కర్షకుడంటే తెలుసా..!?

Feb 2,2025 10:35 #Do you know the farmer?, #Sneha

పిడికెడు బువ్వను అడుగు
కర్షకుడంటే ఎవరో చెప్తాది
మట్టిని పెకిలించి చదును చేసే
గడ్డపార స్వేదాన్ని అడుగు
కర్షక లోకమంటే వివరిస్తాది
భూమిని చీల్చుకుంటూ ఎదిగే
పిల్ల మొక్కను అడిగి చూడు
రైతు రెక్కల కష్టం చెబుతాది
చెమట చుక్కల తడి నుంచి
చిగురించే చిగురులాంటోడు
మట్టి పరిమళాల సువాసన నుండి
గింజలై వెదజల్లేవాడు
ఒక్కసారి కర్షకుని వైపు చూడు
ఆకలి విలువ తెలుస్తాది
ఒకేసారి రైతు బతుకులోకి
మనసు పెట్టి తొంగి చూడు
అరువు కష్టాల కన్నీరు కనిపిస్తాది
నేటి గింజల రాశి వైపు చూడు
గిట్టుబాటు లేని రేటు కింద
నిలువునా నలిగిపోతూ కానొస్తాది
ఎదగలేక ఎదుగుతున్న మొక్కను
ఎప్పుడైనా తట్టి లేపి పలకరించావా
ఒక్కసారి స్పర్శించి చూడు
తెగులు సోకిన శోకంతో
ఉసురు పోతున్నట్టు విలపిస్తాది
కర్షకుడంటే ఇప్పటికైనా తెలుసా
నాలుగు మెతుకుల్ని పోగేసేవాడు
డొక్కల్ని నింపి ఆనందపడేవాడు
ఒక్కసారి రైతు వైపు చూడు
అసలైన పథకం స్ఫురణకు వస్తాది
సిసలైన ప్రయోజనం ఉంటాది

నరెద్దుల రాజారెడ్డి, 9666016636

➡️