెచ్చిస్తే పిల్లల జేబుల నిండా జీళ్లు! కౌమార దశ మగపిల్లలు చొక్కాలూ, పొట్టి ప్యాంటులూ వేసుకొని, ఆడపిల్లలు లంగాలూ వోణీలూ వేసుకొని వీధుల్లో తిరగటమే పెద్ద పండగలా కనిపించేది. అల్లుడూ కూతురు సైకిలు మీద పండక్కి వస్తుంటే చూసి తెగ మురిసిపోయేది మాణిక్యం అత్త. పండగ రోజు భజనల సంబరం, కనుమ రోజున తీర్థం, ఆ తరువాతి రోజు టూరింగు టాకీసులో సినిమా .. అంతే! జీవితం ధన్యమైపోయినట్టే! పండగ పరమార్థం పూర్తయినట్టే!
2025
సంక్రాంతి పనులు మొదలెట్టటానికి ఒకప్పుడు నెల గంట పెట్టటం కొండ గుర్తు. ఇప్పుడు అలాంటి గంటలతో సంబంధం లేదు. పండగ నెలా రెండు నెలలు ఉందనగానే – వస్త్ర దుకాణాలు, నగల షాపులు, ఈ కామర్స్ మార్టులూ ఆఫర్ల నగారా మోగిస్తున్నాయి. ”వచ్చేస్తోంది పండగ.. కొనుగోళ్లు మొదలెట్టండి” అంటూ అమ్మకాల పాట మొదలవుతోంది.
అప్పుడు పట్టణాలూ, నగరాలూ తాము పుట్టిన పల్లెల గురించి కలవరించటం మొదలెడతాయి. అమ్మకు ఎలాంటి చీర కొనాలి? చెల్లికి ఈసారి ఎలాంటి కానుక ఇవ్వాలి? అసలు ఊళ్లో ఎన్ని రోజులు ఉండాలి? ప్రయాణం ఎలా చేయాలి? వంటి ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. సర్వ సామగ్రి పట్టణం నుంచే ఊరికి తరలి వెళుతుంది. నగరాల్లో పుట్టి, పెరుగుతున్న పిల్లలకు ఊళ్లోని ప్రతి ఒక్కటీ కొత్తదే! అమ్మమ్మో, తాతయ్యో ఊరి భాషలో వివరించి చెప్పాల్సిందే! మిల్క్‌ని పాలు అంటారని, రైస్ పొలంలో పండుతాయని, సుగర్ కేన్ అనే మాటకు చెరకు గడ అని అర్థమని చెప్పాల్సి వస్తోంది. మన ఊరికి, మనుషులకు మధ్య పెరిగిన దూరానికి ఈ తరహా సంభాషణ ఒక సాక్ష్యం. కాలం తెచ్చిన పెనుమార్పునకు నిదర్శనం.
ఇప్పుడు సంక్రాంతి పూర్తిస్థాయి వ్యవసాయ సంబంధి కాదు. ఊళ్లో వ్యవసాయం ఉంది కానీ, అది వ్యయంగా మారిపోయింది. అది సాయం కోరటం మొదలై చాలా ఏళ్లయింది. కుమ్మరి, కమ్మరి, మేదరి, చేనేత వంటి చేతివృత్తులు చెల్లిపోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడు కొత్త తరాలు ఊరి ఆధారంగా ఉండడం లేదు. ఈ కారణాల ప్రభావం సంక్రాంతి పండగ మీద గణనీయంగా కనపడుతోంది. పట్టణాల్లో స్థిరపడినవారు, వ్యాపార, ఉద్యోగాల్లో స్థిరపడిన వారు పండగల వేళ ఊరికి వెళ్లటం, సంబరాలకు ఆర్థికంగా సహకారం అందించటం పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే కళాకారులతో సాంస్క ృతిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో కోడిపందేలు వంటి జూదమే పెద్ద వినోద ప్రదర్శనగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడితో పందెం కోళ్ల పరిశ్రమ వర్థిల్లుతోంది. కొన్ని రికార్డింగు డ్యాన్సుల స్థాయి ప్రదర్శనలు పండగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయి. పిండివంటలు, ఇళ్లకు ముస్తాబులు, కొత్త బట్టలూ వంటివి ఇప్పుడు ఊరికి, ఊరివారికి పరిమితమై లేవు. ఒక్క ఫోను కాల్ దూరంలో ఏ సందడినైనా, ఏ పనినైనా ఈవెంటుగా మార్చేసే పేమెంటు సేవలు అందుబాట్లోకి వచ్చాయి.
ఇప్పుడు సాగుతున్న సాంప్రదాయక కళాప్రదర్శనల్లో చాలావి ఒకప్పుడు ఇలా ఉండేవి అన్న నమూనాలు మాత్రమే! అవి సజీవంగా ఉన్న వృత్తులు కావు. గతంతో పోలిస్తే ఇప్పటి పండగలకు ధగద్ధగలు, ధనం గలగలలు హెచ్చు. కానీ, జనం భాగస్వామ్యం దాదాపుగా లేదు. డబ్బు తీసుకొని ఎవరో ప్రదర్శిస్తారు. వేలూ లక్షలూ వెచ్చించినా జనం కళ్లల్లోని ఆస్వాదన హృదయం దాకా చేరటం లేదు. పండగంటే హృదయానందం కదా! మనుషులు కలగలసి, కలసిమెలసి ఆడిపాడే ఆనందమే పర్వదినం. అలాంటి సన్నివేశం మన పల్లెల ముఖాన వెల్లివిరియాలంటే- ఊళ్లు కేవలం అతిథి కేంద్రాలుగా ఉండిపోకూడదు. ఊళ్లు తన జనాన్ని తనే పోషించే స్వయంపోషకత్వాన్ని మళ్లీ సంతరించుకోవాలి. వ్యవసాయమూ, ఇతర జీవనోపాధి మార్గాలూ ఊరి చుట్టూ బలంగా అల్లుకోవాలి. ఊరిని, సాగుని అన్ని విధాలా ధ్వంసం చేసి, పండగలను సృష్టించలేం. ఊరిని, ఊరిలో ఉన్నవారిని ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే మళ్లీ ఊరూరా ఉత్సాహకరమైన సంక్రాంతి పండగ .. మనసారా ఉరకలెత్తే జనం పండగ.
మంచి మార్పు మన బాధ్యత
కాలం ఎప్పుడూ వెనక్కిపోదు. మన తలపులతో, తపనలతో సంబంధం లేకుండా ముందుకు పోతోంది. అలా వెళుతున్న కాలంలో, నెలకొంటున్న పరిస్థితుల్లో మంచినీ చెడ్డనీ మనం బేరీజు వేసుకోవాలి. ఒక తరహా పరిణామాలను ఆహ్వానిస్తూ, ఇంకో తరహా ఫలితాలను ఆశించలేం. గ్రామాలను, దాని ఆర్థిక పునాదులను దెబ్బ తీస్తూ, గ్రామాల సాంస్క ృతిక వైభవాన్ని ఎలా ఆశించగలం? ప్రజల ఉమ్మడి సంస్క ృతిలోకి వ్యాపారానికి, విద్వేషానికి చోటిచ్చి, సమైక్య సందోహాన్ని ఎలా వీక్షించగలం?
అందుకనే- ప్రజాకళలకు, ప్రజల సంస్క ృతికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజల ఆర్థిక పునాదులను సమున్నతంగా బలోపేతం చేయాలి. పండగ వైభవాల పునరుద్ధరణ పేరిట చాదస్తాల వైపు పోకుండా ‘పదిమందీ కలిసి సాగటమే పండగ’ అన్న స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. ఊళ్లు, ఊళ్లోని వృత్తులూ, వ్యక్తుల స్థితిగతులూ, ఆధునిక వసతులూ, సాంకేతిక పరిజ్ఞానమూ మార్పులకు గురైనప్పుడు – సంక్రాంతి వంటి పండగల రూపురేఖలూ మారతాయి. వాటిలోని మేలిమిని స్వీకరించి, తాలుని త్యజించాలి. మనుషుల ఆనంద పరమానందాల వ్యక్తీకరణకు పండగలు తప్ప, పండగ తతంగాల నిర్వహణ కోసం మనుషులు కాదన్న పరమార్థాన్ని సదా గుర్తు పెట్టుకోవాలి.
– సత్యాజీ
9490099167