వివక్ష అంతంతోనే వికాసం..!

Feb 25,2024 13:43 #COVER STORY, #Sneha

‘ఒక్కసారైనా హోటల్‌లో టీ తాగి, మీ గ్లాసు మీరే కడుక్కున్నారా? మీ కులం వారికి ఇల్లు అద్దెకివ్వం అనే సమాధానం ఎప్పుడైనా విన్నారా? ఉన్నత పదవిలో వున్నా… కులం పేరుతో, అవమానాలకు గురయ్యారా? రంగును బట్టి జాతి వివక్షను ఎదుర్కొన్నారా? జెండర్‌ పేరుతో అణచివేతకు గురవుతున్నారా? మతం పేరుతో దాడులకు గురయ్యారా?’ అంటే- ప్రపంచ వ్యాప్తంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది అణచివేతకు, వివక్షకు గురవుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినా వందల యేళ్ల నుంచి దళితులు, బహుజనులు అంటరాని మంటల్లో కాలుతూ, ఊరి పొలిమేరల్లోనే జీవనం సాగిస్తున్నారు. సమతా మమతలు అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దళితులు హింసించబడుతూనే వున్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః’ అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు నివసిస్తారని అర్థం. కానీ నేడు స్త్రీలు అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు. ఇది పూర్తిగా అంతం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మార్చి 1వ తేదీ ‘జీరో డిస్క్రిమిమేషన్‌ డే’. వివక్షకు వ్యతిరేకంగా నిలబడే రోజు ఇది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

ఆధునిక కాలంలోనూ కుల, మత, జాతి, లింగ, ప్రాంత, వివక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల దేశంలో కుల, మత, ప్రాంత వివక్ష తీవ్రత ఎక్కువైంది. రెండు గ్లాసుల విధానం, దళితులకి ఆలయ ప్రవేశం వంటి వివక్ష నేటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వాస్తవం. అహ్మాదాబాద్‌కు ఇరవై మైళ్ల దూరంలోని బైల్ల గ్రామంలో మంచినీటి బావికి దళితులు వెళ్లాలంటే.. వారికి కేటాయించిన సమయంలో మాత్రమే వెళ్లాలి. మిగతా సమయంలో వారు నీళ్ళు తెచ్చుకుంటే, అపరాధ రుసుం చెల్లించాలి. అలాగే, ఓ దళిత విద్యార్థి కుండలో నీళ్లు తాగాడని చదువు చెప్పే టీచరే ఆ విద్యార్థిపై చనిపోయేంతగా కొట్టిన సంఘటన రాజస్తాన్‌లో జరిగింది. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకం కనిపిస్తాయి. దళితులు, గిరిజనుల పట్ల వారి ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, తిండి, చదువు, ఉద్యోగాల్లో వివక్ష అనేక రూపాల్లో వ్యక్తమౌతూనే వుంది. అలాగే.. ఈ రోజుకీ ఆడపిల్ల అంటే నష్టం అనే భావన కొనసాగుతున్నది. గర్భంలో వున్నది ఆడపిల్ల అని తెలిస్తే.. గర్భవిచ్ఛిన్నం చేయిస్తున్న సంఘటనలు నేటికీ మనం చూస్తున్నాం. మగపిల్లాడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడన్న మూఢనమ్మకం ఇంకా ప్రజల్లో వుంది. ముఖ్యంగా ఆడపిల్లలు విద్య, వైద్యం, ఆహారం, ఆస్తి వంటి విషయాలలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినా.. మానవ విలువలను కోల్పోతున్న పరిస్థితిని నేడు చూస్తున్నాం. ‘కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేం’ అంటారు అంబేద్కర్‌. మనదేశంలో వేళ్లూనుకుని వున్న కులం సమాజాభివృద్ధికి ఆటంకంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు ఉన్న మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండటానికి ప్రధాన కారణం- ఆర్థిక అసమానతలు, దేశంలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఆధిపత్య కులాల అణచివేత. మనదేశంలో ఒక శాతం సంపన్నులు జాతీయ ఆదాయంలో 22 శాతం కలిగి ఉండగా, 50 శాతంపైగా వున్న పేదలు 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారని వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ నివేదిక అంచనా వేసింది.

మనదేశంలోనూ వర్ణవివక్ష ..

మనదేశంలో మడి-మైల అనే తతంగమూ, కులం కుష్టూ, ఈనాటికీ సమస్త జీవితరంగాల్ని మహమ్మారిలా ఆవహించే వుంది. నేడు ఈ కులం కుష్టు యొక్క వికృత సంతానమైన అస్పృశ్యత, వివక్ష దాదాపు అన్నిరంగాల్లోనూ ప్రవేశించింది. ఈ వివక్షకు కొలమానమేమీ లేదు. నిత్యజీవితంలో వివక్ష చూపని రంగమూ లేదు.నాడు దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీని రైలు నుంచి గెంటివేసింది ఆయన ఒంటిరంగు కారణంగానే. ఆ అమానుషమైన వర్ణవివక్షను అంతమొందించాలని పాటుపడిన గాంధీజీ మాతృభూమిలోనే తామిప్పుడు జాతి వివక్షను ఎదుర్కొంటున్నామని ఆఫ్రికన్‌ జాతీయులు ఆరోపిస్తున్నారు. ‘నేను ప్రపంచం మొత్తం చుట్టి వచ్చాను. అయితే, భారత్‌లో ఎదుర్కొన్నంత వర్ణవివక్ష మరెక్కడా చూడలేదని, ఓ బహుళజాతి కంపెనీలో పెద్ద ఉద్యోగిని అయినప్పటికీ తాను వర్ణవివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని’ అంటున్నారు దక్షిణాఫ్రికాకు చెందిన ఒయామా. ‘ఈ వివక్ష భారత్‌లో మాత్రమే కాదు.. సొంత దేశంలోనూ తమను భారతీయులు చిన్నచూపు చూస్తున్నారని, ఇది మా మీద వారి మనసుల్లో పేరుకుపోయిన తప్పుడు భావజాలం’ అంటున్నారు ఫుమ్లానీ ఎంఫెకా. నేటి సమాజంలో వివక్ష ఇప్పటికీ ప్రబలమైన సమస్యగా వుంది. దీనికి మనదేశం మినహాయింపేమీ కాదు. అట్టడుగు కులాలు,ఎల్‌జిబిటీ కమ్యూనిటీ, స్త్రీలతో సహా అట్టడుగు వర్గాలు తమ జీవితంలోని వివిధ అంశాలలో వివక్షను, పక్షపాతాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి కులం, మతం, జాతి, జెండర్‌, లైంగిక ధోరణి, సామాజిక హోదాతో సంబంధం లేకుండా సమానత్వాన్ని చూపాలి. ‘వివక్ష అనేది నయం చేయవలసిన వ్యాధి. విద్య, అవగాహన మాత్రమే దానికి విరుగుడు’ అంటారు నందితాదాస్‌.

వివక్ష అంటే ?

సమాజంలో అనాదిగా రకరకాల వివక్షలు కొనసాగుతున్నాయి. మనుషులందరూ జన్మతః సమానమే అయినప్పటికీ కుల, మత, ప్రాంత, లింగ బేధాలతో సరైన గుర్తింపు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఈ వివక్షను తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంతో పాటు.. ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు తీసుకురావాలి. ‘వివక్షను గుమ్మం నుంచి వెళ్ళగొడితే, అది కిటికీలో నుంచి మళ్ళీ ప్రవేశిస్తుంది’ అంటారు ఫ్రెడ్రిక్‌ ద గ్రేట్‌, ప్రష్యా రాజు.

వివక్షకు గురైన వ్యక్తులు, సంఘాలు, సమాజాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మానవ హక్కులను ఉల్లంఘిస్తుంది, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అడ్డంకులు సృష్టిస్తుంది. పేదరికం, అసమానతలను శాశ్వతం చేస్తుంది. ‘సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి మొదటి అడుగు వివక్షను గుర్తించడం, పరిష్కరించడం’ అంటారు కిరణ్‌బేడీ.

మత వివక్ష ..ప్రపంచంలోని మతాలన్నీ పురుషాధిక్యత కలిగినవే. మత గ్రంథాలన్నీ దాదాపు పురుషులు రాసినవే. మత గ్రంథాలన్నింట పురుష పెత్తనమే కొనసాగింది. మనువు స్త్రీని అస్పృశ్యురాలిగా చిత్రించాడు. సమాజంలో బానిస వ్యవస్థను రూపొందించటానికి అస్పృశ్యతను సమాజంపై రుద్దాడు. కన్నతల్లినే అస్పృశ్యురాలిగా చూసిన పితృస్వామ్య వ్యవస్థ కర్కశ రూపాన్ని మనం అవగాహన చేసుకుంటే కానీ హిందూ సమాజపు పునాదులు మనకు అవగతం కావు. ‘

ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి/ యినుప గజ్జెల తల్లి జీవనము సేయు/ గసరి బుసగొట్టు నాతని గాలిసోక/ నాల్గు పడగల హైందవ నాగరాజు’ అని హిందుత్వాన్ని తీవ్ర ధ్వనితో నిరసించాడు జాషువా. ఇస్లాం మతం, క్రైస్తవ మతం కూడా హిందూ భావజాలంతో నిండిపోయాయి. ఇస్లాం మతంలో హిందూ మత భావనలతో పాటు అభద్రతతో కూడిన అనేక మూఢ నమ్మకాలు ఉన్నాయి. ముస్లిం మత ఆచారాలు అంతర్గతంగా స్త్రీని అణచి వేస్తున్నాయి. క్రైస్తవ మతంలో అయితే కులం అలాగే ఉంది. ఏ మతానికీ స్త్రీని అణగదొక్కే హక్కు లేదు. రాజ్యాంగమే దేశంలోని ప్రజలందరికీ గీటురాయి. రాజ్యాంగంలోని హక్కులకు మత వివక్ష లేదు, లింగ బేధం లేదు. ఇటీవల కాలంలో హిందూత్వ వాదం మరింత పెచ్చరిల్లిపోతోంది. మైనారిటీ మతస్తుల పట్ల వివక్ష పూరిత దాడులకు తెగబడుతోంది.

లింగ వివక్ష

ఉద్యోగాల విషయంలో స్త్రీ పురుషుల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకే రకమైన అర్హతలు, సామర్థ్యం వున్నా.. గుర్తింపు, సామాజిక నేపథ్యం కారణంగా తేడాలు చూపించడమే వివక్ష. సామాజిక చిన్నచూపు, పక్షపాత ధోరణి ఈ వివక్షకు కారణమని తాజా నివేదిక వెల్లడించింది. వీరితోపాటు నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగున వున్నవారు, గిరిజనులు, ముస్లింలు కూడా ఈ వివక్షకు బలౌతున్నారు. మహిళలు, ఇతర సామాజిక వర్గాలు అసమానత, వివక్ష ఎదుర్కోవడానికి కారణాలు చదువు లేకపోవడమో, అనుభవం లేకపోవడమో కాదు. వారి పట్ల వున్న వివక్షే కారణమని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌, అఫ్ఘనిస్థాన్‌ తదితర దేశాల్లో బాలికల చదువు, స్వేచ్ఛపైనా ఇప్పటికీ ఆంక్షలు కొనసాగడం విషాదం. చివరికి వారి వస్త్రధారణపైనా ఆంక్షలు ఎక్కువవుతున్నాయి. మనదేశం దీనికి అతీతమేమీ కాదు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బాలికలపై పని భారం ఎక్కువవుతున్నది. తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం.. అధిక శాతం బాలికలు పౌష్టికాహారం లోపం, హిమోగ్లోబిన్‌ లోపంతో బాధ పడుతున్నారు. బాలికలు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆడపిల్లల పట్ల చూపుతున్న ఈ వివక్ష నుంచి బయటపడాలంటే, ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా పెంచాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 60 కోట్ల మంది బాలికలకు మెరుగైన భవిష్యత్తు కల్పించినప్పుడే ప్రపంచం లింగ సమానత్వంతో వర్థిల్లుతుంది.

కుల వివక్ష

సమాజంలో అనాదిగా రకరకాల వివక్షలు కొనసాగుతున్నాయి. మనుషులందరూ జన్మతః సమానమే అయినప్పటికీ కుల, మత, ప్రాంత, లింగ బేధాలతో సరైన గుర్తింపు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ‘కుల వ్యవస్థ హిందూ సమాజంలోని పెద్ద రుగ్మత. అది ఆర్థికాభివృద్ధికి అవరోధంగా వుంది. అణగారిన కులాల ఉన్నతికి అడ్డుగోడగా వుంది. సామాజిక అభివృద్ధిలోను, సామాజిక విస్తృతిలోను కులం వాడల్లో జీవిస్తున్న వారిని ఎదగకుండా చేస్తోంది’ అంటారు అంబేద్కర్‌. ఈ వివక్షను తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంతోపాటు.. ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు తీసుకురావాలి. ఈ వివక్షల్లో ప్రాంతాల వారీగా వాటి తీవ్రతలో కొంత తేడా వున్నప్పటికీ.. వివక్షలైతే కొనసాగు తున్నాయి. ఈ వివక్ష లింగ, కుల, మత, వర్ణ వివక్ష వంటివి అనేక రూపాల్లో కొనసాగుతున్నాయి. ‘నిమ్న జాతుల కన్నీటి నీరదములు/ పిడుగులై దేశమును కాల్చివేయునని’ అని హెచ్చరించాడు.. గర్జించాడు.. శాసించాడు.. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీశాడు జాషువా.

వివక్షపై పోరాటం..

కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుండి కుల వివక్ష, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా క్రియాశీలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించింది. వీటన్నిటి ఫలితంగా మన రాజ్యాంగంలో రిజర్వేషన్‌ సదుపాయం కల్పించబడింది. దీన్ని సహించ లేని శక్తులు నాడు కొన్ని ఉన్నాయి. నేడు ఆ శక్తుల ప్రతినిధులు దేశ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. రిజర్వేషన్ల మీద, వాటికి అండగా ఉన్న రాజ్యాంగం మీద దాడిని ఎక్కుపెట్టారు. రాజ్యాంగాన్ని మార్చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా భావజాలాన్ని సృష్టిస్తున్నారు. ఈ భావజాలం తలకెక్కిన విద్యార్థులు, ప్రొఫెసర్లు రిజర్వేషన్‌ వల్ల విద్యావకాశాలు పొందిన విద్యార్థుల మీద తీవ్రమైన మానసిక వేధింపులు, అవమానాలకు పాల్పడుతున్నారు. తరగతి గది మొదలు, లైబ్రరీ, ఆటస్థలం, హాస్టల్‌ ఇలా ప్రతిచోటా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. అనేక యూనివర్శిటీలలో మెస్‌ హాళ్లలో నాన్‌ వెజిటేరియన్‌ విద్యార్థులను ప్రత్యేకంగా కూర్చోబెట్టడం, వారు ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు వేరుగా ఉంచడం లాంటి వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. రిజర్వేషన్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందకుండా లేదా ఉత్తీర్ణత సాధించకుండా ప్రొఫెసర్లు అడ్డుకుంటున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. పిహెచ్‌డిలు చేయడానికి అనేక ఆటంకాలు కల్పిస్తున్నారు. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేని విద్యార్థులు చదువులను మధ్యలోనే మానేయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. వీటన్నింటకీ మూలం పాలక పార్టీలు తమ ఎన్నికల ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్న కుల, మత రాజకీయాలు. ప్రధాని మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మత క్రతువులు, కుల సభలకు ముఖ్య అతిథులుగా హాజరై, కులాల మధ్య చిచ్చును రగిలిస్తున్నారు. వీటి ప్రభావం విద్యాలయాల్లో కుల, మత వివక్షగా కొనసాగుతోంది.

తిరోగామి భావజాలం ..దేశవ్యాప్తంగా ధర్మ పరిరక్షకుల అవతారం ఎత్తిన కొద్దిమంది ప్రవచనకారులు తమ వాగ్దాటితో కుల, మత అసమానతలను, వివక్షను పెంచి పోషిస్తున్నారు. ఆధునిక జీవితానికి ఇంగ్లీషు విద్య తప్పనిసరి అని చెబుతున్న పాలకులు, వారి వందిమాగధులు ఆధునిక వేషాలు వేసుకున్న అనేకమందిలో కుల భావాలు, కుల వివక్ష పాటించే పద్ధతులు ఎందుకున్నాయో చెప్పాలి. మరోవైపు అట్టడుగు వర్గాల ఓట్ల కోసం అనివార్యంగా కొన్ని రాయితీలను అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అంతిమ విజేతలు ఉన్నత వర్గాల వారే. వామపక్ష విద్యార్థి ఉద్యమం బలంగా ఉన్న చోటే సామాజిక వివక్ష వ్యతిరేక వాతావరణం బలంగా ఉంది. అలాంటి విద్యార్థి ఉద్యమాలను ప్రోత్సహించడం నేటి ప్రజాతంత్ర వాదుల కర్తవ్యం.

వివక్ష రేపిన విధ్వంసం..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలను తోసిరాజంటోన్న అమెరికాలో వర్ణ వివక్ష, జాత్యహంకారం పరాకాష్టకు చేరింది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతమే దీనికి పెద్ద ఉదాహరణ. నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ (46) మరణం ఆ దేశమంతటా పెను ప్రకంపనలు రేపింది. ఫ్లాయిడ్‌ గొంతుపై ఓ పోలీసు అధికారి కాలువేసి గట్టిగా అదిమిపెట్టడంతో.. ఫ్లాయిడ్‌ ప్రాణాలు విడిచాడు. జాత్యహంకారం నేపథ్యంలోనే ఫ్లాయిడ్‌ను చంపేశారని అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయులు భగ్గుమన్నారు. అంతేకాకుండా అమెరికాలోని అనేక నగరాలు ఆందోళనలతో రగిలిపోయాయి. అమెరికా గత కొన్నేళ్లుగా శాంతియుతంగా ముందుకు వెళుతోందని, ఉద్యోగాల్లో అందరికీ సమాన హక్కు కల్పిస్తున్నారనీ, తెల్లజాతి, నల్లజాతి అన్న బేధం లేకుండా పయనిస్తోందనీ చెబుతున్నదంతా నివురుగప్పిన నిప్పు మాత్రమేనని జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం ప్రపంచానికి వెల్లడించింది.

జీరో డిస్క్రిమినేషన్‌ డే ప్రాముఖ్యత..

మార్చి 1వ తేదీ ‘జీరో డిస్క్రిమిమేషన్‌ డే’. మనుషుల్లో జాతి, లింగ, లైంగికత, వయస్సు, మతం, వైకల్యం అనేవి అడ్డుగోడలు కాదని, మనుషులంతా సమానమనే భావనను తెలియపరిచేందుకు ఏర్పాటుచేసిన రోజు ఇది. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, చేరిక, సహనాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకించిన రోజు. వ్యక్తులు, సంఘాలు, సమాజాలపై వివక్ష, దాని ప్రభావం గురించిన అవగాహన పెంచడం ఈ రోజు ప్రధాన లక్ష్యం. UNAIDS ప్రకారం, ‘ప్రపంచ జనాభాలో 70% కంటే ఎక్కువ మందికి అసమానత పెరుగుతోంది, విభజన ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.’ ఐక్యరాజ్యసమితి మొట్టమొదట 2014లో జీరో డిస్క్రిమినేషన్‌ డే క్యాంపెయిన్‌ను ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఈ రోజు ఉద్యమంలా ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. వివక్షపై అవగాహన పెంచడంపై, ప్రచారంపై దృష్టి సారించింది. ప్రజలు అన్ని రకాల వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రోత్సహిస్తుంది. గతేడాది ”జీవితాలను రక్షించండి: నేరాలను తొలగించండి” అనే థీమ్‌ను హైలైట్‌ చేయగా, ఈ ఏడాది ‘ఎయిడ్స్‌, HIV రోగులను దోషులుగా చూడకుండా, వారి జీవితాలను రక్షించుదాం’ థీమ్‌ను తీసుకొచ్చింది.

సామరస్య పూర్వకమైన, న్యాయమైన సమాజాన్ని సాధించడానికి, అన్ని రూపాల్లో వివక్షను తొలగించడం చాలా అవసరం. వివక్ష రహిత సమాజాన్ని సాధించేందుకు మొదటి దశలో విద్య, అవగాహన అవసరం. పాఠశాల కార్యక్రమాలు, కమ్యూనిటీ ఈవెంట్‌లు, ప్రజల అవగాహన ప్రచారాల ద్వారా దీనిని సాధించవచ్చు. చిన్నతనం నుండే ప్రజలకు విద్యను అందించడం ద్వారా, వైవిధ్యానికి భయపడకుండా విలువలను స్వీకరించే తరాన్ని మనం సృష్టించగలం. అ వివక్షను ప్రోత్సహించడంలో ప్రభుత్వ విధానాలు, చట్టాలూ కీలకపాత్ర పోషిస్తాయి. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా, సమాన అవకాశాలు పొందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. వివక్ష నిరోధక చట్టాలు.. వ్యక్తులందరి హక్కులను పరిరక్షించడం ద్వారా దీనిని సాధించవచ్చు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సమానంగా అందించడం ద్వారా సమగ్ర సమాజాన్ని సృష్టించే దిశగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి.

దైనందిన జీవితంలో వ్యక్తులను ప్రభావితం చేయడమే కాకుండా, వారి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై వివక్ష గణనీయమైన ప్రభావం చూపుతుంది. వివక్ష ఒంటరితనం, నిరాశ, ఆందోళన వంటి భావాలకు దారి తీస్తుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. వివక్షను ప్రోత్సహించడం ద్వారా, వివక్షకు భయపడకుండా వ్యక్తులు అభివృద్ధి చెందగల సమాజాన్ని మనం సృష్టించగలం. ‘వివక్ష మనిషిని బతికున్న శవంగా మారుస్తుంది. ఈ వివక్షను మొక్కలోనే తుంచి వేయాలి. వివక్ష ఎటువంటిదైనా మనిషి పతనానికి కారణ మవుతుంది. నువ్వు ఆకాశంలోకి ఎగరాలను కుంటే, ముందు నిన్ను కిందికి లాగి పడేసే చెత్తని, బరువుని వదిలించుకోవాల్సిందే’ అంటారు నల్ల జాతి ప్రజలపై శతాబ్దాలుగా కొనసాగిన అణిచివేత రూపాల్ని తన రచనలతో తూర్పారబట్టిన టోనీ మారిసన్‌. వివక్ష కేవలం లక్ష్యం కాదు, వాస్తవికమైన వివక్ష రహిత సమాజాన్ని సృష్టించే దిశగా సాగే గమ్యం.

రాజాబాబు కంచర్ల

94900 99231

➡️