క్యూబా రాజధాని హవానాలో పాట్రియా-4 (కొలొక్వియం) పేరిట అంతర్జాతీయ సదస్సు మార్చి 17 నుండి 19 వరకు జరిగింది. 46 దేశాల నుండి 300 మంది పైగా హాజరయ్యారు. క్యూబా జాతీయోద్యమ నేత జోస్ మార్టి ప్రారంభించిన పాట్రియ (PATRIA) పత్రిక 133వ వార్షికోత్సవం, లాటిన్ అమెరికాలో ప్రత్యామ్నాయ ఛానెల్ టెలిసూర్ 20వ వార్షికోత్సవం సందర్భంగా క్యూబా యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఈ సదస్సు నిర్వహించింది. హవానా విశ్వవిద్యాలయ ప్రాంగణం ఇందుకు వేదిక కాగా నిర్వహణలో టెలిసూర్ ఛానెల్ ముఖ్యపాత్ర పోషించింది. భారత దేశం నుండి ఆరుగురం- దేశాభిమాని చీఫ్ ఎడిటర్ పుతలత్ దినేశన్, నేను (ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాస్), థీక్కధీర్ డిజిటల్ ఎడిటర్ ఎం కణ్ణన్, కైరళి ఛానెల్ న్యూస్ ఎడిటర్ శరత్ చంద్రన్, న్యూ ఏజ్ ఎడిటర్ డాక్టర్ బికె కాంగో, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు కె శ్రీనివాస రెడ్డి- హాజరయ్యాం. నేను, కణ్ణన్ 15 నుండి 21 వరకు క్యూబాలో ఉన్నాం. 22 ఉదయమే తిరుగు పయనమయ్యాం. మూడు రోజులపాటు సదస్సుల సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో ముఖాముఖి, ఇష్టాగోష్టి ద్వారా ఆయా దేశాల్లో పరిస్థితుల గురించి తెలుసుకోగా మిగతా నాలుగు రోజులు హవానా నివాస ప్రాంతాల్లోను, అక్కడికి సమీపంలోని లా లిసా మునిసిపాలిటీలో, శాంటాక్లారా తిరిగి అక్కడి ప్రజలతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే మహదవకాశం కలిగింది. ఒక సోషలిస్టు దేశంలో పర్యటించి, వివిధ తరగతుల ప్రజలతో ముచ్చటించి ప్రత్యక్షంగా అవగాహన చేసుకోవడం గొప్ప అనుభూతి. ఆ విశేషాలతోనే ఈ ప్రత్యేక కథనం..
హవానా ఎయిర్‌పోర్ట్ నుండి హోటల్‌కు మినీ బస్‌లో మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ సమయంలో అసిస్టెంట్ డ్రైవర్ మాకు గైడ్‌గా వ్యవహరించి దారి పొడుగునా వున్న భవనాలు, వాటి వివరాలు తెలియజేశారు. ఆ క్రమంలోనే సిగల్ వ్యవస్థవున్నా అన్ని చోట్లా ట్రాఫిక్ పోలీసులు ఎందుకున్నారని మేము అడగ్గా విద్యుత్ లేక సిగల్స్ పని చేయడంలేదని చెప్పారు. ఆ వెంటనే ‘అమెరికా ఆర్థిక దిగ్బంధనం మూలంగా సగం మంది క్యూబన్లు ఒక రోజంతా చీకటిలో వుండాల్సి వస్తోంది. ఆ మరుసటి రోజు మిగతా సగం మందికి చీకటి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 34 గంటలకు పైగా ప్రయాణించిన బడలికతోవున్న మాకు సామ్రాజ్యవాద వ్యతిరేకమైన ఆ మాటలు వినగానే అమెరికాపై పట్టరాని కోపం వచ్చింది.
గోడలపై నాటి యుద్ధ జ్ఞాపకాలు..
మేము బస చేసిన హోటల్ నేషనల్ డి క్యూబాకి చేరుకున్నాము. పాత రాజభవనం, అదే విధంగా జూదగృహం (క్యాసినో హౌస్) గా వున్నదాన్ని హోటల్‌గా మార్చారు. యుద్ధం నాటి బుల్లెట్ గుర్తులు ఇప్పటికీ హోటల్ గోడలపై కనిపిస్తాయి. సముద్రం ఒడ్డున వున్న ఈ హోటల్ విదేశీ పర్యాటకులకు ప్రధాన కేంద్రం. దీనిని ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్నారు.
సదస్సు వేదిక 1728లో స్థాపించబడిన హవానా విశ్వవిద్యాలయం క్యూబాలో అతి పురాతనమైనది. ఇది మొదట్లో ఒక మతపరమైన సంస్థ. నేడు క్యూబా అంతటా దాని క్యాంపస్‌లు విస్తరించి ఉన్నాయి. ఆర్థికశాస్త్రం, సైన్స్, సామాజిక శాస్త్రాలు అన్నీ బోధిస్తారు. విశ్వవిద్యాలయంలోని ప్రతి మూలలో లాటిన్ అమెరికన్ స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారుల చిత్రాలున్నాయి.


పాట్రియా సదస్సు..
ఈ సదస్సు ప్రారంభం, ముగింపు సందర్భాల్లో క్యూబా అధ్యక్షుడు మిగాయిల్ డియాజ్-కానెల్ పాల్గొనడం దాని ప్రాధాన్యతకు ఒక సూచిక. తొలుత క్యూబా స్వాతంత్య్ర సమరయోధుడు జూలియో ఆంటోనియో మెల్లా విగ్రహం వద్ద అధ్యక్షుడు నివాళి అర్పించాక హవానా యూనివర్సిటీ మెట్ల మీదే ప్రతినిధులందరితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆ తరువాత పాట్రియా ప్రారంభ సభ జరిగింది. (వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు ముఖ్యంగా స్పానిష్ భాష రానివారికి విశ్వవిద్యాలయ విద్యార్థులు అనువాదం, ఇతర సహాయాన్ని స్వచ్ఛందంగా అందించారు. భారత ప్రతినిధులకు జర్నలిజం విద్యార్థులు కమీలా, మార్లా సహాయం చేశారు.) హవానా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి కర్లా అధ్యక్షత వహించగా, టెలిసూర్ ప్రెసిడెంట్ పట్టిసియా విజెగా ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంలోని ప్రజలు ముఖ్యంగా పోరాటాల్లో వున్న వారి మధ్య సమాచార సమన్వయం వుంటే ఉద్యమాలు మరింతగా విస్తరిస్తాయని ఆమె తెలిపారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు ఛావెజ్ చేసిన ప్రత్యామ్నాయ ఆలోచన ఆచరణలోకి తేవడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. 2005లో ప్రారంభించిన నాటి నుండి కార్పొరేట్ మీడియా కట్టుకథల్ని తుత్తునియలు చేస్తూ వాస్తవ వివరాలతో వార్తా కథనాలిస్తున్నామని చెప్పారు. టెలిసూర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్మెదా ఈ సభలో పాల్గొన్నారు. ఛానెల్ ప్రారంభించిన రోజున ధరించిన చొక్కానే వేసుకొని ఈ సభకు హాజరవ్వడం మరో ఆకర్షణగా నిలిచింది.

ఉచితంగా.. అత్యున్నత ప్రమాణాలతో విద్య..
విద్యార్థులు ఏ స్థాయిలో ఏ కోర్సు చదివినా పుస్తకాలు, భోజనం, వసతి సహా అన్నీ ఉచితమే! ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, యూనిఫాం ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. హైస్కూల్ చదువు తర్వాత ఏ కోర్సుకు వెళ్లాలన్నది విద్యార్థి అభిరుచిని తెలుసుకోవడంతోపాటు అతని / ఆమె సామర్ధ్యాన్ని ఉపాధ్యాయులు అంచనా వేశాక ఎంచుకుంటారు. ఫైనల్ ఎగ్జామ్‌కి ముందు దాదాపు మూడు నెలలు ఈ ప్రక్రియ అప్పుడప్పుడూ నడుస్తుందని మాకు సహాయపడిన కమీలా చెప్పారు. అంతిమంగా విద్యార్థి అభిరుచికే ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఉన్నత విద్య పొందాలనుకునే వారెవరైనా క్యూబా చరిత్ర, గణితం, స్పానిష్ భాష… ఈ మూడు సబ్జెక్టులతో ప్రవేశపరీక్ష రాయాలి. వైద్య కోర్సుతో సహా ఏది చదవాలన్నా ఇది తప్పనిసరి. అందులో వచ్చిన మార్కులు తొలి ప్రామాణికం. ఇక ఏ కోర్సు తీసుకుంటారో దాన్నిబట్టి మరో పరీక్ష, కొన్నిటికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటాయి. తమ బ్యాచ్‌లో హవానా విశ్వవిద్యాలయ జర్నలిజం కోర్సులో చేరడానికి 300 మందికిపైగా పరీక్ష రాయగా 60 మందిని ఎంపిక చేశారనీ, ఇప్పుడు 58 మంది మూడో ఏడాది చదువుతున్నట్టు మార్లా చెప్పారు.
విద్య విషయంలో అత్యున్నత ప్రమాణాలతో అధునాతన విద్య ఉచితంగా అందుతోంది. కేవలం క్యూబన్లకేగాక పాలస్తీనా, ఇంకొన్ని లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ దేశాలకు చెందిన విద్యార్థులకూ ఈ సౌకర్యం ఉంది. అయితే ఆయా దేశాల ప్రభుత్వాలకు, క్యూబా ప్రభుత్వానికి ఒప్పందం ఉండాలి. అలాగే స్పానిష్ భాష నేర్చుకోవాలి. ప్రవేశ పరీక్షలో నెగ్గాలి. ఆపైన క్యూబన్లతో సమానంగా అన్నీ ఉచితంగానే లభిస్తాయి. అలాంటి సౌకర్యం పొందిన ఒక పాలస్తీనా వైద్య విద్యార్థినితో మా ప్రతినిధివర్గం కలిసి మాట్లాడింది. క్యూబా విద్యార్థుల మాదిరిగానే దాదాపు 2,000 మంది పాలస్తీనా విద్యార్థులు హాస్టల్ వసతి సహా ఉచితంగా చదువుతున్నారని ఆమె చెప్పారు.
ఆరోగ్య రంగం క్యూబా బలం..
ఆరోగ్య రంగం క్యూబా బలం.. అందుకే ప్రకతి వైపరీత్యాలు, అంటువ్యాధుల సమయంలో ప్రపంచానికి సహాయం చేయడానికి క్యూబా వైద్యులను పారా మెడికల్ వర్కర్లను పంపగలిగింది. కోవిడ్ కాలంలో క్యూబా యాభైకి పైగా దేశాలకు వైద్యులను, వాలంటీర్లను పంపింది. క్యూబా 90 శాతానికి పైగా ప్రభావ రేటుతో వ్యాక్సిన్‌లను అభివద్ధి చేయగలిగిందనే వాస్తవం వారి విజయాలకు సూచిక. మరింత పురోగతికి అవసరమైన పరికరాలు, ఇతర వనరులను పొందటానికి దిగ్బంధనం అడ్డంకిగా మారుతోంది. క్యూబా వైద్యవిధానం కూడా వేరు. ఉపయోగించే మందులలో గణనీయమైన భాగం ప్రకృతిసిద్ధంగా తయారుచేసినవి కావడం గమనార్హం. బహుళజాతి కంపెనీలు తయారుచేసే ఖరీదైన ఔషధాల వినియోగం దాదాపు ఉండదని అంబులెన్స్‌లో సేవలందించే పారామెడిక్ చెప్పారు.
గ్లోబల్ నెట్‌వర్క్ ఆవశ్యకత..
ప్రారంభ సభ, ముగింపు సభ ఉమ్మడిగా జరగగా మూడు రోజుల్లో వివిధ అంశాలపై మూడు హాల్స్‌లో సమాంతర సదస్సులు నిర్వహించారు. ప్రజా ప్రతిఘటనోద్యమాలకు సాంకేతికత సహాయం ఉపయోగించడం ఎలా, భారీ సమాచార ప్లాట్‌ఫాంలకు ప్రత్యామ్నాయాలు నిర్మించడం, మానవ హక్కులు- టెక్నో పాలిటిక్స్ వంటి అనేక అంశాలను ఆయా రంగాల్లో నిష్ణాతులు, లాటిన్ అమెరికా దేశాల్లో మంత్రులుగా, ప్రభుత్వాల విధాన నిర్ణేతలుగా ఉన్నవారూ వివరించారు. అతికొద్ది తప్ప ఈ చర్చలన్నీ ప్రధానంగా స్పానిష్ భాషలో నడిచాయి. అయితే స్పానిష్‌యేతర ప్రతినిధులకు ఏకకాలంలో అనువాదం చేసే రేడియో రిసీవర్లు అందజేశారు. ఈ సమాంతర సెషన్లలో ఒకటిగా ‘ఆగెనెస్ట్ హెజిమొనీ స్ట్రాటజీ ఆఫ్ సౌత్ గ్లోబల్..’ అంశంపై నేను, శ్రీనివాసరెడ్డి మాట్లాడాము. మనదేశంలో మీడియాపై సాగుతున్న నిరంకుశ దాడులను వివరించాము. దేశంలో వ్యక్తమవుతున్న నయా ఫాసిస్టు ధోరణులను సభ దృష్టికి తెచ్చాను. ప్రజా ఉద్యమాల అభివృద్ధికి దేశాభిమాని, గణశక్తి, ప్రజాశక్తి, థీక్కధీర్, కైరళి వంటివి చేస్తున్న కృషి గురించి పేర్కొన్నాను. లాటిన్ అమెరికన్ దేశాల్లో పోరాడే ప్రజలకు సంబంధించిన వార్తా వ్యవస్థల మధ్య ఒకమేరకు నేడున్న సమన్వయం విశ్వవ్యాప్తం కావాలని, కనీసం మూడవ ప్రపంచ దేశాల మధ్య నెలకొనాల్సిన ఆవశ్యకతను వివరించేందుకు ప్రయత్నించాను.

ఉత్సాహంగా.. ఉత్తేజంగా..
ముగింపు సభలోనూ దేశాధ్యక్షుడు కానెల్ ప్రతినిధులతోపాటు పాల్గొన్నారు. టెలిసూర్ ప్రెసిడెంట్ తన ముగింపు ఉపన్యాసంలో మూడు రోజుల కొలొక్వియం కార్యక్రమాలను సింహావలోకనం చేసి, వచ్చే ఏడాది మరిన్ని దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యేలా నిర్వహించాలని ఆకాంక్షించారు. రాత్రి విందు అనంతరం సాగిన సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కానెల్ ప్రేక్షకులమధ్య ఉండడం గమనార్హం. జర్నలిస్టుల యూనియన్ నిర్వహించిన ఆ సదస్సును ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతగా భావించిందో మనకు విదితమవుతుంది. ప్రపంచ దేశాల్లోని సమాచార వ్యవస్థల మధ్య సమన్వయంతో పాటు పోరాడే ప్రజల సంఘీభావాన్ని సమీకరించడం పట్ల ఆసక్తి బోధపడుతుంది. మూడు రోజుల సదస్సు, సంబంధిత కార్యక్రమాలు ఆసాంతం ఉత్సాహంగా సాగాయి. ప్రతినిధులకు ఉత్తేజం కలిగించాయి.
‘చరిత్ర’ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ..
మేం వెళ్లిన ప్రతిచోటా ఏదో ఒక చారిత్రక అంశమో పురాతత్వప్రదేశమో కనిపించింది. వినియోగిస్తున్న భవనాలలో సైతం ఏ భాగంలో ఏది చారిత్రకమైనదో స్పెయిన్‌కు వ్యతిరేకంగా సాగిన క్యూబా జాతీయోద్యమంలో లేదా క్యూబన్ విప్లవంలో దాని పాత్రను వివరించే అంశాలున్నాయి. ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ పరిరక్షణ బాధ్యత చేపట్టింది. ఇది క్యూబా తన దేశ చరిత్ర, పోరాటాన్ని బలోపేతంగావించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనం. వాటికి అదనంగా వివిధ నగరాల్లో కొన్ని మ్యూజియంలు ఉన్నాయి. అవి చరిత్ర, పోరాట సంగ్రహాలయాలు. 20వ తేదీన మేము హవానాలో ‘రివల్యూషన్ మ్యూజియం’ సందర్శించాం. గ్రాన్మా అనే నౌక మ్యూజియంలో పెద్ద గాజు పెట్టెలో ఉంది. దీనిని 1943లో నిర్మించారు. అది 1956 నవంబర్ 25న ఫైడల్ కాస్ట్రో నేతత్వంలో 82 మంది ప్రయాణికులతో మెక్సికో నుండి బయలుదేరి, డిసెంబర్ 2న తూర్పు క్యూబాలోని లోసిలోస్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచే క్యూబా విప్లవం విప్లవాగ్ని వ్యాపించింది. కాస్ట్రో ఉపయోగించిన కీలక నౌక గ్రాన్మాను ఆశ్చర్యంగా, ఉత్సాహంగా చూశాం. (ఆ పేరుతోనే క్యూబా కమ్యూనిస్టు పార్టీ పత్రిక నడుస్తోంది.) ఈ మ్యూజియంలో విప్లవ సమయంలో ఉపయోగించిన వాహనాలను, స్వాధీనం చేసుకున్న విమానాలను కూడా ప్రదర్శించారు. విప్లవకారులు తమ పోరాటంలో ఎంత అంకితభావంతో ఉన్నారో, గెరిల్లా యుద్ధం ద్వారా విమానాలను కూడా ఎలా స్వాధీనం చేసుకున్నారో మనకు గుర్తు చేస్తుంది. దీని అవతల క్యూబన్ విముక్తికి సంబంధించిన మరింత విశాలమైన మ్యూజియం ఉంది. అయితే, నిర్వహణ పనుల (రెనొవేషన్) కోసం దానిని మూసివేశారు. సమీపంలోనే చిత్రాలు, చిత్రలేఖనాలు, విగ్రహాలతో కూడిన మరో మ్యూజియం ఉంది. అదీ చూశాం.
చే గువేరా మెమోరియల్ నిరంతర స్ఫూర్తి..
చే స్మారక కేంద్రానికి చేరుతుండగానే ఒక విధమైన స్ఫూర్తి మమ్మల్ని ఆవహించింది. అక్కడ భద్రపరచిన ప్రతి వస్తువూ చిత్రపటాలు ఉత్తేజాన్నిచ్చాయి. చే వాడిన పెన్ను, గన్నులతోపాటు ఆయన ఉపయోగించిన కెమేరా, బైనాక్యులర్స్, పెట్రోమాక్స్ లైట్‌తో సహా అక్కడ ప్రదర్శించారు. ఆయన చేతి రాతలు లేఖలు, డైరీ ప్రతులు భద్రపరిచారు. దేశాభివృద్ధి కోసం చే సాగించిన శ్రమదాన కార్యక్రమాల ఫొటోలు, కార్యకర్తలకు సూచనలిస్తున్నవీ ఉత్తేజం కలిగిస్తాయి. చే విప్లవ గమనంలో చివరి మజిలీ, సిఐఎ కుట్రతో గాలించి ఆయనను హత్యగావించిన వైనాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. చే అమరజ్యోతి వెలిగే హాల్‌లో నిశ్శబ్దం, వెలుపల వివిధ దేశాల పర్యాటకుల సందడి ఓ ఆశ్చర్యంలా ఉంటుంది.
కాస్ట్రో నినాద స్ఫూర్తి..
సోషలిజం ఎదురుదెబ్బలు తిని, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై ప్రపంచం అతలాకుతలమవుతున్న సమయంలో క్యూబా విప్లవ నేత, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫైడల్ కాస్ట్రో ఇచ్చిన ”సోషలిజం, కాకపోతే మరణం” అన్న నినాదం ప్రపంచ కమ్యూనిస్ట్టు ఉద్యమానికి ఒక అనిర్వచనీయమైన శక్తినిచ్చింది. కానీ, క్యూబా ఇప్పుడు కొత్త పరిస్థితిలో ఉంది. అమెరికా ఆంక్షలు దాని ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం ప్రారంభించాయి. సోషలిస్ట్ దేశమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ చక్కెర, పొగాకు, కాఫీ ఎగుమతిపై ఆధారపడి అభివృద్ధి చెందింది. ప్రసిద్ధ హవానా సిగార్లు పొగాకు వ్యవసాయానికి పునాది. అలాగే చక్కెర, ఇథనాల్, రమ్ తయారీకి చెరకు పంట పునాది. క్యూబా ఆర్థికవ్యవస్థలో పర్యాటకం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. 64.12 శాతం మంది శ్వేతజాతీయులు, 26.62 శాతం మంది మిశ్రమ జాతి వారు, 9.26 శాతం మంది ఆఫ్రో-క్యూబన్ జాతి సమూహాలు. 58.9 శాతం మంది క్రైస్తవులు, 17.6 శాతం మంది ఇతర జానపద మతాలకు చెందినవారు ఉన్నారు. అలాగే మత విశ్వాసులు లేనివారు కూడా 23.2 శాతం మంది ఉన్నారు. క్యూబా జాతి, మత వివక్షలు లేని దేశం.
కూడు, గూడు, విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత..
క్యూబాలో విద్య, వైద్యం, గృహవసతి పూర్తిగా ఉచితం. అయితే ఆయా కుటుంబాలు వినియోగించే విద్యుత్‌కు, నీటికి మాత్రం ఛార్జీలు చెల్లించాలి. ఇంటి సివిల్‌వర్క్ రిపెయిర్లతోసహా ప్రభుత్వమే నిర్వహిస్తుంది కానీ గృహోపకరణాల్ని నివాసితులే సమకూర్చుకోవాలి. అలాగే ఇంటి కేటాయింపులో వారి పని ప్రదేశానికి సామీప్యత, మొత్తం కుటుంబసభ్యుల సంఖ్య ప్రధానమైన కొలబద్దలని చెప్పారు. బియ్యం, రొట్టె, బీన్స్, కోడిగుడ్లు, వంటనూనె తదితర సరుకులు నామమాత్ర ధరకు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. లభ్యతను బట్టి మాంసం కూడా కొన్ని సందర్భాల్లో రేషన్ షాపుల ద్వారా ఇస్తారు.
ప్రజల స్నేహభావం..
క్యూబా ప్రజలు భారతదేశం పట్ల చాలా ప్రేమ చూపుతారు. రోడ్డు వెంట నడుస్తున్నప్పుడు ప్రజలు దగ్గరికి వచ్చి ‘మీది భారతదేశమా?’ అంటూనే ‘మీకు ఏదైనా సహాయం కావాలా?’ అని అడుగుతారు, ఆపై వీడ్కోలు చెప్పి వెళ్లిపోతారు. ఒకాయన ‘ఇక్కడి ఆహారం నచ్చిందా?’ అని అడిగాడు. మేం ఇష్టపడుతున్నామని చెబితే.. ‘అది అసంభవమని, మీది ఉప్పు కారం మసాలాలుండే (స్పైసీ) ఆహార’మన్నాడు. అతని స్నేహితుడు భారతదేశంలో ఉన్నాడని, అతడు వంటవాడని చెప్పాడు. భారతీయ ఆహారం అంటే తనకు ఇష్టమని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. క్యూబన్ ఆహారంలో రుచి కంటే ఆరోగ్యంపై దృష్టి ఎక్కువ. వాటిలో ఏవీ కారంగా లేవు. బాగా ఉడికిస్తారు. చికెన్, మటన్, పంది మాంసం మీకు నచ్చిన విధంగా దొరుకుతాయి. చేపలు ఎక్కువగా లభిస్తాయి. కూరగాయలు, ఆకు కూరలు వండినవి, పచ్చివీ ఆహారంతో వడ్డిస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్ సాధారణం.
సదస్సు రెండవ రోజు సాయింత్రం మేము పాట్రిక్ లుముంబా గురించి మూడు గంటల డాక్యుమెంటరీ చూశాము. అలీన విధానాన్ని అవలంబించడం ద్వారా లుముంబాకు మద్దతు ఇచ్చే భారతీయ నాయకులు ఈ చిత్రంలో చాలాచోట్ల కనిపించారు. ఆ సమయంలో భారతదేశం యొక్క వైఖరిని ప్రపంచం ఎంతగా స్వీకరించిందో ఈ చిత్రంలోని సన్నివేశాలు స్పష్టం చేశాయి. కాంగో ఖనిజ వనరులను జాతీయం చేయడానికి ప్రయత్నించిన లుముంబాకు వ్యతిరేకంగా గుత్తాధిపత్యాలు కదులుతున్నాయని దాని సారాంశం.


సమిష్టి క్షేత్రాల్లో వ్యవసాయం..
ప్రపంచ విప్లవకారునిగా పేరొందిన చే గువేరా మెమోరియల్‌కు హవానాకు 300 కిలోమీటర్ల దూరంలోని శాంటాక్లారాకు 21న వెళ్లాం. జాతీయ రహదారి పొడవునా చెట్ల నీడ, పంట పొలాలు ఉన్నాయి. అక్కడ వ్యవసాయం సమిష్టిగా చేస్తారు. భూసారం, సాగు నీటి లభ్యతను బట్టి పంటలు పండిస్తారు. ఎక్కడ ఏ పంట వెయ్యాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వందల ఎకరాల భూఖండాల్లో ఒకే పంట సాగు చేస్తున్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు (కనిష్టంగా వాడుతారని చెప్పారు) సరఫరా చేస్తారు. పనిముట్లు సొసైటీవే. రైతులు ఆ క్షేత్రాల్లో పని చేసినందుకు వేతనం పొందుతారు. పంట అమ్మాక డివిడెండ్ లభిస్తుంది. పనిని బట్టి స్త్రీ పురులందరికీ సమాన వేతనం ఇస్తారు. రోజుకు ఎనిమిది గంటల పని, ఆదివారం సెలవు. ప్రస్తుతం పంటల ముమ్మర సమయం కాదని జామ తోటలో కలుపుతీస్తున్న కార్మికులను కలిసినపుడు మాతో చెప్పారు.
మహిళల ముందంజ..
సోషలిస్ట్ వ్యవస్థలో వినిమయతత్వాన్ని పెంచి పోషించే మార్కెట్ వ్యవస్థ అభివృద్ధి చెందే అవకాశం లేదు. ప్రజల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వమే తీరుస్తుంది. అయితే నివాస ప్రాంతాల్లోనూ కొన్ని రోడ్లపైనా ఇంటిలోని ముందు గదిని షాపులా మార్చి, రిటైల్ వ్యాపారం సాగుతోంది. అక్కడ పచారీ సామాన్లతోపాటు కొన్ని చోట్ల బట్టలు తదితర రోజువారీ అవసరమైన సరుకులూ అమ్ముతారు. దాదాపు అన్నీ నిర్ణీతధరలే ఉంటాయి. అయితే కూడలి ప్రదేశాల్లో చిన్న సంతల మాదిరిగా ఉండే వాటిలో వివిధ సరుకులు ముఖ్యంగా పర్యాటకులు కొనడానికి బహుమతులు అమ్ముతారు. అక్కడ బేరాలుంటాయి. సంగీతం, కళ క్యూబన్ల గుండెల్లో ఉన్నాయి. వారు శ్రావ్యత కంటే పాప్ సంగీతాన్ని ఇష్టపడతారు. జానపద నృత్యాలు కూడా సంస్కతిలో భాగం. అన్ని వయసులవారూ ఉత్సాహంగా పాల్గొంటారు. సినిమా థియేటర్లు పుష్కలంగా ఉన్నాయి.
సమాజంలోని అన్ని రంగాలలోనూ మహిళలు ముందంజలో ఉన్నారు. వివిధ సంస్థలను మహిళలే నడుపుతున్నారు, నిర్వహిస్తున్నారు. కొలోక్వియంలో నాయకత్వ స్థానంలో ఉన్నదీ వారే!. క్యూబా ప్రజలు ఆకర్షణీయమైన రీతిలో దుస్తులు ధరిస్తారు. పురుషుల దుస్తుల శైలి సాధారణంగా ప్యాంటు, టీ-షర్టులకే పరిమితం. స్త్రీలు రకరకాల దుస్తులు ధరిస్తారు. పిల్లలు ఉదయాన్నే పాఠశాలకు చేరుకుంటారు. కళ్ళలో మెరుపులతో పిల్లల చేతులు పట్టుకుని వెళ్లే తల్లులను చూశాం. ప్రాథమిక సౌకర్యాలు ఉన్నప్పటికీ, మరిన్ని సౌకర్యాలను పొందలేకపోతున్న సంక్షోభంలో క్యూబా ఉందని ఈ పర్యటనలో మాకు అవగతమైంది. అయితే, చిన్న పిల్లవాడు సైతం దానికి కారణం అమెరికా ఆంక్షలే అని చెబుతాడు. దేశ సమస్యలను ప్రజలకు చాలా లోతుగా బోధించారు. అది ఇంటా బయటా జరిగే నిరంతర ప్రక్రియలా అనిపిస్తుంది.
నిరంతర ఆవిష్కరణల ద్వారా మాత్రమే ఏ గొప్ప దార్శనికత అయినా ముందుకు సాగగలదని క్యూబా అనుభవం మనకు తెలియజేస్తుంది. అమెరికా ఆంక్షలు క్యూబాకు ఆటంకం అయినప్పటికీ, వారు ఉన్నత రాజకీయ విధానాన్ని ఆయుధంగానూ రక్షణగాను ఉపయోగిస్తున్నారు. మార్క్సిజానికి కట్టుబడి, బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ సాగుతున్న క్యూబా ప్రగతిగాముకులకు ప్రభావశీలి. క్యూబా అన్ని విముక్తి పోరాటాలతో లోతుగా అనుసంధానించబడిన దేశం. క్యూబా అనేది ఒక దేశం పేరు మాత్రమే కాదు, సంక్షోభాలతో పోరాడుతున్న ప్రపంచానికి ఒక బలం. ఆ విధంగా, క్యూబా ప్రపంచానికి ఓ స్ఫూర్తి.
– బి. తులసీదాస్
9490099666