ఆలోచన శక్తిని రగిల్చిన చైతన్యం… మాటల్లో చెప్పలేనంత సంతోషం.. పండగలన్నీ ఒకేసారి పిల్లల ముందుకు చేరిన సందర్భం. ఫిబ్రవరి 14, 15, 16వ తేదీల్లో పిల్లల పండగ ఆద్యంతం సంబరంగా సాగింది. ఆ మూడు రోజులూ పసి హృదయాలను ఓలలాడిస్తూ ‘అనంత బాలోత్సవం-5’ వేడుకలా సాగింది. ఆటపాటలతో మెప్పించి, వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆలోచింపజేసి… అందరినీ ఆకట్టుకునేలా చేశారు. తమకు అవకాశం ఇస్తే ఏమైనా చేయగలమని చిచ్చర పిడుగులు నిరూపించారు. మూడు రోజుల పాటు ఆ’బాల’గోపాలాన్ని అలరిస్తూ.. ఉరిమే ఉత్సాహంతో.. మూడు రోజుల పాటు అనంత కేంద్రంగా జరిగిన ఈ పిల్లల పండగ ప్రతి ఒక్క చిన్నారి మదిలోనూ చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలింది. అనంతపురం లలితకళా పరిషత్, కల్లుసుబ్బారావు కళాక్షేత్రం, లలితకళా పరిషత్ పూర్వపు కార్యదర్శులు ఎ.నరసింహమూర్తి, గాజుల నారాయణస్వామి ప్రాంగణంలో బాలోత్సవాలు జరిగాయి. అనంత బాలోత్సవం కమిటీ ఛైర్మన్ షమీమ్ షఫీవుల్లా, కార్యనిర్వాహక కార్యదర్శి వి.సావిత్రి, అనంత బాలోత్సవ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి జిలాన్,
మిగిలిన కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేసి, బాలోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
