సమ భావన

Jun 9,2024 11:48 #Sneha

గాంధీ నగర్‌లో రామ్మోహన్‌ ధనికుల్లో ఒకడు. అతని కొడుకు పేరు శ్రీకాంత్‌. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచాడు రామ్మోహన్‌. శ్రీకాంత్‌ ఏది అడిగితే అవి కొని పెడుతూ ఉండేవాడు తండ్రి. ప్రతీరోజూ, శ్రీకాంత్‌ ధనికుల కుటుంబాలకు చెందిన పిల్లలతో తిరగడం, ఆడడం ఇంకా స్కూల్‌కి వెళ్లడం ఇది వాడి జీవన విధానం. ఒకరోజు తండ్రి సెల్‌ఫోన్‌ కొని వాడికి ఇచ్చారు. అప్పటి నుండి బడిలో ఉన్న పేద కుటుంబాల పిల్లలూ శ్రీకాంత్‌ చుట్టూరా తిరుగుతూ ఉండేవారు. దాంతో వారితో మంచి స్నేహం ఏర్పడింది. ధనికుడైనా అహంకారము శ్రీకాంత్‌ వారి పట్ల చూపేవాడు కాదు. అప్పుడప్పుడు వారి ఇంటికి వెళుతూ ఉండేవాడు. వారి జీవన విధానం గమనిస్తూ ఉండేవాడు. వారి బట్టలు సరిగా ఉండేవి కావు. వారిని చూసి జాలి పడేవాడు.
ఇలా ఉండగా, తండ్రి రామ్మోహన్‌, శ్రీకాంత్‌కి ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఒక పండగలా జరుపుతారు. ఈసారి తండ్రితో, శ్రీకాంత్‌ తన పేద స్నేహితులందరినీ పిలవమని అంటాడు. దానికి తండ్రి చాలా ఆనందించి వారందరినీ పిలుస్తారు. వారందరికి మంచి భోజనం పెట్టించి, బట్టలు పెడతాడు శ్రీకాంత్‌. స్నేహితులంతా చాలా సరదాగా గడుపుతారు. అది చూసి శ్రీకాంత్‌ చాలా ఆనంద పడతాడు. ఆనాటి నుండి అతను మనసులో ప్రతిధనికుడు పేదవారిని ఆదుకుంటే బాగుండును అని ఆలోచిస్తాడు.
కొంతకాలానికి తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడు. కానీ ఉద్యోగం రాదు. రామ్మోహన్‌ ఒక పెద్ద పరిశ్రమను స్థాపించి, శ్రీకాంత్‌ని మేనేజర్‌గా చేస్తాడు. అప్పుడు శ్రీకాంత్‌ తన ఇండిస్టీలో పేదవాళ్ల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు. తోటి స్నేహితులందరికీ అండగా నిలుస్తాడు. తక్కువ కాలంలోనే బాగా అభివృద్ధి సాధించి, పరిశ్రమలు ఎన్నో పెట్టి పేదవారిని ఆదుకుంటాడు. అది చూసి తండ్రి కొడుకును మెచ్చుకుంటారు.

  • బళ్ల కృష్ణవేణి
    93989 05803
➡️