ప్రత్యక్ష పాఠం!

Feb 16,2025 10:44 #Sneha, #Stories

చలికాలం వచ్చింది. గురుకులంలో విద్యార్థులు బద్ధ్దకాన్ని పెంచుకొని చదువు పట్ల అశ్రద్ధ చూపసాగారు. గురువైన రామానందుడు ఇది గమనించాడు. ఒక రోజు శిష్యులతో ఓ చెట్టు కింద కూర్చుని పాఠం బోధించటానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నిన్న చెప్పిన పద్యాలను అప్పజెప్పమని శిష్యులను కోరాడు రామానందుడు. అందరూ నసుగుతూ నిలబడ్డారు. ఏ ఒక్కరూ నోరు పెగల్చలేదు. రామానందుడుకి కోపం వచ్చింది. కానీ శిష్యులతో గురువు ప్రవర్తించిన తీరు సున్నితంగా ఉండాలని రామానందుడు అనుకున్నాడు. ‘పిల్లలూ! మీలో గొప్పవారెవరో పరీక్షించాలనుకుంటున్నాను. వారికి భవిష్యత్తులో తిరుగుండదు’ చెప్పాడు. శిష్యులంతా రామానందుడు వైపు ఆశగా చూశారు.
‘మీ పేరు మీ ఎడమచేత్తో రాయాలి. అది చూసి మీలో గొప్పవారెవరో చెబుతాను’ ఆసక్తిగా చెప్పాడు రామానందుడు.
పిల్లల్లో ఉబలాటం పెరిగింది. అందరూ కలాలు పట్టుకొని ప్రయత్నించారు. తర్వాత గురువుకి చూపించారు. ఒక్క సునందుడు మాత్రమే గొప్పవాడు అని ప్రకటించాడు రామానందుడు.
‘అయితే మేమంతా పనికిరానివాళ్లమా?’ పెదవి విరిచారు మిగిలిన శిష్యులు.
‘మీరెవరూ మీ పేర్లను దస్తూరిగా ఎందుకు రాయలేకపోయారు?’ ప్రశ్నించాడు రామానందుడు.
‘సునందుడుకి మొదటి నుండి ఎడమచేత్తో రాయడం అలవాటు. మాది కుడిచేతి వాటం అందుకే ఎడమచేతితో చక్కని దస్తూరీలో రాయలేకపోయాం’ నిజాన్ని చెప్పారు మిగిలిన పిల్లలు.
‘ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని’ అన్నాడు రామానందుడు.
‘అవును…అవును’ అంటూ అన్నారు ఆ పిల్లలు.
‘చదువు కూడా అంతే.. నిత్యమూ సాధన చేస్తుంటే మంచి ఫలితాలు వచ్చి, గొప్ప జ్ఞానవంతులుగా నిలుస్తారు. చలికాలపు మొద్దు నిద్రతో సాధనకు దూరమైతే బద్ధకస్తులుగా మిగిలిపోతారు. సునందుడు కూడా ఇప్పుడు కుడిచేత్తో రాయడం సాధన చేస్తే గొప్పవాడుగా మారతాడు’ అని వివరించాడు రామానందుడు. ప్రత్యక్ష పాఠంలో సారాన్ని గ్రహించిన శిష్యులు బద్ధకాన్ని విడిచిపెట్టి అప్పటి నుండి చదువుపై దృష్టి పెట్టసాగారు.

– బి.వి.పట్నాయక్‌.
83098 72913

➡️