వద్దన్నదే చేయ
సిద్ధపడు పాపాయి!
ఉద్దాలకుని భార్య
పద్ధతిగ వుందోయి!!
వ్యతిరేక పద్ధతిగ
వ్యవహరించాలింక
అని తలచినా తాత
అనెను పాపాయితో
”పాఠాలు ఈ రోజు
పఠించ వద్దులే!
ఆడుకో పాపాయి
ఆడుకో ఇకపోయి!!”
ఆటలూ వద్దనుచు
పాఠాలు ముద్దనుచు
పుస్తకం తెచ్చింది
బుద్ధిగా పాపాయి!!
శ్రద్ధగా పాఠాలు
చిదివింది పాపాయి!
”చూచివ్రాతా వద్దు
లేచి ఇక ఆడుకో!”
అని తాత చెప్పినా
వినకుండా పాపాయి
తూచతప్పక రాసె
చూచిరాతను గూడ!!
పారింది పాచికని
పరవశించిన తాత
మైమరచి అన్నాడు
మామూలు ధోరణిలొ!!
”సంచిలో పుస్తకం
సక్రమంగా పెట్టు!
సరిగ పెట్టకపోతె
చిరిగేను పుస్తకం!!”
చిర్రెత్తి పుస్తకం
చింపింది పాపాయి!
వెర్రెత్తి తాతకూ
బుర్ర తిరిగీపోయి!!
వద్దన్నదే చేయు
ఉద్దాలకుని భార్య
ఉదంతం మారిదే
ఇదంతం అయ్యింది!!
– ‘బాలబంధు’అలపర్తి వెంకటసుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001