తెనాలిలో ఉండే రామయ్య, సీతమ్మ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు జగదీష్. రామయ్య బంగారం వస్తువుల తయారీపని చేసేవాడు. తమ ఒక్కగానొక్క కొడుకు జగదీష్‌ని బాగా చదివించి పెద్ద ఉద్యోగంలో చూడాలని ఆ దంపతులకు ఆశ. అయితే జగదీష్‌కు చదువు పట్ల ఆసక్తి ఉండేదికాదు.
ఏడవ తరగతి చదువుతున్న జగదీష్‌కు- మొదటి నెల యూనిట్ పరీక్షలలో అన్నింటిలో పాస్ మార్కులు వచ్చాయి. అవి చూసిన తల్లదండ్రులిద్దరూ కోప్పడ్డారు. అయినా నోరెత్తలేని పరిస్థితి జగదీష్‌ది. తల్లిదండ్రులకు తన మనసులోని మాట చెప్పలేక, చదువు మీద ధ్యాస పెట్టలేక ఒత్తిడికి లోనయ్యాడు. ఒకసారి ఇంటి నుండి పారిపోదామాని ఆలోచించాడు. తల్లిదండ్రులకు దు:ఖం మిగల్చడం ఇష్టం లేక ఆగిపోయాడు.
ఇలా ఉండగా ఒకనాడు జగదీష్ మామయ్య వెంకటేశ్వరులు వచ్చాడు. ఆయన సీతమ్మ తమ్ముడు. మాటల సందర్భంలో ‘ఏరా జగదీష్? ఎంత వరకూ వచ్చింది నీ చదువు? బాగా చదువుతున్నావా?’ అని అడిగాడు. ఇంతలో జగదీష్ తల్లి కలగజేసుకొని, ‘చదువు మీద వాడికేమి ఆసక్తి ఉన్నట్లు కనిపించటం లేదు. మనకా తాతల, తండ్రుల ఆస్తులేవీ లేవు. వీడు కాస్త గట్టిగా చదివితే ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగమన్నా రాకపోతుందా? మా కష్టాలు గట్టెక్కక పోతాయాని చిన్న ఆశ. వాడికి మా బాధ ఎప్పటికీ అర్థమవుతుందో, ఏమిటో? నువ్వన్నా నాలుగు మంచి మాటలు చెప్పరా!.’ అని అంది సీతమ్మ.
వెంకటేశ్వర్లు, జగదీష్ వైపు తిరిగి ‘ఏంటిరా? అమ్మ ఇలా అంటోంది?’ అని అడిగాడు సమాధానం కోసం ఎదురు చూస్తూ. జగదీష్ ఏమి మాట్లాడలేదు. ‘సరే అక్కా! వాడు చిన్నవాడు. ఇప్పుడు ఏది చెప్పినా అర్థంకాదు. నాతో వాడిని పంపించు. నా దగ్గర ఉంచి, క్రమం తప్పకుండా సలహా ఇస్తే పరిస్థితిలో ఏదైనా మార్పు రావచ్చు’ అన్నాడు వెంకటేశ్వర్లు. కొడుకు చదువు గురించి ఆలోచించి, సరేనన్నారు. వెంకటేశ్వర్లు- తన ఇంటికి జగదీష్‌ని తీసుకుని వెళ్లాడు.
వారం రోజుల తర్వాత ఒకనాడు వెంకటేశ్వర్లు తన సోదరి సీతమ్మ ఇంటికి వచ్చాడు. తమ్ముడ్ని చూసిన వెంటనే జగదీష్ గురించి అడిగింది. ‘వాడు చాలా లోతైనవాడు అక్కా!. చిన్న విషయాలకు బయటపడడు. ఇక్కడుంటే వాడు మానసికంగా కుంగిపోతాడు. వాడి చదువు, భవిష్యత్తు పూచి నాది. వాడిని ప్రయోజకుడిని చేసే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి’ అని అన్నాడు.
సీతమ్మ , రామయ్య ఆలోచించుకుని ‘సరే’ అన్నారు. జగదీష్ బట్టలు, పుస్తకాలు తీసుకొని తన ఊరు ప్రయాణమైనాడు వెంకటేశ్వర్లు. సంవత్సరాలు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు జగదీష్ స్వస్థలం తెనాలి వచ్చి, తల్లిదండ్రులను చూసి, స్నేహితులను, బంధువులను కలుస్తున్నాడు. ఒకరోజు ఒక టెలివిజన్‌లో విడుదల కాబోయే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నది. హఠాత్తుగా ‘జగదీష్’ పేరు పిలిచారు. అది చూసి.. తల్లిదండ్రులిద్దరూ ఒకరిమొఖాలు మరొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. టివీలో కనిపిస్తోంది ఎవరో కాదు, తమ ఏకైక పుత్రుడు జగదీషే. వాళ్లిద్దరికీ ఒళ్ళు గగుర్పొడిచింది.
‘అత్యంత చిన్నవయసులో సంగీతంలోని అన్ని ఇనుస్ట్రుమెంట్స్ వాడటంలో ఎంతో నైపుణ్యం ప్రదర్శించిన జగదీష్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను పెద్దగా చదువుకోకపోయినా తన నూతన బాణీలను సాఫ్ట్‌వేర్‌లో చేసి, ట్రాక్స్ మీద ఎక్కించగలడు. ఇతనికి అది జన్మతో వచ్చిన విద్యనిపించింది. ఎన్నెన్నో కొత్త కొత్త బాణీలను అలవోకగా కట్టి, గాయకులతో ట్రాక్స్ మీద పాడించి, సాఫ్ట్‌వేర్‌గా మార్చి సంగీత కంపెనీలకు అందిస్తున్న ఇతని సామర్ధ్యం నేను స్వయంగా చూశాను. అందుకే నిర్మాతలతో మాట్లాడి, అతనికి ఈ అవకాశం కలిపించాను. ఇప్పడు ఈ సినిమాకు ఆయన చేసిన రెండు పాటలనూ ఆయనే విడుదల చేస్తాడు. ఈ కొత్త యువ దర్శకుడికి మీరు తగిన ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నా. నౌ జగదీష్ స్టేజ్ ఈస్ యువర్స్’ అంటూ జగదీష్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి, పక్కకు తప్పుకున్నాడు ఆ ప్రముఖ డైరెక్టర్.
ఇతర విషయాలలోకి పోకుండా, క్షణం ఆలస్యం చేయకుండా రెండు పాటలను విడుదల చేశాడు. ఆడిటోరియంలో కరతాళధ్వనులు మిన్నంటాయి. జగదీష్ కళ్ళల్లో రెండు ఆనంద భాష్పాలు కనుకొనకల్లోంచి రాలాయి. అదే పరిస్థితి జగదీష్ తల్లిదండ్రులది. వారం తర్వాత మామయ్య వెంకటేశ్వర్లుతో జగదీష్ స్వస్థలమైన తెనాలి వచ్చాడు.
ఒక్కసారిగా జగదీష్‌ని చూసి ఉక్కిరిబిక్కిరి అయింది సీతమ్మ. అయితే ‘ఇదెలా సాధ్యం?’ అన్న విషయం మాత్రం రామయ్య, సీతమ్మకు బోధపడలేదు. సందేహం అర్థం చేసుకొని జగదీష్ ‘ఇదంతా మామయ్య ఇచ్చిన గిఫ్ట్. నాకు చదువు మీద కన్నా సంగీతం మీద, వాయిద్యాలపైన ఎక్కువ ఆసక్తి ఉన్న సంగతి గ్రహించారు. నన్ను హైదరాబాద్‌లోని ప్రముఖ సంగీత డైరెక్టర్ల దగ్గర పనికి కుదిర్చాడు. అక్కడ అన్ని వాయిద్యాలు, సంగీతం నేను వేగంగా నేర్చుకున్నాను. నా నైపుణ్యం చూసి, నా చేత ప్రైవేట్ ఆల్బమ్‌లు చేయించారు. మంచి పేరు సంపాదించాను.
ఇదిగో ఈ రూ.50 లక్షాల చెక్కు. ఇకపై పని మానేసి, హాయిగా ఒక మంచి ఇల్లు కట్టుకొని, జీవితం గడపండి. సాఫ్ట్‌వేర్ వాళ్లకన్నా ఉద్యోగం పోతుందనే భయం ఉండవచ్చు. కానీ, నాకు ఆ భయంలేదు. నాలో ప్రతిభ ఉంది. బయట మార్కెట్లో సంగీతానికి గుర్తింపు ఉంది!’ చెప్పాడు జగదీష్.
ప్రతిఒక్కరూ పిల్లల మనసు తెలుసుకుని, వారిని ప్రోత్సహిస్తే, వారి బంగారు భవిష్యత్తు బాగుంటుంది. పక్కవాళ్లతో పోల్చుకుంటూ పిల్లల్ని పెంచితే.. వారిలో ఉన్న ప్రతిభ బయటపడదు. పిల్లల మనసు తెలుసుకోండి. అప్పుడే మీ బాధ్యత సరిగా నెరవేర్చినట్టు!’ చెప్పాడు వెంకటేశ్వర్లు. దూరాన ఎక్కడినుంచో జగదీష్ చేసిన ఆల్బంలోని వేణు గానం వినిపిస్తున్నది. అది వింటున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
డా|| కొప్పరపు నారాయణ మూర్తి
7671909759