అందమైన పూలతోట
ఆకర్షణగా ఉన్నది
రంగు రంగు పూలు పూచి
రమణీయంగా ఉన్నది
ఇన్ని రంగు లిన్ని పూలు
ఏనాడూ చూడలేదు
కన్నుల పండుగ చేస్తూ
కమనీయంగా ఉన్నది
ఇది వసంత రుతువు కనుక
ఇంత శోభగా ఉన్నది
చూసే కొలదీ ఇంకా
చూడాలనిపిస్తున్నది
అప్పుడు ఒక తేనెటీగ
ఆ తోటకు వచ్చింది
అటూ ఇటూ ఎగిరి తిరిగి
అన్ని పూలు చూసింది
పూవు పూవు తిరిగి, తేనె
బొట్టు బొట్టు సేకరించి
పట్టుకు చేరెయ్యాలని
పని ప్రారంభించింది
తేనెటీగ ఒక్క క్షణం
తీరికగా ఉండలేదు
పనియే దైవం అంటూ
భావిస్తుందది ఎప్పుడు
సోమరిగా తిరుగుతున్న
దోమ ఒకటి అచటున్నది
తేనెటీగ వంక చూసి
తేలికగా ఇట్లన్నది
”పూవు పూవు తిరిగి, తేనె
పోగుచేసు కొనాలా?
చిన్ని పొట్ట నింపుకొనుట
కిన్ని పాట్లు పడాలా?
అందుబాటులో ఉన్నది
ఆరగించలేవా?
రేపటి ఆహారానికి
ఇపుడు వెదకు టేలా?
కష్టపడుట ఎరుగ నసలు
నే బతుకుట లేదా?
నా మార్గం సరికాదా?
నీకు నచ్చలేదా?”
అహంభావి అయిన దోమ
అజ్ఞానంలో ఉన్నది
తన వాదన సరియైనది
అనియేతా ననుకున్నది
కష్టజీవి తేనెటీగ
స్పష్టంగా విన్నది
తన నడవడి ఈ దోమకు
తెలియదు అనుకున్నది
కావున ఒక మంచి మాట
చెప్పాలనుకున్నది
నచ్చచెప్పు ధోరణిలో
నెమ్మదిగా అన్నది
”మన పొట్టలు నింపుకొనుట
మన బాధ్యత కాదా?
పరులను బాధించు బతుకు
పాపం కాబోదా?
ఎప్పటి కప్పుడు తిండికి
వెదకికొంటు ఉంటావా?
ముందుగ జాగ్రత్త పడుట
మంచిది కా దంటావా?”
అనుక్షణం కష్టపడుట
తేనెటీగ లక్షణం
సోమరిగా గడపటమే
దోమ సహజ లక్షణం
తేనెటీగ సిద్ధాంతం
దోమ తాను మెచ్చునా?
దుర్మార్గుల కెప్పుడైన
మంచి మాట నచ్చునా?
తేనెటీగ మాట లేవి
దోమ చెవుల కెక్కలేదు
ఒకటో రెండో విన్నా
అవీ లక్ష్యపెట్టలేదు
ఆ క్షణాన ఆ దోమకు
ఆకలి వేసింది
తిండి కొరకు పరిసరాలు
తిరిగి తిరిగి వెతికింది
ఒక మూలన తోటమాలి
కూర్చుంటే చూసింది
హుషారుగా వెళ్లి అతని
చేతి మీద వాలింది
వాలీవాలంగానే
ఆత్రంగా కుట్టింది
చాచి అతడు కొట్టగానె
చచ్చి నేల పడింది
స్వశక్తిపై జీవించుట
సంతృప్తిని పెంచును
పరాధీనమైన బతుకు
పతనానికి దించును
-హెచ్.ఆర్.చంద్రం
9493248053