నువ్వు వెళ్లిపోయినా…!

నువ్వు వెళ్లిపోయినా…
నువు నాటిన మొక్క చెట్టయింది
పూలు పూస్తూనే వుంది
పరిమళిస్తూనే వుంది
కాలం అంచున నిలబడి
చెరిగిపోని నీ రూపాన్ని తలుస్తూనే వుంది
చిగురులు వేస్తూనే వుంది

నువ్వు వెళ్లిపోయినా…
నీ నవ్వుల కిలకిలలు కోయిల కువకువలై
విరబూస్తూనేవున్నాయి
నీ మాటల గలగలలు
గుమ్మానికి కట్టిన తోరణాల్లా
పచ్చగా కళకళలాడుతూనే వున్నాయి
నీ అడుగుజాడలు
వసంతాల్ని పూయిస్తూనే వున్నాయి

నువ్వు వెళ్ళిపోయినా…
ఒంటరి సమయాల్లో
విరిసిన ఏకాంతాలన్నీ
ఆశల ఉషోదయాలవుతున్నాయి
ఆపై విరిగి వడిలిన సంధ్యలవుతున్నాయి
ఉషోదయాస్తమయ రంగులచాపంలో
మేఘాల మాటున దాగిన రూపం కోసం
మేఘాలను వేడుకుంటున్నా కరిగిపొమ్మని..

నిదురేరాని నిశీధులలో
మిద్దెమీద పచార్లు చేస్తున్నప్పుడల్లా
చిరుగాలి తరకలాగో
వెన్నెల జిలుగులాగో
మలయమారుత వీచికలాగో
తాకిపోతున్న స్పర్శలకు
భ్రమపడుతున్నా క్షణకాలం
నువ్వెళ్లిపోయావన్న సత్యం మరచిపోయి…

పుస్తకాల గదిలో కూర్చున్న ప్రతిసారీ
పుస్తక ముఖచిత్రాలన్నీ
నీ రూపుకడుతున్నాయి
అక్షరాలన్నీ కవితా మాలికలవుతున్నాయి
పుస్తకాలనిండా పోహళించిన ఊసులన్నీ
చిగురించిన తోటల్లో రివ్వున ఎగిరే
సీతాకోక చిలుకల్లా అల్లుకుంటున్నాయి

నువ్వు వెళ్లిపోయాక కూడా
చెరిగిపోని రూపాన్ని
చెదిరిపోని జ్ఞాపకాలని
తలచుకొని తడుముకొని
గుండెలకు అదుముకొని
గుండె గదినిండా నిక్షిప్తం చేసుకుంటున్నా
అవేకదా… నా ఊపిరికి ఇంధనాలు

నువ్వు వెళ్ళిపోయావన్న నిజం
కఠిన వాస్తవమే అయినా…
మళ్ళీ వస్తావని
మనసు చెబుతోంది
నువు వచ్చేలోపు
నువు నాటిన పూలచెట్టు ఎండిపోతుందేమో…
ఫర్వాలేదులే…
శిథిలమైన చెట్టు మొదలులో చూడు
నీ స్పర్శకోసం తపించే
ఒక్క మొలకైనా వుండకపోదు…
రేపటి ఉషోదయానికి
ఆహ్వానం పలికే మిణుగురులా…

– రాజాబాబు కంచర్ల
9490099231

➡️